Asianet News TeluguAsianet News Telugu

జమ్మూకాశ్మీర్ లో దారుణం.. ఉగ్రవాదుల కాల్పుల్లో పోలీసు మృతి..

జమ్మూ కాశ్మీర్ లోని బారాముల్లా ఓ హెడ్ కానిస్టేబుల్ ను ఉగ్రవాదులు దారుణంగా హతమార్చారు. ఆయన తన ఇంటి సమీపంలో నిలబడి ఉండగా.. ఉగ్రవాదులు కాల్పులు జరిపారు. స్థానికులు ఆయనను హాస్పిటల్ తరలించినప్పటికీ.. చికిత్స పొందుతున్న సమయంలోనే మరణించారు.

Atrocity in Jammu and Kashmir.. Police killed in firing by terrorists..ISR
Author
First Published Nov 1, 2023, 9:48 AM IST

జమ్మూకాశ్మీర్ లో దారుణం జరిగింది. ఓ పోలీసును ఉగ్రవాదులు కాల్చి చంపారు. ఆయన ఇంటి సమీపంలోకి వెళ్లి మరీ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. మూడు రోజుల్లో లోయలో జరిగిన మూడో దాడి ఇది. ఈ ఘటనతో భద్రతా దళాలు అప్రమత్తమయ్యాయి. ఉగ్రవాదుల కోసం గాలింపు చర్యలు చేపట్టాయి. 

వివరాలు ఇలా ఉన్నాయి.  జమ్ముకశ్మీర్ పోలీస్ కంట్రోల్ రూమ్ (పీసీఆర్ ) విభాగంలో గులాం మహ్మద్ దార్ హెడ్ కానిస్టేబుల్ గా విధులు నిర్వహిస్తున్నారు. ఆయన బారాముల్లా జిల్లా క్రాల్పోరాలో నివసించేవారు. మంగళవారం ఆయన తన ఇంటి సమీపంలో నిలబడి ఉన్నారు. ఈ సమయంలో కొందరు గుర్తు తెలియని ఉగ్రవాదులు ఆయనపై కాల్పులు జరిపారు.

దీంతో మహ్మద్ దార్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు ఆయనను వెంటనే చికిత్స తంగ్మార్గ్ లోని ఎస్డీ హాస్పిటల్ కు తరలించారు. అక్కడ ఆయన చికిత్స పొందుతున్న సమయంలోనే పరిస్థితి విషమించి మరణించారు. కాగా.. మూడు రోజుల్లో లోయలో ఉగ్రవాదులు దాడి చేయడం ఇది మూడోసారి.

సోమవారం పుల్వామా జిల్లాలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో ఉత్తరప్రదేశ్ కు చెందిన వలస కార్మికుడు మృతి చెందాడు. పుల్వామాలోని తుమ్చి నౌపోరా ప్రాంతంలో యూపీకి చెందిన ముఖేష్ అనే కార్మికుడిపై ఉగ్రవాదులు కాల్పులు జరిపారని, ఆ తర్వాత అతను మరణించాడని కశ్మీర్ జోన్ పోలీసులు ఎక్స్ (ట్విట్టర్)లో ధృవీకరించారు.

అలాగే అక్టోబర్ 29న శ్రీనగర్ లోని ఈద్గా మసీదు సమీపంలో ఉగ్రవాదులు జరిపిన కాల్పుల్లో జమ్ముకశ్మీర్ పోలీస్ ఇన్ స్పెక్టర్ మస్రూర్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డారు. ఈద్గా మైదానంలో స్థానిక యువకులతో కలిసి క్రికెట్ ఆడుతుండగా కాల్పులు జరిపారు. వెంటనే ఆయనను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. కాగా.. ఈ దాడికి తామే బాధ్యులమని లష్కరే ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ రెసిస్టెన్స్ ఫ్రంట్ (టీఆర్ ఎఫ్) ప్రకటించింది.

Follow Us:
Download App:
  • android
  • ios