ఢిల్లీలో దారుణం జరిగింది. ఆరేళ్ల బాలికపై ఓ సీనియర్ విద్యార్థి లైంగిక దాడికి పాల్పడ్డాడు. స్కూల్ బస్సులోనే ఆ బాలుడు ఈ దుశ్చర్యకు ఒడిగట్టాడు. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
దేశ రాజధాని ఢిల్లీలో దారుణం జరిగింది. ఓ బాలికపై తన సీనియర్ విద్యార్థి స్కూల్ బస్సులోనే లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిని ఉపసంహరించుకోవాలని స్కూల్ మేనేజ్మెంట్ నుంచి ఆమెకు ఒత్తిడి వచ్చింది. దీంతో ఢిల్లీ మహిళా కమిషన్ సీరియస్ అయ్యింది. ఈ విషయంలో పోలీసులకు నోటీసులు జారీ చేసింది.
వివరాలు ఇలా ఉన్నాయి. పోలీసుల, ‘ఎన్డీటీవీ’ కథనం ప్రకారం.. వాయవ్య ఢిల్లీలోని రోహిణి ప్రాంతానికి చెందిన ఆరేళ్ల బాలిక బేగంపూర్ ప్రాంతంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో చదువుకుంటోంది. ఆ బాలిక ఎప్పటిలాగే ఆగస్టు 23వ తేదీన కూడా స్కూల్ కు వెళ్లింది. స్కూల్ బస్సులో తిరిగి తను నివాసం ఉంటున్న ప్రాంతానికి బయలుదేరింది. అయితే మార్గమధ్యంలో ఆ బాలికపై సీనియర్ విద్యార్థి లైంగిక వేధింపులకు పాల్పడ్దాడు.
స్కూల్ బస్సు ఆమె నివాసం ఉండే సొసైటీ గేటు వద్దకు చేరుకుంది. ఆ బాలిక కోసం తల్లి అక్కడ ఎదురుచూస్తోంది. అయితే ఆ చిన్నారి మూత్రం కారణంగా బ్యాగ్ తడిసిపోయి ఉండటాన్ని తల్లి గమనించింది. దీంతో ఏం జరిగిందని ఆరా తీయగా.. బాలిక జరిగిన విషయం చెప్పింది. దీంతో బాధితురాలి తల్లి బేగంపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకొని, ఈ ఘటనపై సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే ఈ ఫిర్యాదును ఉపసంహరించుకోవాలని పాఠశాల యాజమాన్యం ఆమెపై ఒత్తిడి తీసుకొచ్చింది. దీంతో ఆమె ఈ విషయాన్ని ఢిల్లీ మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లింది.
దీంతో సీరియస్ అయిన మహిళా కమిషన్.. డిప్యూటీ పోలీస్ కమిషనర్ కు నోటీసులు జారీ చేసింది. ప్రైవేట్ స్కూల్ బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు సంబంధించి తీసుకున్న చర్యలపై సమాచారం ఇవ్వాలని కోరింది. ఈ విషయాన్ని చెప్పనందుకు, పిల్లల గుర్తింపును బహిర్గతం చేసినందుకు లైంగిక నేరాల నుండి పిల్లల రక్షణ (పోక్సో) చట్టం కింద చైర్మన్, పాఠశాల మేనేజర్, ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్, ఇతర పాఠశాల అధికారులపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారా అని కమిషన్ తన నోటీసులో ప్రశ్నించింది.
