దారుణం.. భార్యతో గొడవ పడి.. 18 నెలల కూతురిని నేలకు కొట్టి చంపిన తండ్రి..
భార్యతో గొడవ పడి ఓ వ్యక్తి దారుణానికి పాల్పడ్డాడు. 18 నెలల కూతురును దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలోని థానే జిల్లాలో జరిగింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.

అతడికి 26 ఏళ్లు. కొన్నేళ్ల కిందట ఓ మహిళతో వివాహమైంది. వారి దాంపాత్య జీవితానికి గుర్తుగా ఓ కూతురు జన్మించింది. ఆ పాపకిప్పుడు 18 నెలలు. అయితే కొంత కాలంగా అతడు తాగుడికి బానిసయ్యాడు. దీంతో తరచూ భార్యతో గొడవకు దిగుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా మళ్లీ ఆమెతో గొడవపడ్డాడు. కోపంలో కూతురును దారుణంగా హతమార్చాడు. ఈ ఘటన మహారాష్ట్రలో జరిగింది.
వివరాలు ఇలా ఉన్నాయి. మహారాష్ట్రలోని థానే జిల్లాకు చెందిన అల్తాఫ్ మహ్మద్ సమీవుల్లా అన్సారీ (26) కు కొన్నేళ్ల కిందట వివాహమైంది. అతడు తన భార్యతో కలిసి దైఘర్ గావ్ లోని అభయ్ నగర్ ప్రాంతంలో నివాసం ఉంటున్నాడు. వీరికి ఓ కూతురు జన్మించింది. ఆ కూతురుకి ప్రస్తుతం 18 నెలల వయస్సు ఉంటుంది. అన్సారీ కూలి పనులు చేస్తూ కుటుంబాన్ని పోషించేవాడు. అంతా చక్కగా సాగిపోతోందని అనుకుంటున్న సమయంలో అతడు తాగుడికి బానిస అయ్యాడు.
దీంతో తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడేవాడు. ఆమెతో వాగ్వాదానికి దిగేవాడు. ఈ క్రమంలో 15 రోజుల కిందట కూడా ఆమెతో గొడవపడ్డాడు. ఈ సారి వారి మధ్య వాగ్వాదం ఎక్కువైంది. దీంతో అన్సారీ తన భార్యతో పగ పెంచుకున్నాడు. మళ్లీ శుక్రవారం కూడా సాయంత్రం 6 గంటల సమయంలో ఇంటికి వచ్చి భార్యతో గొడవపడ్డాడు. ఆమెను చితకబాదాడు.
అనంతరం అక్కడే ఆడుకుంటున్న కూతురును బయటకు లాక్కొచ్చాడు. పసికందును బలంగా నేలకు కొట్టాడు. దీంతో తీవ్రగాయాల పాలైన బాలిక అక్కడికక్కడే మరణించింది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న థానే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అతడిపై ఐపీసీ సెక్షన్ 302 (హత్య), 325 (తీవ్రంగా గాయపరచడం), ఇతర సంబంధిత నిబంధనల కింద కేసు నమోదు చేశారు.