దారుణం.. ఫోన్ గేమ్స్ ఆడొద్దని తల్లి మందలించడంతో ఆత్మహత్య చేసుకున్న పదేళ్ల బాలుడు.. ఎక్కడంటే ?
స్కూల్ కు వెళ్లకుండా ఫోన్ లో గేమ్స్ ఆడుతున్న కుమారుడిని ఆ తల్లి మందలించింది. దీంతో మనస్థాపం చెందిన ఆ బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో వెలుగులోకి వచ్చింది.

ఫోన్ అతిగా వాడకూడదని తల్లి మందలించడంతో ఓ కుమారుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ లో చోటు చేసుకుంది. ఆ బాలుడు కొంత కాలంగా మొబైల్ లో గేమ్స్ ఆడేందుకు బానిసయ్యాడని, అందుకే అతడి నుంచి తల్లి ఫోన్ తీసుకుందని వార్తా సంస్థ ‘ఐఏఎన్ఎస్’ నివేదించింది. దీంతో మనస్థాపానికి గురైన బాలుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
వివరాలు ఇలా ఉన్నాయి. లక్నో సిటీ చిత్వాపూర్‌లోని హుస్సేన్‌గంజ్ ప్రాంతానికి చెందిన 10 సంవత్సరాల బాలుడు కొంత కాలంగా ఫోన్ లో గేమ్స్ ఆడేందుకు అలవాటుపడ్డాడు. దీంతో స్కూల్ కు వెళ్లడం మానేశాడు. పది రోజులుగా స్కూల్ కు వెళ్లకుండా ఇంట్లో ఫోన్ పట్టుకొని కూర్చుకుంటున్నాడు. గంటల తరబడి ఫోన్ పట్టుకొని గేమ్స్ ఆడాడు. దీనిని ఆపేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నించారు. కానీ ఆ బాలుడు తల్లిదండ్రుల మాట వినలేదు.
కుమారుడు ఫోన్ అతిగా వాడటం పట్ల తల్లి ఆందోళన చెందింది. సోమవారం బాలుడి నుంచి ఫోన్ తీసుకొని మందలించింది. దీంతో ఆ పిల్లాడు కోపంతో ఓ గదిలోకి వెళ్లి తలుపులు వేసుకున్నాడు. కొంత సమయం తరువాత దీనిని కుటుంబ సభ్యులు గమనించారు. తలుపు తీసేందుకు ప్రయత్నించారు. కానీ తలుపులు తెరుచుకోలేదు.
గట్టిగా అరిచినా లోపల ఉన్న కుమారుడి నుంచి ఎలాంటి సమాధానమూ రాలేదు. దీంతో తలుపులు పగులగొట్టాలని కుటుంబ సభ్యులు నిర్ణయించుకున్నారు. చివరికి తలుపులు ధ్వంసం చేసి లోపలికి వెళ్లడంతో ఆ బాలుడు ఆత్మహత్య చేసుకొని కనిపించాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కేసు నమోదు చేసుకొని విచారణ జరుపుతున్నట్టు సెంట్రల్ జోన్ డీసీపీ అపర్ణ రజత్ తెలిపారు. తల్లి వాంగ్మూలం ఇంకా నమోదు కాలేదని పేర్కొన్నారు.
ఇలాంటి ఘటనే ఈ ఏడాది జూన్ లో ముంబైలో చోటు చేసుకుంది. 16 ఏళ్ల బాలుడు ఫోన్ కు బానిస అయ్యాడని తల్లి మందలించింది. దీంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. వివరాలు ఇలా ఉన్నాయి. జూన్ 8వ తేదీన ఆన్ లైన్ బాలుడు గేమ్స్ ఆడుతూ కూర్చున్నాడు. దీనిని తల్లి గమనించి.. ఫోన్ పక్కన పెట్టి చదువుకోవాలని సూచించింది. దీంతో కోపంతో బాలుడు సూసైడ్ లెటర్ రాసి ఇంటి నుంచి పారిపోయాడు.
తల్లి ఆ లెటర్ ను చదవింది. అందులో తాను సూసైడ్ చేసుకునేందుకు ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని, ఇక ఎప్పటికీ ఇంటికి తిరిగి రాను అంటూ పేర్కొన్నాడు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే పోలీసు స్టేషన్ ను సంప్రదించారు. పోలీసులు బాలుడు కోసం వెతకడం ప్రారంభించారు. ఆ తర్వాత మలాద్-కందివాలి రైల్వే స్టేషన్ల మధ్య ఎవరో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో పోలీసులు అక్కడికి వెళ్లి విచారణ ప్రారంభించారు. ఆత్మహత్య చేసుకున్నది.. ఇంట్లో లెటర్ పెట్టి వెళ్లిపోయిన బాలుడే అని నిర్ధారించుకున్నారు. ఈ ఘటనపై రైల్వే పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.