రోడ్డుపై నిలబడి ఉన్న ఓ స్కూటీని కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. కొంత దూరంగా ఆ స్కూటీని అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ ఘటనలో ఎనిమిదేళ్ల చిన్నారి తీవ్రంగా గాయపడింది. ఆ పాప చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో మరణించింది.
మధ్యప్రదేశ్ లో దారుణం జరిగింది. రోడ్డుపై నిలబడి ఉన్న స్కూటీని ఓ కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఆ స్కూటీని కొంత దూరం అలాగే ఈడ్చుకెళ్లింది. ఈ స్కూటీపై తన తల్లిదండ్రులతో పాటు ఉన్న ఎనిమిదేళ్ల చిన్నారికి తీవ్రగాయాలయ్యాయి. దీంతో ఆ చిన్నారి మరణించింది. ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలో సీసీ కెమెరాలు ఉండటంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. అయితే ఈ ప్రమాదం జరిగి పది రోజులు దాటినా.. పోలీసులు నిందితులను ఇంకా అదుపులోకి తీసుకోలేదు. నిందితుల కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
‘ఇండియా టీవీ’ కథనం ప్రకారం.. రోడ్డు పక్కన పార్క్ చేసిన యాక్టివాను కారు ఈడ్చుకెళ్లింది. మధ్యప్రదేశ్ లోని మొరెనా జిల్లాకు చెందిన విక్రమ్ సింగ్ తన భార్య, ఎనిమిదేళ్ల కుమర్తె అథర్వతో కలిసి ఇటీవల పాత కంటోన్మెంట్ గ్వాలియర్ లో ఉన్న ఇంటికి వచ్చాడు. అయితే ఈ నెల 7వ తేదీన ఆయన తిరిగి తన ఇంటికి వెళ్తున్నాడు. ఈ క్రమంలో గాల్వియర్ జిల్లా గోలాలోని మందిర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని భిండ్ రోడ్డుకు చేరుకున్నాడు.
ఈ సమయంలో ఏదో పని నిమిత్తం రోడ్డు పక్కన స్కూటీని ఆపాడు. అయితే కొంత సమయంలోనే వెనుక నుంచి వేగంగా వచ్చిన కారు ఆ స్కూటీని ఢీకొట్టింది. అనంతరం కొంత దూరంగా ఈడ్చుకెళ్లింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. దీంతో వారిని స్థానికులు హాస్పిటల్ లో చేర్చారు. అథర్వకు తీవ్ర గాయాలు కావడంతో ఐసీయూలో చేర్చారు. కానీ పరిస్థితి విషమించడంతో శనివారం రాత్రి మరణించింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితుడైన డ్రైవర్ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.
