Asianet News TeluguAsianet News Telugu

ఆగిన అట్లాస్ సైకిల్: మూతపడ్డ కంపెనీ చిట్టచివరి యూనిట్!

జూన్ 3వ తేదీన ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే అట్లాస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు, కంపెనీ గేటుకు నోటీసును అంటించారు. కంపెనీ  చిట్టచివరి,అతిపెద్ద ప్లాంట్ అంతర్జాతీయ సైకిళ్ళ దినోత్సవం నాడే మూతపడడం బాధాకరం. 

Atlas Cycles Shuts Operations At Last Manufacturing Unit On The Outskirts Of Delhi
Author
New Delhi, First Published Jun 6, 2020, 5:53 AM IST

భారతదేశంలో సైకిల్ అంటేనే మనకు ముందుగా గుర్తొచ్చేది అట్లాస్ సైకిళ్ళు. అలాంటి కంపెనీ తాజాగా తన  చిట్టచివరి ఉత్పత్తి ప్లాంట్ ని కూడా మూసివేసింది. ఇది కేవలం తాత్కాలికం మాత్రమే  అని కంపెనీ చెబుతున్నప్పటికీ....  పరిస్థితిని చూస్తే మాత్రం అలా అనిపించడం లేదు. 

జూన్ 3వ తేదీన ఎటువంటి నోటీసు ఇవ్వకుండానే అట్లాస్ కంపెనీని తాత్కాలికంగా మూసివేస్తున్నట్టు, కంపెనీ గేటుకు నోటీసును అంటించారు. కంపెనీ  చిట్టచివరి,అతిపెద్ద ప్లాంట్ అంతర్జాతీయ సైకిళ్ళ దినోత్సవం నాడే మూతపడడం బాధాకరం. 

ఉద్యోగులు మాత్రం ఈ మూతపడ్డ కాలంలో తమ హాజరుని రోజు కంపెనీకి వచ్చి హాజరు పట్టికలో నమోదుచేసి వెళ్లాలని, అప్పుడు మాత్రమే వారికి కోతలతో కూడుకున్న లే ఆఫ్ జీతం ఇస్తామని కంపెనీ అంటుంది. (లేఆఫ్ జీతంలో సదరు ఉద్యోగికి వారి బేసిక్ జీతంలో 50 శాతం + డీఏ ని మాత్రమే ఇస్తారు. )

కంపెనీ దాదాపుగా 2014 నుంచి ఆర్ధిక సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. అప్పటి నుండి కంపెనీని ఎలాగోలాగ నెట్టుకు వస్తున్నప్పటికీ.... ఇప్పుడు పరిస్థితి దాదాపుగా చేయిదాటిపోయినట్టు అనిపిస్తుంది. కంపెనీని తిరిగి నడిపించడానికి మరో 50 కోట్ల రూపాయలు అవసరం అయినందున కంపెనీకి చెందిన భూమి అమ్మి ఆ డబ్బును సర్దుబాటు చేస్తామని కంపెనీ అధికారులు చెబుతున్నప్పటికీ... అది జరిగే పనిలా కనిపించడం లేదని కార్మికులు చెవులు కొరుక్కుంటున్నారు. 

భారతదేశంలోనే సైకిళ్ళ ఉత్పత్తికి సంబంధించిన అతిపెద్ద ప్లాంట్ ఇదే! ఈ యూనిట్ 1989లో ప్రారంభమయింది. ప్రస్తుతం అట్లాస్ కంపెనీకి చెందిన ఈ ఒక్క ప్లాంట్ మాత్రమే ఉత్పత్తిని కొనసాగిస్తోంది. నెలకు రెండు లక్షలకు పైగా సైకిళ్లను ఈ ప్లాంట్ ఉత్పత్తి చేస్తుండేది. 

2014లో ఆర్థికంగా ఇబ్బందులు మొదలైన తరువాత 2014 డిసెంబర్ లో మధ్యప్రదేశ్ మాలన్ పూర్ ప్లాంట్ ని  ఇబ్బందులు మరి ఎక్కువవడంతో హర్యానా సోనిపట్ లోని మరో ప్లాంట్ ను 2018 డిసెంబర్ లో మూసివేశారు. ఇప్పుడు ఢిల్లీ శివార్లలోని షాహిబాబాద్ ప్లాంట్ ని కూడా కంపెనీ మూసివేసింది. గత ఆరు సంవత్సరాలుగా ఆర్ధిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న కంపెనీకి ఈ లాక్ డౌన్ శరాఘాతంగా పరిణమించింది. 

1951లో సోనిపట్ లో చిన్న కంపెనీగా ప్రారంభమైన అట్లాస్ సైకిళ్ళ తయారీ కేవలం సంవత్సర కాలంలోనే 25 ఎకరాల కంపెనీగా అభివృద్ధి చెందింది. సంవత్సరానికి 40 లక్షల సైకిళ్ళ ఉత్పత్తితో ఒకానొక దశలో కేవలం భారత్ లోనే కాకుండా ప్రపంచంలోనే అగ్రగామి సైకిల్ కంపెనీగా కొనసాగింది. కానీ రవాణా సాధనాలు అభివృద్ధి చెందిన దగ్గరి నుండి కంపెనీ లాభాలు క్రమంగా తగ్గాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios