ప్రేమిస్తున్నానని వెంటపడి.. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ప్రియుడు మోసం చేశాడని ఓ సినీ అసిస్టెంట్ డైరెక్టర్ పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన బెంగళూరులో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

బెంగళూరుకి చెందిన ఓ సహాయ దర్శకురాలికి 2018లో ఫేస్ బుక్ లో ఓ యువకుడు పరిచయం అయ్యాడు. ఆ పరిచయం కాస్త ప్రేమగా మారింది.  ఇద్దరూ కొంతకాలం డేటింగ్ చేశారు. పెళ్లి చేసుకుంటానంటూ అతను చెప్పిన మాటలను ఆమె పూర్తిగా నమ్మేసింది. ఈక్రమంలో ఇద్దరూ శారీరకంగా ఒక్కటయ్యారు. కొద్దిరోజుల అనంతరం వివాహం చేసుకోవాలని కోరగా తన అసలు నైజాన్ని బయట పెట్టాడు.

ఇంట్లోవాళ్లు చూసిన యువతిని పెళ్లి చేసుకుంటానని చెప్పాడు. అయితే తమ మధ్య ఉన్న ప్రేమ విషయాన్ని ఇతరులతో చెబితే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు.  అనంతరం సొణ్ణేనహళ్లిలో అద్దె ఇంటిలో కాపురం పెట్టారు. అవసరాలు  ఉన్నాయంటూ పలుమార్లు లక్షల రూపాయలు తీసుకున్నాడు.  ఈ ఏడాది జనవరి 12 తేదీన మరో రూ.5 లక్షలు ఇవ్వాలని కోరగా ఆమె నిరాకరించింది. 

ఆ తర్వాత అతను అందుబాటులోలేకుండా పోయాడు. ఫోన్‌ కూడా స్విచ్చాప్‌ చేశాడు. దీంతో మోసపోయానని ఆలస్యంగా తెలుసుకున్న సదరు అసిస్టెంట్ డైరెక్టర్ తాజాగా పోలీసులను ఆశ్రయించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.