అసోం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది హయ్యర్‌ సెకండరీ పరీక్షల్లో ఉత్తీర్ణులైన దాదాపు 36,000 మంది ప్రతిభావంతులైన విద్యార్థులకు స్కూటర్‌లను పంపిణీ చేయనుంది. అందులో ఎక్కువగా బాలికలకు ప్రాధాన్యత ఇవ్వనున్నారు. రూ.258.9 కోట్లతో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం బుధవారం తీర్మానం చేసిందని విద్యాశాఖ మంత్రి రనోజ్ పెగు తెలిపారు. 

అసోం లోని ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ ప్రభుత్వం ప్రతిభ కనబరిచిన విద్యార్థుల కోసం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది సెకండరీ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన దాదాపు 36,000 మంది విద్యార్థులకు స్కూటర్లను పంపిణీ చేయాలని భావిస్తోంది. ఇందులో బాలికలకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలని యోచిస్తోంది.ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

రూ.258.9 కోట్ల కేటాయింపులు 

ఈ కార్యక్రమాన్ని రూ.258.9 కోట్లతో అమలు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం బుధవారం తీర్మానం చేసిందని విద్యాశాఖ మంత్రి రనోజ్ పేగు మీడియాకు తెలిపారు.మొత్తం 35,800 మంది ప్రతిభవంతమైన విద్యార్థులను ఎంపిక చేయగా.. అందులో 29,748 మంది బాలికలు ఉన్నారు. వీరు మొదటి డివిజన్‌లో ఉత్తీర్ణత సాధించగా..6,052 మంది బాలురు 75 శాతం మార్కులు సాధించారని,వారందరికీ స్కూటర్లు వస్తాయని తెలిపారు.

అలాగే విద్యార్థులకు రిజిస్ట్రేషన్‌, ఇన్సూరెన్స్‌ కోసం కూడా ఉన్నత విద్యాశాఖ ఆర్థిక సాయం చేస్తుందని తెలిపారు. దీంతో పాటు ప్రాంతీయ కళాశాలల్లో ఫిక్స్‌డ్‌ వేతనంపై పనిచేస్తున్న అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నెలవారీ వేతనాన్ని రూ.55,000కు పెంచుతూ మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

గిరిజనులకు సర్టిఫికెట్ జారీ 

మైదాన ప్రాంతాల్లోని కొండ గిరిజనులకు, కొండల్లోని మైదాన గిరిజనులకు సర్టిఫికెట్లు జారీ చేసేందుకు మార్గదర్శకాలను మంత్రివర్గం నిర్ణయించిందని పర్యాటక శాఖ మంత్రి జయంత్ మల్లా బారువా తెలిపారు.

పర్యాటకాన్ని ప్రోత్సహిస్తాం
రాష్ట్ర ప్రభుత్వం అందించే ఆర్థిక, విద్యా,ఉద్యోగ ప్రయోజనాలను పొందేందుకు వీలుగా 'మిషన్ భూమిపుత్ర' కింద డిప్యూటీ కమిషనర్ల ద్వారా కుల ధ్రువీకరణ పత్రాలు అందజేస్తామన్నారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు, కజిరంగాలో హోటల్‌ను అభివృద్ధి చేయాలని హయత్ గ్రూప్ నిర్ణయించిందని బారువా చెప్పారు.