కరోనా విధుల్లో బిజీగా ఉన్న ఓ ఐఏఎస్ అధికారి కనీసం తన పెళ్లికి కూడా సెలవు తీసుకోలేదు. తన జీవితంలో అత్యంత ముఖ్యమైన రోజుని కూడా.. ఆమె విధి నిర్వహణకే కేటాయించారు. దీంతో.. ఆమె పరిస్థితిని అర్థం చేసుకున్న వరుడు.. ఆమె వద్దకు వచ్చి మరీ పెళ్లి చేసుకున్నాడు. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకుంది. కాగా.. వధువు హైదరాబాదీ అమ్మాయి కాగా.. వరుడు పూణేకి చెందిన వాడు కావడం గమనార్హం.

పూర్తి వివరాల్లోకి వెళితే..  హైదరాబాద్‌కు చెందిన కీర్తి జల్లి 2013 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి. ప్రస్తుతం అస్సాం లోని చచర్‌ జిల్లాలో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఆమెకు పుణేకు చెందిన వ్యాపారవేత్త ఆదిత్య శశికాంత్‌తో వివాహం కుదిరింది. బంగ్లాదేశ్‌ సరిహద్దుల్లో ఉన్న చచర్‌ జిల్లా హైలకండిలో ప్రస్తుతం రోజుకు 100 వరకు కోవిడ్‌ కేసులు బయటపడుతున్నాయి.

ఇలాంటి కీలక సమయంలో విధులను పక్కనబెట్టి, పెళ్లి కోసం హైదరాబాద్‌ వెళ్లడం ఆమెకు ఇష్టం లేదు. వరుడు, అతని కుటుంబం కూడా ఆమె నిర్ణయాన్ని ప్రశంసించారు. వరుడు తన బంధువులతో కలిసి పెళ్లికి ముందే సిల్చార్‌ వెళ్లాడు. కోవిడ్‌–19 ప్రొటోకాల్స్‌ ప్రకారం అక్కడ క్వారంటైన్‌లో గడిపాకే వివాహ తంతు జరిపించారు. కీర్తి అధికారిక బంగ్లాలో బుధవారం ఎలాంటి హంగూ ఆర్భాటాలూ లేకుండా కేవలం కర్ణాటక సంగీతం వినిపిస్తుండగా వరుడు తాళికట్టాడు. 

కేవలం 20 మంది అతిథులు మాత్రమే హాజరయ్యారు. ఈ వేడుకను జూమ్‌ వీడియో యాప్‌ ద్వారా 800 మంది చూశా రు. ‘హైదరాబాద్‌లో ఉన్న మా అమ్మానాన్నలకు కోవిడ్‌ పాజిటివ్‌గా తేలింది. దీంతో నా సోదరి మాత్రమే పెళ్లికి హాజరైంది’అని కీర్తి తెలిపారు. మంగళ, గురువారాల్లో కూడా కీర్తి అధికారిగా తన విధుల్లో పాల్గొన్నారు. పెళ్లి రోజు బుధవారం కూడా ఫోన్‌ ద్వారా బాధ్యతలు కొనసాగించారు.