ఆడపిల్లల చదువులను ప్రోత్సహించే దిశగా అస్సాం ప్రభుత్వం వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. స్కూలు, కాలేజీల్లో చదివే విద్యార్థినులకు ఆర్థిక సహాయం చేయటానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రతి విద్యార్థినికి ప్రతీ రోజు స్కూలుకు వెళితే రోజుకు 100 రూపాయల చొప్పున ఇవ్వనుంది. 

ఆదివారం విద్యాశాఖ మంత్రి హిమంత బిశ్వ శర్మ దీనిపై మాట్లాడుతూ.. ఇంటర్మీడియట్‌, ఆపై చదువులు చదివే విద్యార్థినులు పుస్తకాలు కొనుక్కోవటానికి గానూ మూడు వేల రూపాయలు ఇ‍వ్వనున్నామని, జనవరి చివరల్లో ఆ మొత్తాన్ని వారి బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వం జమ చేస్తుందని వెల్లడించారు. 

గత సంవత్సరమే ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలనుకున్నప్పటికి కరోనా వైరస్‌ కారణంగా చేయలేకపోయామని అన్నారు. అంతేకాకుండా స్కూళ్లతో పాటు కాలేజీలలో చదివే విద్యార్థినులకు కూడా నగదు సహాయం చేస్తామని చెప్పారు. 

2019 సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఫస్ట్‌ క్లాస్‌లో పాసైన విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం ఇందుకోసం 144.30 కోట్లు ఖర్చు చేస్తోందని, 22,245 మంది విద్యార్థినులు ఫస్ట్‌క్లాస్‌లో పాసయ్యారని వెల్లడించారు.