Assam flood: అసోంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య క్ర‌మంగా పెరుగుతోంది. ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24 మంది వ‌ర‌ద‌ల కార‌ణంగా మ‌ర‌ణించారు. దాదాపు 7.2 ల‌క్ష‌ల మంది ప్రభావిత‌మ‌య్యారు. 

Assam floods: ఈశాన్య భార‌తంలో వ‌ర‌ద బీభ‌త్సం కొన‌సాగుతున్న‌ది. అక్క‌డి రాష్ట్రాల్లో ప్ర‌స్తుతం భారీ వ‌ర్షాలు కుర‌వ‌డంతో వ‌ర‌ద‌లు పోటెత్తాయి. కొండ‌చ‌రియ‌లు విరిగిప‌డుతున్నాయి. విద్యుత్ స్తంభాలు, చెట్లు నేల‌కొరిగాయి. వేలాది గ్రామాలు ఇంకా నీటమునిగాయి. ల‌క్ష‌లాది ఎక‌రాల్లో పంటన‌ష్టం సంభ‌వించింది. ప్ర‌ణాలు కోల్పోతున్న వారి సంఖ్య సైతం క్ర‌మంగా పెరుగుతుండటం... ఇంకా వ‌ర‌ద‌లు కొన‌సాగుతుండ‌టం ఆందోళ‌న క‌లిగిస్తోంది. ముఖ్యంగా అసోంలో వ‌ర‌ద‌ల ప‌రిస్థితి మ‌రింత దారుణంగా మారుతోంది. వ‌ర‌ద‌ల కార‌ణంగా మ‌రో ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. చ‌నిపోయిన వారిలో ఇద్ద‌రు పిల్ల‌లు కూడా ఉన్నారు. దీంతో రాష్ట్రంలో వ‌ర‌ద‌ల కార‌ణంగా ఇప్ప‌టివ‌ర‌కు మొత్తం 24 మంది ప్రాణాలు కోల్పోయారు. వ‌ర‌ద ప్ర‌భావిత జిల్లా సంఖ్య 32కు పెరిగింద‌ని అధికారులు తెలిపారు. 22 జిల్లాల్లో దాదాపు 7.2 లక్షల మంది వరద ప్రభావంలో కొన‌సాగుతున్నారు. 

అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) రోజువారీ వరద నివేదిక ప్రకారం.. నాగావ్ జిల్లాలోని కంపూర్ రెవెన్యూ సర్కిల్‌లో నలుగురు వ్యక్తులు వ‌ర‌ద నీటిలో మునిగిపోయారు. హోజాయ్ జిల్లాలోని డోబోకా వద్ద ఒక వ్యక్తి , కాచర్‌లోని సిల్చార్ వద్ద ఒక చిన్నారి కూడా వరద కారణంగా మరణించినట్లు ఏఎస్‌డీఎమ్ఏ తెలిపింది. మొత్తంగా ఈ ఏడాదిలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో అసోంలో మరణించిన వారి సంఖ్య 24కి చేరింది. బార్‌పేట, బిస్వనాథ్, కాచర్, దర్రాంగ్, గోల్‌పరా, గోలాఘాట్, హైలాకండి, జోర్హాట్, కమ్రూప్, కర్బీ ఆంగ్లాంగ్ వెస్ట్, కరీంనగర్, లఖింపూర్, మజులి, మోరిగావ్, నాగావ్, సోనిత్‌పూర్,ఉదల్గురి జిల్లాల్లో 7,19,540 మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారని ASDMA తెలిపింది. ఒక్క నాగావ్‌లో దాదాపు 3.46 లక్షల మంది ప్రజలు వ‌ర‌ద ముప్పులో ఉన్నారు. ఆ తర్వాతి స్థానాల్లో కాచర్ (2.29 లక్షల మందికి పైగా) మరియు హోజాయ్ (58,300 మందికి పైగా) జిల్లాలో వ‌ద‌ర బాధితులు అధికంగా ఉన్నారు.

శనివారం వరకు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో 6.8 లక్షల మంది ప్రజలు వరదల బారిన పడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 2,095 గ్రామాలు నీటమునిగాయని, 95,473.51 హెక్టార్లలో పంట దెబ్బతిన్నదని ASDMA బులెటిన్‌లో పేర్కొంది. ఎనిమిది జిల్లాల్లో అధికారులు 421 సహాయ శిబిరాలు, పంపిణీ కేంద్రాలను నిర్వహిస్తున్నారని, 18,626 మంది చిన్నారులు సహా 91,518 మంది ఆశ్రయం పొందారని పేర్కొంది. అసోంలోని వివిధ ప్రాంతాల నుంచి వరదల్లో చిక్కుకున్న 253 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఇతర జిల్లాలతో పాటు బార్‌పేట, ధుబ్రీ, దిబ్రూఘర్, గోల్‌పరా, కమ్రూప్ మెట్రోపాలిటన్, మోరిగావ్, నల్బరి మరియు ఉదల్‌గురిలో భారీ కోతకు గురైందని బులెటిన్‌లో పేర్కొంది. వరద నీరు కూడా వివిధ ప్రదేశాలలో కట్టలు, రోడ్లు, వంతెనలు మరియు ఇతర మౌలిక సదుపాయాలకు నష్టం కలిగించింది. బ్రహ్మపుత్ర ఉపనదులు ధర్మతుల్, కంపూర్ వద్ద కోపిలి మరియు నంగ్లమురఘాట్ వద్ద దిసాంగ్ ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని ASDMA హెచ్చరించింది.

ఇదిలా ఉండగా, ఈశాన్య రాష్ట్రంలోని జాతీయ రహదారులకు సంబంధించిన సమస్యలపై న్యూఢిల్లీలో ఎన్‌హెచ్‌ఏఐ చైర్‌పర్సన్ అల్కా ఉపాధ్యాయతో చర్చించినట్లు అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ ఆదివారం తెలిపారు. "వరదలు మరియు కొండచరియలు విరిగిపడిన NHలను అత్యవసరంగా మరమ్మతులు చేయాలని మరియు ప్రస్తుతం కొనసాగుతున్న ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేయాలని చెప్పాను" అని ఆయన ట్విట్టర్‌లో తెలిపారు.