Assam Floods: అసోం వరదలు 32 జిల్లాల్లో దాదాపు 31 లక్షల మందిని ప్రభావితం చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా 1.56 లక్షల మంది ప్రజలు 514 సహాయ శిబిరాల్లో తలదాచుకున్నారు. ఇప్పటికీ పరిస్థితులు దారుణంగానే ఉన్నాయని అధికార వర్గాలు పేర్కొన్నాయి.
Assam Floods Death Toll Rises To 63: అసోం వరదల పరిస్థితి శనివారం మరింత దిగజారింది. వరదల కారణంగా మరో ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోవడంతో మరణాల సంఖ్య 63కి పెరిగింది. 32 జిల్లాల్లో ప్రభావితమైన వారి సంఖ్య దాదాపు 31 లక్షలకు పెరిగింది. బార్‌పేట, కరీంగంజ్‌లలో ఇద్దరు చొప్పున, దర్రాంగ్, హైలకండి, నల్బరీ మరియు సోనిత్‌పూర్ జిల్లాల్లో ఒక్కొక్కరు చొప్పున వరదల కారణంగా మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా 514 సహాయ శిబిరాల్లో 1.56 లక్షల మందికి పైగా ప్రజలు తలదాచుకున్నారు. అటువంటి శిబిరాల్లో లేని ఇతర బాధిత జనాభాకు కూడా సహాయ సామగ్రిని అధికారులు పంపిణీ చేస్తున్నారు. డిమా హసావో, గోల్‌పరా, హోజాయ్, కమ్‌రూప్ మరియు కమ్రూప్ (మెట్రోపాలిటన్) మరియు మోరిగావ్‌లో కొండచరియలు విరిగిపడ్డాయి.
అసోం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మకు ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి రాష్ట్రంలో వరదల పరిస్థితిని గురించి అడిగి తెలుసుకున్నారు. "ఈరోజు ఉదయం 6 గంటలకు, గౌరవప్రదమైన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అస్సాంలో వరదల పరిస్థితి గురించి ఆరా తీయడానికి నాకు ఫోన్ చేసారు. ఈ ప్రకృతి వైపరీత్యం కారణంగా ప్రజలు ఎదుర్కొంటున్న కష్టాలపై ఆందోళన వ్యక్తం చేస్తూ, ప్రధానమంత్రి కేంద్ర ప్రభుత్వం నుండి అన్ని రకాల సహాయం అందించడానికి హామీ ఇచ్చారు" అని శర్మ ట్వీట్ చేశారు.
నాగోన్ జిల్లాలో కోపిలి నది ఉధృతికి మించి ప్రవహిస్తోంది. బ్రహ్మపుత్ర, జియా-భరాలి, పుతిమరి, పగ్లాడియా, మానస్, బెకి, బరాక్ మరియు కుషియారా వంటి ఇతర నదులు వివిధ ప్రాంతాలలో ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయని శనివారం నాటు సెంట్రల్ వాటర్ కమిషన్ (సిడబ్ల్యుసి) వెల్లడించింది. దిమా హసావోలో NEEPCO జలవిద్యుత్ ప్రాజెక్ట్ నాలుగు స్లూయిస్ గేట్లు తెరవబడినందున కర్బీ ఆంగ్లోంగ్, మోరిగావ్, నాగావ్ జిల్లాల్లో అలర్ట్ ప్రకటించారు. కమ్రూప్ మెట్రోపాలిటన్, బజలి, బార్‌పేట, దర్రాంగ్, గోల్‌పరా, మోరిగావ్, కోక్రాఝర్, నల్‌బరీ మరియు ఉదల్‌గురి జిల్లాల్లోని పట్టణ ప్రాంతాల్లో కూడా వరదలు సంభవించినట్లు అసోం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ బులెటిన్ తెలిపింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో శనివారం 216 రోడ్లు, ఐదు వంతెనలు, నాలుగు కట్టలు దెబ్బతినడంతో మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి.
