Assam Floods: అస్సాంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఆదివారం మరో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 192కి చేరింది.
Assam Floods: దేశవ్యాప్తంగా వానలు దంచి కొడుతున్నాయి. గత వారం నుంచి ఈశాన్య భారతంలో ఎడతెరపు లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో అస్సాంలో వరదలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది ప్రాణాలు కోల్పోగా.. ఆదివారం మరో ఇద్దరు మరణించారు. దీంతో ఈ ఏడాది రాష్ట్రంలో వరదలు, కొండచరియలు విరిగిపడటంతో మృతుల సంఖ్య 192కి చేరింది.
ఈ మేరకు అస్సాం స్టేట్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ (ASDMA) బులెటిన్ ను విడుదల చేసింది. ఈ బులెటిన్ ప్రకారం.. హైలాకండి జిల్లాలో ఇద్దరు మృత్యువాత పడ్డారని తెలిపింది. అలాగే.. 12 జిల్లాల్లో 5.40 లక్షల మంది వరదల వల్ల ప్రభావితం అయ్యారని, 18 రెవెన్యూ డివిజన్లలోని 390 గ్రామాలు నీట మునిగాయని తెలిపింది. .
కచార్ జిల్లా వదర వల్ల అత్యంత ప్రభావితమైంది. ఈ జిల్లాలో ఇప్పటివరకూ 3,55,960 మంది వరదల వల్ల ప్రభావితమయ్యారు, ఆ తరువాత.. మోరిగావ్ లో 1,42,662 మంది వరదల ప్రభావాన్ని ఎదుర్కొంటున్నారు.
రాష్ట్రంలోని 114 సహాయ శిబిరాల్లో 38,000 మంది ప్రజలు తలదాచుకున్నారు. మొత్తం 7,368.41 హెక్టార్ల పంట నీట మునిగిందని ASDMA తెలిపింది.
గత 24 గంటల్లో దిబ్రూఘర్, మోరిగావ్, నాగావ్, ఉదల్‌గురి, బక్సా, హోజాయ్ జిల్లాల్లో ఇళ్లు, రోడ్లు, ఇతర భవనాలు దెబ్బతిన్నాయి. ASDMA ప్రకారం, బక్సా, విశ్వనాథ్, బొంగైగావ్, మోరిగావ్, టిన్సుకియా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడ్డాయి. అయితే రాష్ట్రంలో ఏ పెద్ద నది కూడా ప్రమాద స్థాయికి మించి ప్రవహించడం లేదు.
గుజరాత్ లో అతివృష్టి
గుజరాత్‌లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదల పరిస్థితి నెలకొంది. దక్షిణ, మధ్య గుజరాత్‌లోని అనేక ప్రాంతాలలో భారీ వర్షాలు కురిశాయి, ఇప్పటికే పలు నదుల్లో నీటి మట్టం పెరిగింది. వివిధ లోతట్టు ప్రాంతాలను నీట మునగాయి. 1,500 మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించవలసి వచ్చింది. ఈ మేరకు ఆదివారం అధికారులు సమాచారం అందించారు. వల్సాద్, నవ్‌సారి జిల్లాల్లో శనివారం రాత్రి, ఆదివారం ఉదయం భారీ వర్షాలు కురిశాయని అధికారులు తెలిపారు. అలాగే.. ఛోటా ఉదయ్‌పూర్, నర్మదా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిశాయని, దీని కారణంగా నదులు ఉప్పొంగుతున్నాయని, లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని చెప్పారు.
మరో ఐదు రోజుల పాటు భారీ వర్షాలు
ఒర్సాంగ్ నదిలో నీటి మట్టం పెరగడంతో వల్సాద్‌లోని కొన్ని లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యాయని అధికారులు తెలిపారు. కావేరి, అంబికా నదులు ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తుండటంతో నవ్యాంధ్ర జిల్లా అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. అదే సమయంలో దక్షిణ గుజరాత్‌లోని డాంగ్, నవ్‌సారి, వల్సాద్ జిల్లాల్లో రానున్న ఐదు రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
