Assam Floods:  అస్సాం వరదలు: వరదల కారణంగా అస్సాంలోని 27 జిల్లాల్లో 6 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు, 9 మంది మరణించారు. నదులలో నీటి మట్టం నిరంతరం పెరుగుతోంది 

Assam Floods: వరదల కారణంగా అస్సాంలో పరిస్థితి చాలా దారుణంగా మారింది. ఈ వ‌ర‌ద‌ల కార‌ణంగా 27 జిల్లాల్లో 6 లక్షల మందికి పైగా ప్రజలు ప్రభావితమయ్యారు. అదేస‌మ‌యంలో 9 మంది మరణించారు. అలాగే కోపిలి, బోరపాని వంటి నదుల నీటిమట్టం క్ర‌మంగా పెరుగుతోంది. దీంతో వరద ప్రభావిత ప్రాంతాల నుంచి ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు.

అస్సాంలో వ‌ర‌ద‌లు విళ‌య తాండ‌వం సృష్టిస్తున్నాయి. ఎడ‌తెరుపు లేకుండా కురుస్తున్న వ‌ర్షాల కార‌ణంగా లోత‌ట్టు ప్రాంతాలు నీట మునిగాయి. భారీ వర్షాలు, వ‌ర‌ద‌ల కారణంగా స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరదలు, కొండ చరియలు విరిగిపడటంతో పలు చోట్ల ప్రాణనష్టం కూడా జరిగింది. ఇదే స‌మ‌యంలో త్రిపుర, మిజోరాం, మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్, మేఘాలయల్లో కొండచరియలు విరిగిపడుతున్నాయి. అస్సాం రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ విడుదల చేసిన తాజా బులెటిన్ ప్రకారం.. రాష్ట్రంలోని దాదాపు 27 జిల్లాల్లోని దాదాపు 6 లక్షల మందికి పైగా వరదల బారిన పడుతున్నారు. Assam Floods వర్షాలు, వరదల కారణంగా 9 మంది మరణించారు. 

అస్సాంలో వర్షాకాలం కొనసాగుతోంది. రాహా అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని కాంపూర్ ప్రాంతంలో కూడా వరదల బీభత్సం సృష్టిస్తోంది. ఈ ప్రాంతంలో వరదల వల్ల వేలాది మంది ప్రజలు నష్టపోయారు. ఉండటానికి ఇళ్లు లేక‌.. తిన‌డానికి తిండి లేక వేలాది మంది ప్ర‌జ‌లు పడిగాపులు కాస్తున్నారు. క‌నీసం తాగ‌డానికి నీళ్లు లేక‌ నానా అవస్థలు పడుతున్నారు.

నదుల నీటిమట్టం పెరుగుద‌ల‌

అసోంలో కురుస్తున్న వర్షాల కారణంగా పలు నదుల్లో క్రమంగా నీటిమట్టం పెరుగుతోందని సమాచారం. ఇప్పటికే ప‌లు నదులు ప్ర‌మాద‌క‌ర స్తాయిలో ఉప్పొంగుతున్నాయి. భారీ వర్షాల కారణంగా కోపిలి, బోరపని తదితర నదుల నీటిమట్టం పెరిగినట్లు చెబుతున్నారు. పరిస్థితి చాలా దారుణంగా ఉంది. వరద నీటిలో ప్రజల గుడిసెలు నీట మునిగాయి. పలు రహదారులు నీటిలో మునిగిపోయాయి. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి.

48 వేల మందిని సురక్షిత ప్రాంతాల‌కు త‌ర‌లింపు

ప్ర‌ముఖ టీవీ ఛానెల్ NDTV నివేదిక ప్రకారం.. అస్సాంలో వరద Assam Floods ప్రభావిత ప్రాంతాల నుండి ఇప్పటివరకు 48,000 మందిని, 248 సహాయ శిబిరాలకు తరలించారు. అస్సాంలో వరదల వల్ల హోజాయ్, కాచర్ జిల్లాలు ఎక్కువగా ప్రభావితమ‌య్యాయి. ఈ జిల్లాల్లో లక్ష మందికి పైగా ప్రజలు వరదల బారిన పడ్డారని చెప్పారు. వరదల నుంచి ప్రజలను రక్షించేందుకు సైన్యం కూడా రంగంలోకి దిగింది. హోజాయ్‌లో చిక్కుకున్న 2000 మందిని సైన్యం రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించారు.

మేఘాలయ సీఎంతో అస్సాం సీఎం

ఇదిలాఉంటే.. అస్సాం ముఖ్యమంత్రి హెచ్‌బి శర్మ బుధవారం మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మాతో మాట్లాడారు. బరాక్ వ్యాలీకి రోడ్డు మార్గంలో సహాయ సామగ్రిని పంపడంలో సంగ్మా సహాయం కోరాడు. లోయకు వెళ్లే మార్గం మేఘాలయ గుండా వెళుతుందని, అటువంటి పరిస్థితిలో, సహాయక సామగ్రిని తీసుకువెళ్ళే వాహనాలను ఎటువంటి పరిమితులు లేకుండా అనుమతించాలని ఆయన చెప్పారు.