భారీ వర్షాలు ఈశాన్య రాష్ట్రం అసోంను అతలాకుతలం చేస్తున్నాయి. గతకొద్ది రోజులుగా ఇక్కడ కురుస్తున్న వర్షపునీటితో చెరువులు, నదులు ప్రమాదకరంగా మారాయి.దీంతో వరదనీరు జనావాసాలను ముంచెత్తుతోంది. ఇలా రాష్ట్రంలోని  మొత్తం 33 జిల్లాల్లో 21 జిల్లాలు ఈ వరదల భారిన పడ్డాయి. 

ఈ అధిక వర్షాలు, వరదల కారణంగా రాష్ట్రవ్యాప్తంగా ఆరుగురు మృతిచెందినట్లు అధికారులు తెలిపారు. అంతేకాకుండా చాలా మంది నిరాశ్రయులుగా మారినట్లు వెల్లడించారు. దీంతో వారందరిని సురక్షిత ప్రాంతాలకు తరలించి పునరావాసం కల్పిస్తున్పట్లు తెలిపారు.

అసోం రాష్ట్ర డిసాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ లెక్కలప్రకారం 1,556 గ్రామాలు, 8.69  లక్షల ప్రజలు  ఈ వరదల భారిన పడినట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో అత్యధిక ప్రాంతాల  గుండా  ప్రవహిస్తున్న బ్రహ్మపుత్ర  నదితో పాటు మిగతా చిన్ననదులు కూడా ప్రమాదకరమైన రీతిలో ప్రవవహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. 

లోతట్టు ప్రాంతాల్లోకి వరద నీరు చేరడంతో ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. ఏడు వేల మందిని పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు తెలిపారు. వరద ప్రభావిత  ప్రాంతాల్లో మొత్తం 68 పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు.. మరికొన్ని ప్రాంతాల్లో కూడా ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు.