Asianet News TeluguAsianet News Telugu

మూడు నెలలు ముందుగానే గర్భిణికి ఆపరేషన్.. నాలుక్కర్చుకుని మళ్లీ కుట్లేసిన వైనం.. ఎక్కడంటే?

అసోంలో ఓ గర్భిణికి తొమ్మిది నెలలు నిండకముందే.. మూడు నెలలు ముందుగానే ఆపరేషన్ చేశారు. పిండాన్ని చూసి ఇంకా అభివృద్ధి చెందలేదని తేల్చుకుని మళ్లీ కుట్లేశారు. అనంతరం ఈ విషయం గర్భిణి కుటుంబ సభ్యులు హాస్పిటల్ అధికారుల ముందు లేవనెత్తగా ఘటనపై  విచారణ ప్రారంభించారు. 
 

assam doctor performs c section 3 months before due date.. then stitched
Author
First Published Sep 4, 2022, 10:50 PM IST

న్యూఢిల్లీ: మహిళ ఒకసారి గర్భం దాల్చినట్టుగా తెలియగానే కుటుంబ సభ్యులు కంటికి రెప్పలా చూసుకుంటారు. ఏ పనీ చేయనివ్వకుండా.. పౌష్టికాహారాన్ని అందిస్తారు. తల్లీ బిడ్డల క్షేమాన్ని నిరంతరం పర్యవేక్షిస్తుంటారు. కనీసం నెలకు ఒకసారైనా హాస్పిటల్ తప్పక తీసుకెళ్లుతారు. వైద్యులు చేసిన సూచనలను తూచ తప్పకుండా పాటిస్తారు. కానీ, వైద్యుడే పొరబడితే..? ఈ అనుమానం ఎవరికీ రాదు. రావాల్సిన అవసరం కూడా లేదు. గైనకాలజిస్టులు చాలా కేర్ తీసుకుంటారు. కానీ, అసోంలో ఓ వైద్యుడు పరధ్యానంలో ఉన్నాడో ఏమోగానీ, ఆయన ద్వారా ఓ పొరపాటు జరిగిపోయింది. నెలలు నిండకముందే గర్భిణికి సర్జరీ చేశాడు. పిండం ఇంకా అభివృద్ధి చెందలేదని రియలైజ్ అయి.. వెంటనే మళ్లీ కుట్లేశాడు. ఈ ఘటన అసోంలోని కరీంగంజ్ సివిల్ హాస్పిటల్‌లో చోటుచేసుకుంది.

కరీంగంజ్‌కు చెందిన ఓ గర్భిణికి ఒంట్లో నలతగా ఉండటంతో హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. ఆగస్టు 21న ఆమెను హాస్పిటల్ తీసుకెళ్లారు. ఆమెను రెండు రోజులు అబ్జర్వేషన్‌లో ఉంచారు. ఆ తర్వాత వైద్యుడు ఆమెకు సర్జరీ చేయాలని నిర్దారించాడు. ఎలాంటి అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్ చేయకుండానే ఈ నిర్ణయానికి వచ్చాడు. ఆమెకు డిసెంబర్‌లో సర్జరీ చేయాల్సి ఉన్నదనే విషయం కూడా ఆ డాక్టర్‌కు తెలుసు. అంటే సుమారు మూడున్నర నెలల ముందే ఆమెకు ఆపరేషన్ చేయాలని నిర్ణయం తీసుకున్నాడని గర్భిణి కుటుంబ సభ్యులు ఆరోపించారు.

పొత్తి కడుపుకు కోత పెట్టిన తర్వాత పిండం ఇంకా అభివృద్ధి చెందలేదని గ్రహించాడు. వెంటనే ఆ కోతకు కుట్లు వేశాడు. అయితే, పిండాన్ని భద్రంగా ఏ లోపం లేకుండా సరిగానే ఉంచాడు. ఆ మహిళ ఆగస్టు 31వ తేదీన డిశ్చార్జీ అయింది. ఈ విషయాన్ని ఎవరితోనూ చెప్పవద్దని ఆ వైద్యులు కుటుంబ సభ్యులకు సూచించినట్టు తెలుస్తున్నది.

అయితే, ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత సదరు మహిళ ఆరోగ్యం క్షీణించడం మొదలైంది. వారి ఇరుగు పొరుగు వారు, బంధువులకు ఆస్పత్రిలో జరిగిన విషయం తెలిసింది. దీంతో ఆగ్రహంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ అధికారుల ముందుకు విషయాన్ని తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆ మహిళ అదే హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నది. శుక్రవారం ఆమెకు అల్ట్రాసౌండ్ పరీక్ష చేశారు. అందులో పిండం భద్రంగా ఉన్నట్టు తేలింది.

ఈ విషయం తమ వద్దకు వచ్చిన తర్వాత దర్యాప్తు ప్రారంభించామని, నిజానిజాలను నిర్దారించడానికి దర్యాప్తు చేస్తున్నామని హాస్పిటల్ అధికారులు తెలిపారు. 11 సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసి దీనిపై దర్యాప్తు చేస్తున్నామని, ప్రాథమిక రిపోర్టును ఇప్పటికే గువహతి ఆరోగ్య శాఖకు సమర్పించినట్టు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios