అస్సాంలోని నల్బరీ జిల్లాలోని పోలీస్ స్టేషన్ వద్ద బాలికపై దాడి జరిగింది. పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ సదరు బాలికను వేధిస్తూ.. అభ్యంతరకర చిత్రాలను తీశాడు. విషయం ఉన్నతాధికారులకు తెలియగానే పోలీసు ఇన్‌స్పెక్టర్‌ను వెంటనే విధుల నుంచి తొలగించారు.
కంచె చేను మేసింది అన్నట్టు ప్రజలను రక్షించాల్సిన బాధ్యతయుతమైన పోలీసు .. ఓ బాలిక పట్ట కీచకుడిలా వ్యవహరించాడు. పోలీస్ స్టేషన్‌లోనే ఓ అమ్మాయితో అనుచితంగా ప్రవర్తించాడు. ఆమెను అభ్యంతరకరమైన ఫోటోలు తీసి వేధింపులకు గురి చేశాడు. ఈ దారుణం వెలుగులోకి రావడంతో సదరు పోలీసు ఆఫీసర్ ను విధుల నుంచి తొలిగించారు. అదుపులోకి తీసుకోవాలని ఆదేశించగా.. పరారయ్యాడు. దీంతో డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జీపీ సింగ్ నిందితుడి తలపై రివార్డు కూడా ప్రకటించారు. ఈ ఘటన నల్బరీ జిల్లా ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది.
వివరాల్లోకెళ్తే.. నల్బరీ జిల్లా ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ పరిధిలో జూన్ 21న బాల్య వివాహాల కేసులో మైనర్ బాలికను, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలిక తన ప్రియుడితో కలిసి పారిపోయిందని, అయితే పోలీసులు వారిని పట్టుకుని ఘోఘ్రాపర్ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. ఈ క్రమంలో ఆ స్టేషన్ ఎస్‌హెచ్ ఓ బిమన్ రాయ్ బాలికను వేధించాడు. ఆ బాలికను అభ్యంతరకరమైన ఫోటోలు క్లిక్ చేశాడు.
ఈ విషయం నిందితుడైన ఇన్‌స్పెక్టర్‌పై ఫిర్యాదు చేస్తూ.. బాధిత బాలిక ఉన్నతాధికారులను ఆశ్రయించింది. వార్తా సంస్థ పిటిఐ ప్రకారం.. సోమవారం (జూన్ 26) ఘోగ్రాపర్ పోలీస్ స్టేషన్ ఎస్‌హెచ్‌ఓపై 17 ఏళ్ల బాలిక దాఖలు చేసిన ఎఫ్‌ఐఆర్‌లో తనను పోలీస్ స్టేషన్‌లో వేధించారని , ఆమె అభ్యంతరకరమైన ఛాయాచిత్రాలను తీశారని పేర్కొంది. నిందితుడైన ఇన్‌స్పెక్టర్‌పై నల్బరి పోలీస్ స్టేషన్‌లో బాలల లైంగిక నేరాల రక్షణ (పోక్సో) చట్టం , భారతీయ శిక్షాస్మృతిలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేయబడింది. ఆరోపణలు ఎదుర్కొంటున్న ఇన్‌స్పెక్టర్‌ను మొదట సస్పెండ్ చేసి, ఆ తర్వాత డిస్మిస్ చేశారు.
తీవ్ర నిరాశకు లోనయ్యాను - డీజీపీ
ఈ పరిణామంపై అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ జిపి సింగ్ మాట్లాడుతూ.. “పోలీసు స్టేషన్ అందరికీ దేవాలయం. పౌరులకు సురక్షితమైన స్వర్గధామం. ఈ రోజు వెలుగులోకి వచ్చిన పరిణామం వల్ల తాను తీవ్ర నిరాశ , బాధకు లోనయ్యాను. ఒక ఇన్‌స్పెక్టర్ పోలీసు కుటుంబం మొత్తం దిక్కుతోచని స్థితిలో ఉంది." అని అస్సాం డీజీపీ ట్వీట్ చేశారు. అస్సాం డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ఈ ఘటనపై మరో ట్వీట్ చేస్తూ.. ఇలా రాశారు. "డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్‌గా నాకు అందించబడిన అధికారాలు అస్సాం పోలీసుల ప్రతిష్ట చెక్కుచెదరకుండా ఉండేలా కాపాడుతాను. ఈ మేరకు నేను అస్సాం ప్రజలకు హామీ ఇస్తున్నాను. అస్సాం పోలీస్ డైరెక్టర్ జనరల్ , పోలీస్ ఫోర్స్ అధిపతిగా ప్రస్తుత చట్టం , నిబంధనల ప్రకారం.. ఇన్‌స్పెక్టర్ (యుబి) బిమన్ రాయ్‌ను తొలగించాలని నేను నిర్ణయించుకున్నాను" అని డిజిపి రాశారు.
