Asianet News TeluguAsianet News Telugu

సీఎం సంతకం ఫోర్జరీ.. ఒక్క సంతకంతో ఎంత స్కామ్ చేశారో తెలుసా?

తప్పుడు మార్గాల్లో డబ్బులు సంపాదిస్తూ సరికొత్త స్కామ్‌లు చేస్తున్న ముగ్గురు నిందితులను అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఏకంగా ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ సిగ్నేచర్‌ను ఫోర్జరీ చేసి రూ. 9 లక్షలు సంపాదించాలనుకున్నారు. ఆ మొత్తం చేతిలోకి వచ్చినప్పటికీ చివరికి కటకటాల వెనక్కి వెళ్లారు.
 

assam CM himanta biswa sarma signature forged
Author
Guwahati, First Published Sep 13, 2021, 8:29 PM IST

గువహతి: ఈజీ మనీకి అలవాటు పడిన కొందరు తప్పుడు దారుల్లో డబ్బు సంపాదించడానికి ప్రయత్నించి కటకటాలపాలయ్యారు. ఏకంగా అసోం రాష్ట్ర ముఖ్యమంత్రి సంతకాన్నే ఫోర్జరీ చేశారు. దాని ద్వారా సులువుగా రూ. 9 లక్షలను పొందజూశారు. ఓ కంపెనీని మభ్యపెట్టి కాంట్రాక్టు ఇప్పిస్తున్నట్టు కలరింగ్ ఇచ్చి సీఎం నకిలీ సంతకంతో డాక్యుమెంట్లు అప్పజెప్పి రూ. 9 లక్షల జేబులో వేసుకున్నారు. కానీ, చివరికి వారు పోలీసులకు పట్టుబడ్డారు. సీఎం సిగ్నేచర్ ఫోర్జరీ చేసినట్టుగా అధికారులు గమనించి పోలీసు కేసు పెట్టగా, వారు రంగంలోకి దిగి ప్రధాన నిందితుడు ఇమ్రాన్ షా చౌదరి సహా మరో ఇద్దరు రాజీబ్ కలిత, దిలీప్ దాస్‌లను అరెస్టు చేశారు.

లోహిత్ కన్‌స్ట్రక్షన్ సంస్థతో సంబంధమున్న నలుగురిని ఈ నిందితులు కలిశారు. తమకు సీఎంవో‌ యాక్సెస్ ఉన్నదని, పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో లోహిత్ కన్‌స్ట్రక్షన్‌కు కాంట్రాక్ట్ ఇప్పించడం తమకు చాలా సులువైన విషయమని చెప్పారు. రూ. 3.16 కోట్ల విలువైన రెండు కాంట్రాక్టులను ఇప్పిస్తామని, అందుకు తమకు మూడు శాతం అంటే రూ. 9 లక్షలు ముందుగానే ముట్టజెప్పాలని డీల్ చేసుకున్నారు. వారి మాటలు ఆ నలుగురు రూ. 9 లక్షలు అప్పజెప్పారు.

చౌదరీ మరో ముగ్గురితో కలిసి సీఎం హిమంత బిశ్వ శర్మ వాస్తవ సిగ్నేచర్‌ను స్కాన్ చేసి దాని ఆధారంగా నకిలీ డాక్యుమెంట్ తయారుచేశారు. ఇలా చేసినందుకు చౌదరి ఆ ముగ్గురికి తలా ఒక లక్ష ఇచ్చారు. ఆ డాక్యుమెంట్లను లోహిత్ కన్‌స్ట్రక్షన్‌తో సంబంధమున్న నలుగురికి అందజేశారు. పబ్లిక్ హెల్త్ డిపార్ట్‌మెంట్ చీఫ్ ఇంజినీర్‌కు అందించిన ఆ డాక్యుమెంట్లలో సీఎం నకిలీ సంతకమున్నది.

తర్వాత ఈ విషయం అధికారులకు తెలిసిపోవడం, వారు దిస్‌పూర్‌లోని పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం చకచకా జరిగిపోయాయి. ప్రధాన నిందితుడు ఇమ్రాన్ షా చౌదరిని పోలీసులు ఢిల్లీలో అరెస్టు చేశారు. మరో ఇద్దరు రాజీబ్ కలిత, దిలీప్ దాస్‌లను శనివారం అరెస్టు చేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios