Himanta Biswa Sarma: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని (AFSPA) రాష్ట్రం నుండి పూర్తిగా తొలగించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ తెలిపారు.

Himanta Biswa Sarma: సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-1958 (AFSPA)పై అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ కీలక ప్రకటన చేశారు. సిఎం బిస్వా శర్మ మాట్లాడుతూ.. 2023 చివరి నాటికి అస్సాం నుండి AFSPA ను పూర్తిగా ఉపసంహరించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, నవంబర్ నాటికి మొత్తం అస్సాం నుండి AFSPA తొలగించబడుతుందని ఆయన అన్నారు.

ప్రస్తుతం అస్సాంలోని ఎనిమిది జిల్లాల్లో AFSPA అమల్లో ఉందనీ, రాష్ట్ర పోలీసు బలగాలకు శిక్షణ ఇవ్వడానికి మాజీ సైనికుల సేవలను తీసుకుంటామని సీఎం శర్మ తెలిపారు. అలాగే..కమాండెంట్ సదస్సును ఉద్దేశించి సిఎం శర్మ మాట్లాడుతూ.. ఈ చర్య అస్సాం పోలీసు బెటాలియన్‌లను సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్సెస్ (సిఎపిఎఫ్‌లు)తో భర్తీ చేయడానికి సులభతరం చేస్తుందని అన్నారు. చట్టం ప్రకారం సీఏపీఎఫ్‌లు తప్పనిసరిగా ఉండాలన్నారు.

 భద్రతా దళాలకు ప్రత్యేక హక్కులు

AFSPA కింద భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలు ఉన్నాయి, దుర్వినియోగం అయ్యే అవకాశం ఉన్నందున ఒక విభాగం చాలా కాలంగా ప్రశ్నలను లేవనెత్తుతోంది. ఈ చట్టం భద్రతా దళాలకు ఎలాంటి ముందస్తు వారెంట్ లేకుండా ఆపరేషన్లు నిర్వహించి ఎవరినైనా అరెస్టు చేసే హక్కును కల్పిస్తుంది. భద్రతా దళాల బుల్లెట్ కారణంగా ఎవరైనా మరణిస్తే.. ఈ చట్టం వారిని అరెస్టు చేయడం, విచారణను ఎదుర్కోవడం నుండి మినహాయిస్తుంది.

నవంబర్ 1990లో AFSPA కింద అస్సాంను చెదిరిన ప్రాంతంగా ప్రకటించి, అప్పటి నుండి ప్రతి ఆరు నెలలకు ఓ సారి పొడిగించబడుతోందని, గత రెండేళ్లలో రాష్ట్రంలో శాంతిభద్రతలు మెరుగయ్యాయని పేర్కొంటూ AFSPAని పూర్తిగా ఉపసంహరించుకోవాలని సీఎం బిస్వా శర్మ వాదిస్తున్నారు. అరుణాచల్ ప్రదేశ్‌తో సరిహద్దు వివాదం పూర్తిగా పరిష్కారమైందని, మేఘాలయతో 12 వివాదాస్పద ప్రాంతాలలో ఆరింటిపై ఒప్పందం కుదిరిందని, మిగిలిన ప్రాంతాలకు సంబంధించిన చర్చలు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని ఈ నెల ప్రారంభంలో సిఎం బిస్వా శర్మ చెప్పారు.

Scroll to load tweet…