రాహుల్ గాంధీపై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ చేసిన వ్యాఖ్యలు దేశమంతటా దుమారం రేపాయి. కానీ, ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోకపోగా.. సమర్థించుకున్నారు. భారత బలగాల వైపు నిలబడటం తప్పా? అంటూ ప్రశ్నించారు. వారి దేశ భక్తిని ప్రశ్నించడం సరికాదని పేర్కొన్నారు. దేశం కోసం వారేం చేశారో చెప్పాలని ప్రూఫ్‌లు అడక్కండి అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశాన్ని వ్యతిరేకించినా.. గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించరాదనే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో తయారు చేసి పెట్టిందని ఆరోపించారు.
న్యూఢిల్లీ: కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఎంపీ రాహుల్ గాంధీ(Rahul Gandhi)పై అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ(Assam CM Himanta Biswa Sarma) చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాహుల్ గాంధీ పుట్టుక గురించి ఆయన ప్రశ్నించడం రాజకీయంగా దుమారం రేపింది. తెలంగాణ సీఎం కేసీఆర్(KCR) సహా ప్రతిపక్షాలన్నీ అసోం సీఎంపై విరుచుకుపడ్డారు. ఈ నేపథ్యంలోనే అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ.. రాహుల్ గాంధీపై చేసిన వ్యాఖ్యలను మరోసారి సమర్థించుకున్నారు. ‘భారత దేశానికి వ్యతిరేకంగా మాట్లాడొచ్చు.. కానీ, గాంధీ కుటుంబానికి వ్యతిరేకంగా మాట్లాడరాదా? కాంగ్రెస్ పార్టీ దేశంలో ఇలాంటి వాతావరణాన్ని తయారు చేసింది’ అని ఆరోపణలు గుప్పించారు.
ఉత్తరాఖండ్(Uttarakhand)లో మిలిటరీలో సేవలు అందిస్తున్న లేదా.. రిటైర్‌మెంట్ పొందిన వారి సంఖ్య గణనీయంగా ఉన్నది. ఈ తరుణంలోనే ఉత్తరాఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ రాజకీయ పార్టీలు ఆర్మీకి సంబంధించిన విషయాలను తమ ప్రచారంలో ప్రస్తావిస్తున్నాయి. అన్ని పార్టీలూ ఆర్మీ గురించి, జనరల్ బిపిన్ రావత్ గురించి మాట్లాడుతున్నాయి. ఇదే సందర్భంలో అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ ఉత్తరాఖండ్‌లో నిర్వహించిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ 2016లో చేపట్టిన సర్జికల్ స్ట్రైక్‌ను గుర్తు చేశారు.
2016లో భారత ఆర్మీ(Indian Army) మెరుపుదాడులు జరిపిందని, కానీ, కాంగ్రెస్ పార్టీ ఆ జవాన్లను అభినందించాల్సింది పోయి.. వారి వీరత్వాన్నే ప్రశ్నించిందని కాంగ్రెస్‌పై మండిపడ్డారు. ఆ దాడులకు సంబంధించిన ప్రూఫ్‌లు అడిగిందని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో ఆయన ఓ వివాదాస్పద వ్యాఖ్య చేశారు. రాహుల్ గాంధీ.. మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకే జన్మించారని చూపించే ప్రూఫ్‌లు ఇవ్వాలని బీజేపీ ఎప్పుడైనా డిమాండ్ చేసిందా? అంటూ వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి.
తన వ్యాఖ్యలపై తీవ్ర వ్యతిరేకత వస్తున్నప్పటికీ హిమంత బిశ్వ శర్మ తనను తాను సమర్థించుకున్నారు. భారత బలగాల వైపు నిలబడటం తప్పా? అంటూ ప్రశ్నించారు. వారి దేశ భక్తిని ప్రశ్నించడం సరికాదని పేర్కొన్నారు. దేశం కోసం వారేం చేశారో చెప్పాలని ప్రూఫ్‌లు అడక్కండి అంటూ కాంగ్రెస్‌పై మండిపడ్డారు. దేశాన్ని వ్యతిరేకించినా.. గాంధీ కుటుంబాన్ని వ్యతిరేకించరాదనే వాతావరణాన్ని కాంగ్రెస్ పార్టీ దేశంలో తయారు చేసి పెట్టిందని ఆరోపించారు.
రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై రాహుల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడుతూ భారత దేశం రాష్ట్రాల సమాఖ్య అని గుర్తు చేసిన సంగతి తెలిసిందే. దీనిపైనా హిమంత బిశ్వ శర్మ తాజాగా ట్వీట్ చేశారు. భారత్ కేవలం రాష్ట్రాల సమాఖ్య మాత్రమే కాదని, భారత్ కేవలం జన్మభూమే కాదు.. తమ తల్లి అని పేర్కొన్నారు. జవాన్లను ప్రశ్నించడమంటే.. తమ మాతృమూర్తిని అగౌరవపరిచినట్టేనని పేర్కొన్నారు.
రాహుల్ గాంధీ అదే ప్రసంగంలో ఓ దౌత్య వ్యూహాన్ని పేర్కొన్న సంగతి తెలిసిందే. చైనా, పాకిస్తాన్ ఒకటి కాకుండా ఉంచడం భారత్ అవలంభించాల్సిన మౌలిక దౌత్య విధానం అని, తద్వార భారత్‌కు ఈ ఇరు దేశాల నుంచి ముప్పు చాలా తక్కువగా ఉంటుందని తెలిపారు. కానీ, ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం ఈ దౌత్య వ్యూహాన్ని పాటించలేదని, తద్వార పాకిస్తాన్, చైనాలు చాలా దగ్గరయ్యాయని, తత్ఫలితంగా భారత్‌కు ఈ రెండు దేశాల సరిహద్దుల నుంచి ముప్పే ఎక్కువగా ఉన్నదని తెలిపారు. ఈ వాదనను హిమంత బిశ్వ శర్మ కొట్టిపారేశారు. పాకిస్తాన్ ఆవిర్భవించినప్పటి నుంచే చైనాకు దగ్గరగా ఉన్నదనే విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తెరగాలని పేర్కొన్నారు. ఒక ఐదో తరగతి పిల్లాడి కంటూ కూడా అవివేకంగా రాహల్ గాంధీ పార్లమెంటులో మాట్లాడతారని ఆరోపించారు.
