అస్సాంలో బహుభార్యత్వం నిషేధించబడుతుందని ప్రభుత్వం త్వరలో బిల్లును తీసుకువస్తుందని సీఎం హిమంత బిస్వా ప్రకటించారు. 

దేశవ్యాప్తంగా యూనిఫాం సివిల్ కోడ్ (యుసిసి) గురించి చర్చ జరుగుతున్న వేళ.. లక్షలాది మంది ప్రజలు దీనికి సంబంధించి తమ సూచనలను ఇస్తున్నారు. అదే సమయంలో ఇదిపై చాలా రాజకీయాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ UCC పైగా కీలక ప్రకటన చేశారు.తాను ఇప్పటికే యూసీసీకి మద్దతుగా ఉన్నానని చెప్పారు. ఇదే కాకుండా.. తక్షణమే రాష్ట్రంలో బహుభార్యాత్వాన్ని (ఒకటి కంటే ఎక్కువ మందిని వివాహాలు) నిషేధించాలని అస్సాం ముఖ్యమంత్రి కోరుకుంటున్నట్లు చెప్పారు.

తాజాగా.. అస్సాం సీఎం హిమంత బిస్వా శర్మ గౌహతిలో మీడియాతో మాట్లాడుతూ.. యూసీసీ గురించి ప్రస్తావించారు. ఆయన మాట్లాడుతూ.. 'యూసీసీ అంశంపై పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది.. రాష్ట్రాలు కూడా సహకరిస్తాయి. యూసీసీలో చాలా అంశాలు ఉన్నాయి, లా కమిషన్‌, పార్లమెంటరీ కమిటీ సమీక్షిస్తున్నాయి. యూసీసీకి మద్దతిస్తున్నామని ఇప్పటికే చెప్పాం. అస్సాంలో బహుభార్యత్వాన్ని వెంటనే నిషేధించాలని కోరుతున్నానని సంచలన నిర్ణయం తెరపైకి తీసుకువచ్చారు. 

బహుభార్యత్వానికి వ్యతిరేకంగా బిల్లు 

బహుభార్యత్వాన్ని ఉద్దేశించి హిమంత బిస్వా మాట్లాడుతూ.. ఇప్పటికే ఇద్దరు భార్యలు ఉన్న వ్యక్తికి కాంగ్రెస్‌ నేత ఎవరైనా తన కుమార్తెను ఇస్తారా? వారు (కాంగ్రెస్) ముస్లిం మహిళల కష్టాలను అర్థం చేసుకోవడం లేదు, వారు ముస్లిం పురుషుల కోసం మాత్రమే పని చేస్తారు. బహుభార్యత్వాన్ని నిషేధించే బిల్లును వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ప్రవేశపెడతామని చెప్పారు. కొన్ని కారణాల వల్ల ఈ సెషన్‌లో ఈ బిల్లును తీసుకురాలేకపోతే.. జనవరిలో జరిగే అసెంబ్లీ సమావేశాల్లో ఈ అంశంపై బిల్లు తీసుకవస్తామని తెలిపారు. 

లా కమిషన్ యూనిఫాం సివిల్ కోడ్ పై దేశం నలుమూలల నుండి సూచనలు కోరుతోంది. ఇప్పటి వరకు 20 లక్షల మందికి పైగా ప్రజలు, సంస్థలు తమ సూచనలు అందించాయి. వీరిలో ఎక్కువ మంది UCCకి మద్దతుగా నిలిచారు. అదే సమయంలో అనేక సంస్థలు దీనిని వ్యతిరేకించాయి. UCCపై రాజకీయ పార్టీలు కూడా భిన్నమైన అభిప్రాయాలను కలిగి ఉన్నాయి.