పెళ్లి మండపానికి పీకలదాకా మద్యం సేవించి వచ్చాడు.  పెళ్లి తంతు నిర్వహించడానికి అతను చాలా కష్టపడుతున్నాడు. 

పెళ్లి జీవితంలో ఒక్కసారే వస్తుంది. ఆ పెళ్లిని ఆనందంగా,జీవితాంతం గుర్తుండేలా చేసుకోవాలని అందరూ ఆరాటపడుతుంటారు. అలాంటి పెళ్లిలో.. వరుడు పీకలదాకా మద్యం సేవించి కనీసం సోయి లేకుండా మండపంలో అడుగుపెడితే ఎలా ఉంటుంది..? ఓ పెళ్లిలో అదే జరిగింది. విపరీతంగా తాగి మండపానికి వచ్చాడు. అది చూసి వధువు పెళ్లి క్యాన్సిల్ చేసింది. ఈ సంఘటన అస్సాంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

అసోంలోని నల్బరీ జిల్లా బర్ఖానాజన్ ప్రాంతానికి చెందిన యువతికి పెళ్లి నిశ్చయమైంది. వరుడు ప్రసేన్‌జిత్ హలోయ్ పెళ్లి మండపానికి పీకలదాకా మద్యం సేవించి వచ్చాడు. పెళ్లి తంతు నిర్వహించడానికి అతను చాలా కష్టపడుతున్నాడు. వీడియోలో... ఒక వ్యక్తి, బహుశా వరుడి బంధువు, అతని వెనుక కూర్చొని మద్దతు ఇస్తున్నట్లు చూడవచ్చు. వధువు బంధువు తెలిపిన వివరాల ప్రకారం.. వరుడి తండ్రి కూడా మద్యం మత్తులో వచ్చాడు.

వీటన్నింటిని చూసి వధువు పెళ్లిని రద్దు చేసుకోవాలని నిర్ణయించుకుంది. గ్రామపెద్దలు, స్థానికులు ఆమె నిర్ణయానికి మద్దతు పలికారు. “వరుడు మాత్రమే కాదు అతని తండ్రి కూడా మద్యం మత్తులో కారు దిగే పరిస్థితిలో లేడు. పరిస్థితి చూసి వధువు స్వయంగా పెళ్లి చేసుకోకూడదని నిర్ణయించుకుంది." అని బంధువు చెప్పాడు.

పెళ్లి క్యాన్సిల్ చేసిన తర్వాత వధువు కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడం గమనార్హం.