Asianet News TeluguAsianet News Telugu

మునిగిపోతున్న బోట్‌పై నుంచి భయంతో కేకలు.. నీటిలో దూకేసిన ప్రయాణికులు.. ఇదే వీడియో

అసోంలో బ్రహ్మపుత్ర నదిలో రెండు పడవలు ఢీకొట్టుకున్నాయి. అందులో చిన్న బోట్ పూర్తిగా నీటమునిగింది. పడవ మునుగుతుండగా దానిపై ఉన్న ప్రయాణికుల కేకలతో కూడిన భయానక వీడియోను కాంగ్రెస్ కార్మిక విభాగం ట్విట్టర్ హ్యాండిల్ పోస్టు చేసింది.

assam boat capsizing horror video is here
Author
Guwahati, First Published Sep 9, 2021, 12:45 PM IST

గువహతి: చుట్టూ నీరు.. నిలుచున్న బోట్ నీటిలో మునిగిపోతున్నది. కాపాడేవారు లేరు. బోట్ ఒకవైపు మునిగిపోతుంటే మరోవైపు బయటకు వస్తున్న బోట్ భాగంపై స్థిరంగా నిలబడటానికి ఆ ప్రయాణికులు చేస్తున్న ప్రయత్నాలు.. అరుపులు, కేకలతో ఆ వాతావరణం భయానకంగా మారిపోయింది. కొందరైతే నీటిలో దూకేసి అక్కడే స్థిరంగా కనిపిస్తున్న మరో బోట్ వైపు ఈదడం మొదలెట్టారు. ఓ మహిళ కూడా చేతిలోని సంచిని నదిలో విసిరేసి దూకేశారు. ఈ దృశ్యాలను చూపిస్తున్న వీడియో ఇప్పుడు వైరల్ అవుతున్నది. అసోంలోని జోర్హాట్ నగరానికి సమీపంలోని బ్రహ్మపుత్ర నదిలో జరిగిన ఘటనకు సంబంధించినదే ఆ వీడియో.

 

అసోం జొర్హట్ నగరంలో ప్రవహించే బ్రహ్మపుత్ర నదిలో మజూలీ దీవి ఉన్నది. అక్కడి నుంచి నీమతి ఘాట్‌కు ప్రయాణించడానికి ప్రభుత్వ శాఖనే బోట్‌ల ద్వారా ప్రయాణ సౌకర్యాన్ని కల్పిస్తున్నది. కానీ, బుధవారం ఈ రెండు దీవుల మధ్య ప్రయాణిస్తున్న రెండు పడవలు ఎదురెదరుగా వెళ్తూ ఢీకొన్నాయి. దీంతో ఓ పడవ పూర్తిగా నీటిలో ముగినిపోయింది. ఈ రెండు పడవలపై సుమారు 100 మంది ప్రయాణిస్తున్నారు. ఈ ఘటనలో ఒకరు మరణించారు.

అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ మాట్లాడుతూ మొత్తం 90 మంది ఆ పడవలపై ప్రయాణిస్తున్నారని, ఇందులో ఇద్దరు గల్లంతయ్యారని, వారికోసం గాలింపులు జరుగుతున్నాయని వివరించారు. ఒకరు మరణించారని, 87 మందిని రక్షించామని తెలిపారు. ఈ ఘటనపై దర్యాప్తును ఆదేశించామని, ఇన్‌లాండ్ వాటర్ ట్రాన్స్‌పోర్ట్ శాఖకు చెందిన ముగ్గురు అధికారులను సస్పెండ్ చేసినట్టు చెప్పారు.

ప్రభుత్వం నడుపుతున్న పడవ, ఓ ప్రైవేటు ఆపరేటర్ నడుపుతున్న చిన్న బోట్ ఢీకొట్టుకున్నాయి. ఇందులో చిన్న బోట్‌లోని ప్రయాణికులు నీటిలో మునిగారు. ఆ బోట్ పూర్తిగా మునిగి బ్రహ్మపుత్ర నది అడుగున చేరింది. అది పూర్తిగా రివర్స్ అయి పడిపోయిందని రాత్రి మూడు గంటలకు దాన్ని చేరిన సహాయక సిబ్బంది చెప్పారు. దానిలోపలకు వెళ్లి చూడగా కేవలం ప్రయాణికుల సామాన్లు మినహా ఎవరూ చిక్కుకోలేదని వివరించారు. అయితే, ఆ బోట్ మునిగిపోతున్నప్పటి భయానక దృశ్యాలను వెల్లడించే వీడియోను అఖిల భారత అసంఘటితరంగ కాంగ్రెస్ కార్మిక విభాగం ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది.

Follow Us:
Download App:
  • android
  • ios