అరుణ్ యోగిరాజ్ ఎక్స్ క్లూజివ్ ఇంటర్వ్యూ : రాయితో మాట్లాడాను.. విగ్రహం తయారయ్యింది..

అరుణ్ యోగిరాజ్.. అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించిన బాలరాముడి విగ్రహ సృష్టికర్త. ఆయన ఏసియా నెట్ న్యూస్ కు ప్రత్యేకంగా ఇంటర్వ్యూ ఇచ్చారు. విగ్రహ తయారీకి ఎంపికవ్వడం నుంచి, విగ్రహం ప్రాణప్రతిష్టకు ఎంపికవ్వడం వరకు ఆ తొమ్మిదినెలలు ఆయన ప్రసవవేదనే అనుభవించారు. ఆ వివరాలు ఏసియానెట్ న్యూస్ ప్రతినిథి రాజేశ్ కల్రాతో పంచుకున్నారు. 

Asianetnews Exclusive Interview with Ram Lalla Idol Sculptor Arun Yogiraj - bsb

మైసూర్ : జనవరి 22, 2024 ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులకు, రామభక్తులకు.. దేశంలోని కోట్లాదిమందికి ఓ మరిచిపోలేని రోజు. ఆ రోజు అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవం జరిగింది. 500 సంవత్సరాలుగా ఎంతగానో ఎదురుచూస్తున్న బాలరాముడు కొలువు తీరాడు. స్వయంగా ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ ప్రాణప్రతిష్ట కార్యక్రమం అంగరంగవైభవంగా, శాస్త్రోక్తంగా జరిగింది. విగ్రహ శిల్పి అరుణ్ యోగిరాజ్ ఆ వివరాలను ఇలా పంచుకున్నారు. 

రాజేష్ కల్రా : నమస్తే, మీరు మాతో మాట్లాడడానికి, మీ పని గురించి మాట్లాడడానికి ఒప్పుకున్నందుకు ముందుగా ధన్యవాదాలు.

అరుణ్ యోగిరాజ్ : థ్యాంక్యూ

రాజేష్ కల్రా : మిమ్మల్ని నేను అరుణ్ అని పిలవొచ్చా? లేదా యోగీ అని పిలవాలా? మామూలుగా మిమ్మల్ని అందరూ ఎక్కువగా ఏమని పిలుస్తారు?

అరుణ్ యోగిరాజ్ : నన్నందరూ యోగిరాజ్ అని పిలుస్తారు

రాజేష్ కల్రా : అయితే నేనూ యోగిరాజ్ అనే పిలుస్తాను

అరుణ్ యోగిరాజ్ : ఓకే..

రాజేష్ కల్రా : యోగిరాజ్ జీ, విగ్రహతయారీకి షార్ట్ లిస్ట్ చేసిన ముగ్గురిలో మీరూ ఒకరు. ఇది వినగానే మొదటిసారిగా మీకు ఎలా అనిపించింది?

అరుణ్ యోగిరాజ్ : ఎలా అంటే.. గత 500 యేళ్లుగా రామమందిరం నిర్మాణం కోసం మనమంతా ఎదురుచూస్తున్నాం. నాకు బాగా గుర్తు.. మా నాన్న కూడా ఇలాంటి అవకాశం కోసం ఎదురు చూశారు. మా తాతగారు కూడా అవకాశం వస్తే రాముడి విగ్రహాన్ని తయారు చేయాలని ఎదురు చూశారు. ఆ ప్రముఖ శిల్పి మనవడిగా నేను అలాంటి అవకాశాన్ని పొందగలిగాను. షార్ట్ లిస్ట్ అయిన ముగ్గురిలో ఒకడిగా నేను ఎంపికయ్యాను. అది మరిచిపోలేని రోజు. నేను చాలా అదృష్టవంతుడిని. మా కుటుంబం గత రెండు వందల యాభై సంవత్సరాలుగా విగ్రహాలు తయారుచేస్తుంది. చివరికి నేను ఈ అవకాశాన్ని పొందగలిగాను.

రాజేష్ కల్రా : ముగ్గురిలో ఒకరిగా ఎంపికైన ఆ క్షణాలు ఎలా ఉన్నాయో చెప్పండి?

అరుణ్ యోగిరాజ్ : మా ముగ్గురికి అది చాలా పెద్ద బాధ్యత. ఎందుకంటే దేశం మొత్తం బాలరాముడు ఎలా ఉండబోతున్నాడో అని ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక్కడ ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే అంతకుముందు బాల రాముడిని ఎవరూ చేయలేదు. బాల రాముడు ఇలా ఉంటాడని ఊహా చిత్రాలు కూడా లేవు. మేమే, స్వయంగా ఇప్పుడు బాల రాముడిని తయారు చేయాలి. అయితే, మాకు కొన్ని సూచనలు ఇచ్చారు. ఐదేళ్ల వయసులో ఉన్న బాలరాముడు అయి ఉండాలి. పాదం నుంచి తలవరకు 51 ఇంచులు మాత్రమే ఉండాలి ఇలాంటివి. ఈ సూచనలను దృష్టిలో పెట్టుకొని గతంలో ఎవరైనా బాలరాముడు విగ్రహాన్ని లేదా పోలికలను చెప్పారా అని పరిశోధించడం ప్రారంభించాం. మాపై అతిపెద్ద బాధ్యత ఉంది. దేశం మొత్తాన్ని మేము చేసే పనితో మెప్పించాలి. దీని నుంచి బయటపడడానికి చాలా హోంవర్క్ చేయాల్సి వచ్చింది. నేనేతై ముందు అసలేం చేయాలి అనే దానిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించా. 

 

ఐదేళ్ల బాల రాముడు విగ్రహాన్ని చేయాలని ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. ముందుగా ఐదేళ్ల బాలుడి ముఖ కవళికలు ఎలా ఉంటాయో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాను. దీనికోసం మూడేళ్ల వయసు ఉన్న పిల్లలు, తొమ్మిదేళ్ల వయసు ఉన్న పిల్లలు ఎలా ఉంటారో, వారి అనాటమీ, వారి హావభావాలు చదువుకోవడం మొదలుపెట్టాను. దీన్నిబట్టి ఈ రెండు వయసుల మధ్యవయసు అయిన ఐదేళ్ల బాలుడు ఎలా ఉంటాడో తెలుసుకోవాలనుకున్నాను. ఇలా నా ఆలోచన విధానం కొనసాగింది.

Asianetnews Exclusive Interview with Ram Lalla Idol Sculptor Arun Yogiraj - bsb

రాజేష్ కల్రా : ఆ సమయంలో ఏదైనా ఆందోళనకు గురయ్యారా?

అరుణ్ యోగిరాజ్ : మొదటి రెండు నెలలు ఏం చేయాలో అర్థం కాలేదు. ఆ తర్వాత నాకేం తెలుసో అదే మొదలు పెడదామని అనుకున్నాను. దాని ప్రకారం మొదట బాలరాముడి విగ్రహానికి వెనక ఉన్న ఆర్చ్ ను చేయడం మొదలు పెట్టాను. ఎందుకంటే అది నాకు బాగా తెలిసిన పని. అది విగ్రహానికి సపోర్టుగా ఉండటమే కాకుండా, విగ్రహ జీవితకాలాన్ని పెంచుతుంది. అలా విగ్రహానికి వెనక ఆర్చ్ చేస్తానని ఆ విషయాలన్నీ నేను కమిటీతో చర్చించాను. అవన్నీ చేయడం నాకు చాలా తెలిసిన పని. కానీ  బాలరాముడు నాకు తెలియదు. ఎలా చేయాలో అంచనా లేదు. 

అదే సమయంలో నేను పిల్లల గురించి, అనాటమీ గురించి  చదవడం మొదలుపెట్టాను. శిల్పశాస్త్రం ఏం చెబుతుందో చదివాను. ఉత్తమ పంచతాళ నుంచి ఐదున్నర అడుగుల విగ్రహం ఎలా తయారు చేయాలి అనే విషయాలు తెలుసుకున్నాను.. శిల్పశాస్త్రం, జామెట్రికల్ మెజర్మెంట్స్ ఇస్తుంది. ఆ జామెట్రికల్ మెజర్మెంట్స్ లో  మనం జీవం తీసుకురావాలి. ఇది, శిల్పకారుడి ప్రతిభ, విగ్రహం తయారీలో అతనికున్న ప్రేమ, పట్టుదల  నిర్ణయిస్తుంది. 

ఇది చాలా బాధ్యతతో కూడుకున్న పని. అంతేకాదు మొదటి రెండు నెలలు నాకు ఏమీ అర్థం కాలేదు.. ప్రతిక్షణం ఎంతో హోంవర్క్ చేసేవాడిని. ఈ విగ్రహం తయారీతో  దేశం మొత్తానికి  నేను పరిచయం కావాలనుకున్నాను. గత ఏడు నెలలు, బాల రాముడి విగ్రహాన్ని చేస్తున్న సమయం మొత్తం ఇదే నేను ఆలోచించేవాడిని. 

రాజేష్ కల్రా : ఈ ఆందోళనను అధిగమించడానికి మీరు ఏం చేసేవారు?  ఎందుకంటే.. ఇది మీ పని మీద ప్రభావం చూపుతుంది?

అరుణ్ యోగిరాజ్ : నేను నా ఒత్తిడినంత రాముడు మీద చూపించేవాడిని. ప్రతిక్షణం నేను విగ్రహంతో మాట్లాడేవాడిని… ‘విగ్రహం తయారు చేయడానికి నేను రెడీగా ఉన్నాను. అది పూర్తయ్యేలా చేయాల్సిన బాధ్యత నీదే. నాతో నీ విగ్రహాన్ని తయారు చేయించుకునే బాధ్యత నీదే.  ఈ రాయిలో నిన్ను నేను చూడాలనుకుంటున్నాను. నాకు దర్శనం ఇవ్వు.. నిన్ను చూసే మొదటి భక్తుడిని నేనే కావాలి’ అలా మాట్లాడుతూ నా  భారాన్నంతా రాముడు మీద వేశాను. క్రమం తప్పకుండా రాయితో మాట్లాడుతూ ఉండేవాడిని.

Asianetnews Exclusive Interview with Ram Lalla Idol Sculptor Arun Yogiraj - bsb

ఇది నేను మా నాన్న దగ్గర నుంచి నేర్చుకున్నాను. చిన్నప్పటి నుంచి మా నాన్న నాకు ఈ విషయం చెప్తుండేవారు. మొదట్లో నేను ఓ గంటసేపు కూర్చుని లేచి అటూ, ఇటూ తిరుగుతూ ఉండేవాడిని…ఆ సమయంలో మా నాన్న నన్ను పిలిచి అలా తిరగడం కాకుండా కూర్చుని రాయితో పరిచయం పెంచుకోమని చెప్పేవాడు. ‘ఎంత ఎక్కువసేపు రాయితో గడిపితే.. అంతగా రాయి నిన్ను వింటుందని’ చెప్పేవాడు. అయితే అప్పుడు నాకు ఇది అర్థం కాకపోయేది. నేను శిల్పాలు తయారు చేయడం 11 ఏళ్ళ వయసులో నేర్చుకోవడం మొదలు పెట్టాను. కానీ, నాకు 21 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత కానీ ఇది అర్థం కాలేదు.

ఆ తర్వాత గత 20 సంవత్సరాలుగా నేను ఇదే ప్రాక్టీస్ చేస్తున్నాను. రాయితో మాట్లాడడం మొదలు పెట్టాను.. నేను ఏం చెప్తున్నాను నా రాయి అర్థం చేసుకుంటుందని నమ్ముతాను. నేనేం చేయాలనుకుంటున్నాను అంతిమంగా అది చూడగలుగుతానని నమ్ముతాను. ఇవన్నీ.. అంటే మా నాన్న  గైడెన్స్, నా అంకితభావం, పని విషయంలో నాకున్న ప్రేమ..ఇవన్నీ నేను సరైన దారిలోనే వెళుతున్నానని  అనుకునేలా చేస్తున్నాయి. 

రాజేష్ కల్రా : మీతో పాటు విగ్రహ తయారీకి ఎంపికైన మరో ఇద్దరు ఎవరో మీకు తెలుసా?

అరుణ్ యోగిరాజ్ : అందులో ఒకరైన జి.యల్. భట్ సార్ గురించి నాకు తెలుసు. ఆయన కర్ణాటకకు చెందిన వారే. కానీ, నాకు సత్యనారాయణ పాండే గురించి తెలియదు. మా ముగ్గురికి ఒకే హోటల్లో బస ఏర్పాటు చేశారు. అయితే, మేం ముగ్గురం విగ్రహం తయారీ విషయం గురించి ఏ మాత్రం చర్చించద్దని అనుకున్నాం. ఎందుకంటే దేశానికి అత్యుత్తమమైనది, ప్రత్యేకమైనది, దైవత్వం ఉట్టిపడేది, అద్భుతంగా ఉండేది.. ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. అందుకే ఎవరు ఏం చేస్తున్నారో.. చర్చించొద్దనుకున్నాం. మేం మాట్లాడుకునేటప్పుడు ప్రపంచంలోని అనేక విషయాల గురించి మాట్లాడుకునే వాళ్లం. కానీ విగ్రహం విషయాన్ని మాత్రం ఎత్తే వాళ్ళం కాదు.

రాజేష్ కల్రా : మీరు ముగ్గురు పనిచేసే ప్రాంతాలు దగ్గర దగ్గరే ఉండేవా? లేకుంటే..  దూరంగా ఉండేవా?

అరుణ్ యోగిరాజ్ : మేం ముగ్గురం కలిసే ఉండే వాళ్ళం. బ్రేక్ ఫాస్ట్, భోజనం  కలిసే చేసేవాళ్ళం. మా పని ప్రదేశాలు..  ఒకరి నుంచి మరొకరిది 500 మీటర్ల దూరంలో ఉండేవి. 

రాజేష్ కల్రా : మీరు ఎప్పుడూ వేరే వాళ్ళ పని ప్రదేశానికి వెళ్లి వాళ్ళు ఎలా తయారు చేస్తున్నారో చూడలేదా?
 
అరుణ్ యోగిరాజ్ : లేదు, లేదు… మా సెలక్షన్ అయిన తర్వాత ఏడు నెలల తర్వాతే మేము ఒకరి వర్క్ మరొకరు చూసుకున్నాం.

రాజేష్ కల్రా : మీరు విగ్రహం తయారు చేస్తున్న సమయంలో మీ దినచర్య ఎలా ఉండేది?

అరుణ్ యోగిరాజ్ : నేను అథ్లెట్ ని. నన్ను నేను ఫిట్ గా ఉంచుకోవడం చాలా ముఖ్యం. దీనికోసం ప్రతిరోజు కనీసం 45 నిమిషాల నుంచి గంట వరకు వర్కౌట్స్ చేస్తాను. గత 25 ఏళ్లుగా ఇది నా దినచర్యలో భాగం. ఇక విగ్రహ తయారీ సమయంలో నేను యోగా నేర్చుకున్నాను. ఫ్రీ యోగా ట్రైనింగ్ ఇచ్చేవారు. మొదటి మూడు నెలలు యోగా నేర్చుకున్నాను. యోగా తరువాత పూజ చేసుకుంటాను. ఇవన్నీ అయ్యాక కనీసం 12 గంటలపాటు రాయితో గడుపుతాను. గత 25 ఏళ్లుగా ఇలాగే గడుస్తుంది.  ప్రతిరోజు 10 నుంచి 12 గంటలు రాళ్లతో గడుపుతుంటాను. ఇవన్నీ అయ్యాక  సమయం దొరికితే సాయంత్రం పూట కూడా వర్కౌట్స్ చేస్తుంటాను.

రాజేష్ కల్రా : ట్రస్ట్ నుంచి బాలరాముడు విగ్రహానికి సంబంధించి  ఐదేళ్ల వయసు ఉండాలి,  హైటు రాయి గురించిన  సూచనలు వచ్చినప్పుడు… మీరు ఎలాంటి ఛాలెంజెస్ ఎదుర్కున్నారు? 

అరుణ్ యోగిరాజ్ : అతిపెద్ద సవాల్ ఏంటంటే ఐదేళ్ల వయసు బాలుడు. ఎందుకంటే ఐదేళ్ల బాలుడి విగ్రహాన్ని తయారు చేయాలి కానీ ఆ విగ్రహంలో బాలుడి అమాయకత్వంతో పాటు రాముడి హుందాతనం రావాలి. ఆ విగ్రహం సహజంగా ఉండాలి. చూసిన ప్రతి ఒక్కరి  మనసుకు హత్తుకునేలా ఉండాలి. ఐదేళ్ల బాలుడులోనే రాముడిని దర్శించుకోగలగాలి. అతని ఠీవీని చూడగలగాలి. అదంత సులభమైన విషయం కాదు. ఇదే మాకు అతిపెద్ద సవాలుగా ఉండింది. 10/7 ఇంచుల ఫ్రేమ్ లో ఇవన్నీ రావాలి. ఇదే మా ముందు ఉన్న అతిపెద్ద సవాలు.

రాజేష్ కల్రా : బాల రాముడి విగ్రహం చెక్కడమనేది సాక్షాత్ దైవకార్యం.  మీరే ముందు చెప్పినట్లుగా… మీ ఆందోళన, ఒత్తిడిని తగ్గించుకోవడానికి రాయితో మాట్లాడడం, రాముడే మీరు ఎంచుకున్న రాయి నుంచి రూపొందేలా దారి చూపించాలని అడగడం ఇవెలా పనిచేశాయి. ముఖ్యంగా, శిల్పకారులు విగ్రహం తయారు చేయడం కోసం  కొన్ని రకాల పనిముట్లను, ఓ పని విధానాన్ని ఫాలో అవుతారు. అలా కాకుండా  బాలరాముడు విగ్రహ తయారీకి ప్రత్యేకంగా మీరు చేసింది ఏమిటి? 

అరుణ్ యోగిరాజ్ : ప్రత్యేకం అంటే..  700 సంవత్సరాల క్రితమే శిల్వశాస్త్రంలో ఓ విషయాన్ని చెప్పారు. అదే ‘కిలపంజర్ రచనే’ అనే ప్రాక్టీస్ ఉంది. ఏంటంటే.. దేవుడి విగ్రహ తయారీకి ఎంచుకున్న రాయికి ఉదయం, సాయంత్రం పూజలు చేయాలి. చేతికి కంకణం కట్టుకోవాలి. నేను పూర్తిగా దీనికి అంకితమై ఉన్నాను. ఇది పూర్తయ్యే వరకు ఇంకో పని చేయను అనుకోవాలి. బాల రాముడి విగ్రహం పూర్తయ్యే వరకు నేను వేరే ఇతర విగ్రహాల తయారీకి ఒప్పుకోలేదు. దానివల్ల నేను.. నా జీవనభృతికి పనికి వచ్చే అన్ని రకాల పనులను ఆపేశాను. గత తొమ్మిది నెలలుగా ఒక చిన్న ఆర్డర్ కూడా తీసుకోలేదు.

బాల రాముడి విగ్రహానికి నేను నా వంద శాతం కంటే ఎక్కువ ఇవ్వాలనుకున్నాను. దీని నుంచి నా దృష్టి మరల్చకుండా ఉండాలనుకున్నాను. కారణం, గత 500 సంవత్సరాలుగా మనం దీని కోసం ఎదురు చూస్తున్నాం. అందుకే అనేక రకాల ప్రాక్టీసులు చేశాను. శిల్పశాస్త్రాన్ని, అనాటమీని, దేశం మొత్తం ఎదురుచూస్తున్న ఆసక్తిని కలపాలనుకున్నాను. ఇంకో విషయం ఏంటంటే.. నేను దక్షిణ భారతదేశానికి చెందిన వాడిని. నేను తయారు చేసే శిల్పాల్లో దక్షిణ భారత స్టైల్ వచ్చేస్తుంది. అలారాకుండా చూసుకోవాలి. దేశం మొత్తం తమది అనుకునేలా ఈ విగ్రహం తయారు కావాలి. 

Asianetnews Exclusive Interview with Ram Lalla Idol Sculptor Arun Yogiraj - bsb

అందుకోసం, దేశవ్యాప్తంగా  రాముడిని ఎలా చూస్తారనే అనేక విషయాలను  పరిశోధించాను. ఈ పని ప్రారంభించడానికి ముందు ప్రతిరోజు దేశవ్యాప్తంగా ఉన్న 100 ఫోటోలను సేవ్ చేస్తుండే వాడిని.  రోజు పడుకునే ముందు.. వెయ్యి ఫోటోల దాకా చూసిన తర్వాతే పడుకునేవాడిని.  మరుసటి రోజుకి అలా నన్ను నేను ప్రిపేర్ చేసుకునేవాడిని. వీటన్నింటి వల్ల విగ్రహంలోని ప్రతి ఇంచ్ లో అనేక జాగ్రత్తలుతీసుకొని.. దేశానికి అత్యుత్తమమైనది అందించడానికి ప్రయత్నించేవాడిని.  అంతకంటే ఎక్కువగా మిగతా వారి కంటే ఎక్కువగా రాముడిని చూడాలని నేనే అనుకునేవాడిని. 

రాజేష్ కల్రా : అంటే రాముడు విగ్రహాన్ని తయారు చేయడానికి ఏమైనా ప్రత్యేకమైన సాధనాలు ఎంచుకున్నారా?

అరుణ్ యోగిరాజ్ : మొదట మేము.. టెక్నాలజీ ఉపయోగించాలని అనుకున్నాం.  ఎందుకంటే విగ్రహ తయారీలో ముఖ్యమైనది రాయి. ఇది చాలా గట్టిగా ఉంటుంది. గ్రైండింగ్ అండ్ కటింగ్ మిషన్ ఉపయోగించాలనుకున్నాం. కానీ విగ్రహానికి మిషిన్ ఫినిషింగ్ ఇవ్వాలని అనుకోలేదు.చేతితోనే ఫినిషింగ్ చేయాలనుకున్నాను. చేతులతో ఫినిషింగ్ ఇవ్వడం అనేది ఎమోషన్ కి సంబంధించింది. అందుకే మొదటి యాభై శాతం పని కోసం  మిషనరీని ఉపయోగించాను. మిగతా 50 శాతాన్ని కార్బైడ్ బిడ్ టూల్స్ ఉపయోగించాం. ఇవి చాలా హార్డ్ టూల్స్. హార్డ్ స్టోన్ మీద.. ఈ హార్ట్ టూల్స్ తో చేయడం చాలా కష్టమైన పని. అంతేకాదు ప్రతి ఒక్కటి హ్యాండ్ ఫినిష్ చేసిందే. దీని కోసం నేను ఫైలింగ్ టూల్స్, అట్లాస్ సాండ్ పేపర్ వాడాం.  ఫినిషింగ్ సమయంలో కొబ్బరి నూనెను ఉపయోగించాం. ఎలాంటి రసాయన పదార్థాలను వాడలేదు. విగ్రహానికి నిగారింపు రావడానికి, రంగు రావడానికి ఎలాంటి రసాయనాల మీద ఆధారపడలేదు. మొత్తం.. సహజంగా రూపొందించిన విగ్రహమే.

రాజేష్ కల్రా : ట్రస్ట్ నుండి మీతో  రెగ్యులర్ గా ఎవరు టచ్ లో ఉండేవారు?

అరుణ్ యోగిరాజ్ : రెగ్యులర్గా చంపక్ రాయ్ గారు మాతో టచ్ లో ఉండేవారు. మా దగ్గరికి వస్తుండేవాళ్ళు, మాకు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని కనుక్కుంటూ ఉండేవారు. దీపేంద్ర మిస్టర్ గారు కూడా రెగ్యులర్ గా వస్తుండేవారు. మా ముగ్గురి వర్క్ ప్లేస్ లోకి వచ్చేవారు. విగ్రహానికి సంబంధించి ప్రశ్నలు వేస్తుండేవారు. కాళ్లు ఎలా ఉండబోతున్నాయి.. బాల రాముని ఎలా చూపించాలనుకుంటున్నారు? అని ప్రశ్నించేవారు. అయితే, మొదట్లో మాకు కూడా తెలియదు. కానీ మేము చేసే పనిలో నమ్మకముంచాం. ఒక పనిని నమ్ముకుని ముందుకు పోతున్నాం.. అంతిమంగా ఫలితం ఎలా ఉంటుంది అనేది మాకు కూడా తెలియదు. ఆయన మెజర్మెంట్స్ విషయంలో చాలా పర్టికులర్ గా ఉండేవారు. చంపక్ రాయ్ చాలా కామ్ గా ఉండేవారు. వచ్చి చూసి మా మానసిక స్థితిని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించేవారు. మేము చాలా కంఫర్ట్ గా ఉండి, మా పనిని సమర్థవంతంగా చేసేలా చూసుకునేవారు. మేమేం చేయాలనుకుంటున్నామో ఆ స్వేచ్ఛను ఇచ్చారు.. అది చాలా ముఖ్యమైనది.

ఇక్కడ అందరూ బాధ్యతాయుతంగా ఉండేవారు. శిల్పకారులందరూ కంఫర్టబుల్గా తమ పని చేసుకోవడానికి కావలసిన అన్ని ఏర్పాట్లు చేసేవారు.. అది నాకు బాగా నచ్చింది. ఇలాంటి హై ప్రోఫైల్డ్ ప్రాజెక్టుకి అది చాలా అవసరం. ఎలాగంటే.. ఒక అధికారి.. ఒకవేళ మా ముగ్గురిలో.. ఎవరో ఒకరి స్టూడియోకు మాత్రమే వచ్చి వెళ్లారనుకుందాం. అప్పుడు, మిగతా ఇద్దరి  మీద  ఆ  ప్రభావం పడుతుంది.  ఇక్కడేదో జరుగుతుందనే  అనుమానం మొదలవుతుంది. అది పనిలో రిఫ్లెక్ట్ అవుతుంది. అయితే, వాళ్లు ఎప్పుడూ అలా చేయలేదు. . ఎప్పుడు వచ్చినా.. ముగ్గురి స్టూడియోలకు వచ్చేవారు. ముగ్గురితోనూ మాట్లాడేవారు. వాళ్ళు ఏదైనా చెప్పదలుచుకుంటే మా ముగ్గురిని పిలిచి ఒకేసారి ఎలాంటి మార్పులు కావాలనుకుంటున్నారు. ఎలా ఉండాలనుకుంటున్నారు. అనే విషయాలను ఒకేసారి చెప్పేవారు. అది చాలా మంచి విషయం. బాధ్యతతో కూడుకున్న విషయం. ఎందుకంటే ముగ్గురు కళాకారులు ఒకే దగ్గర ఉండడం చాలా కష్టం. కానీ ఇక్కడ మేం ముగ్గురం చాలా ఎంజాయ్ చేశాం. 

రాజేష్ కల్రా : విగ్రహ తయారీ క్రమంలో మీరు పర్సనల్గా  మీకు ఎలాంటి ఆటంకాలు ఎదురయ్యాయి?

అరుణ్ యోగిరాజ్ : ఏప్రిల్ లో నేను సెలెక్ట్ అయ్యాను. జూన్ నుంచి పనిచేయడం మొదలు పెట్టాను. అప్పటికే మాకు చాలా సూచనలు ఇచ్చారు. ఇవన్నీ రాతపూర్వకంగా ఉన్నాయి. ఆ తర్వాత నేను శిల్పాన్ని చెక్కడం మొదలుపెట్టాను. దాదాపు 70% విగ్రహ తయారీ పూర్తయింది. ఆ సమయంలో ఢిల్లీలో భూపేంద్ర మిశ్రాజీ దగ్గర నుంచి నాకు ఫోన్ వచ్చింది. వెంటనే నేను అయోధ్య నుంచి ఢిల్లీకి బయలుదేరి వెళ్లాను. అక్కడ ఆయన ఒక విషయం చెప్పారు. నేను తయారు చేస్తున్న విగ్రహానికి సంబంధించిన రాయి విషయంలో ఒక సమస్య వచ్చిందని చెప్పారు.

మేము ఎంచుకున్న ప్రతీ రాయి ఐదు నుంచి 8 రకాల పరీక్షలు పాస్ కావాల్సి ఉంటుంది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రాక్ మేనేజ్మెంట్ ఈ రాయి పరీక్షలు నిర్వహిస్తుంది. కోలార్ కు చెందిన సైంటిస్టులు ఈ పరీక్షలు చేస్తారు. అయోధ్యలో వాడే ప్రతి రాయిని వీరు పరీక్షిస్తారు. ఈ క్రమంలోనే భూపేంద్ర మిశ్రాజి నాకేం చెప్పారంటే..  ఈ పరీక్షల్లో విగ్రహం కోసం నేను వాడుతున్న రాయి నెగెటివ్ రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఎనిమిది పరీక్షల్లో ఒక టెస్టులో నెగటివ్ రిపోర్టు వచ్చిందట. ఆయన ఏమన్నారంటే ఇంకో కొత్తది తయారు చేయడం మొదలు పెట్టండి అని చెప్పారు. 

రాజేష్ కల్రా : అప్పటికి ఎన్ని నెలలు అయింది?

అరుణ్ యోగిరాజ్ : ఆగస్టు చివర్లో ఇది తెలిసింది. సెప్టెంబర్ లో కొత్త విగ్రహం తయారు చేయడం మొదలు పెట్టాను. 

రాజేష్ కల్రా : అంటే మీరు జూన్లో మొదలుపెట్టి.. జూన్, జూలై ఆగస్టు మొత్తం రెండున్నర నెలలు పని చేసిన తర్వాత ఒక టెస్టులో మీ రాయికి నెగటివ్ రిజల్ట్ వచ్చింది. అంటే మీరు మళ్లీ మొదటి నుంచి  చేయాలి? 

అరుణ్ యోగిరాజ్ : అవును

రాజేష్ కల్రా : అంటే,  మిగతా వాళ్ళు ఎనిమిది నెలలు చేసిన పనిని… మీరు నాలుగున్నర నెలల్లో పూర్తి చేయాల్సి వచ్చింది?

అరుణ్ యోగిరాజ్ : అవును

రాజేష్ కల్రా : ఇది మిమ్మల్ని ఒత్తిడికి గురి చేయలేదా? బాధ, టెన్షన్, డిప్రెషన్ కి గురిచేయలేదా? 

అరుణ్ యోగిరాజ్ : ఆయన ఏం చెప్పారంటే…  నువ్వు విగ్రహాన్ని తయారు చేయడం మళ్ళీ మొదలుపెట్టు అన్నారు.  అంతేకానీ  దీనివల్ల  ఈ ముగ్గురిలో నుంచి నన్ను పక్కనపెడుతున్నాం అనలేదు. మళ్లీ ముగ్గురిలో ఒకడిగా పోటీ పడడానికి అవకాశం ఇచ్చారు. మళ్లీ నన్ను నేను నిరూపించుకోవడానికి ఓ అవకాశం ఇచ్చారు. ఆ విషయానికి నేను చాలా సంతోషపడ్డాను. నాకు తెలుసు నేను అది చేయగలనని. ఎందుకంటే.. మా తాత గారి దగ్గర నుంచి మా నాన్నకి.. మా నాన్న దగ్గర నుంచి నాకు అందిన విజ్ఞానం నాకు ఆ నమ్మకాన్ని ఇచ్చింది.  ఇంకోవైపు, మామూలుగా రెగ్యులర్ శిల్పకారుల కంటే నేను కొంచెం ఫాస్ట్ గా పనిని చేస్తాను. 

కానీ ఇక్కడికి వచ్చేసరికి పరిస్థితి కాస్త వేరు.. నాతో పోటీ పడుతున్న మరో ఇద్దరు కళాకారులు నా ముందే పనిలో పురోగతిలో ఉన్నారు. ఇంత దగ్గరికి వచ్చిన తరువాత ఇలా ఎందుకు అయ్యింది అని బాధపడ్డాను. బాలరాముడి విగ్రహ తయారీకి నేను ఎంపికయ్యాను…విగ్రహాన్ని  పూర్తి చేయడానికి చాలా దగ్గరికి వచ్చాను. ఈ సమయంలో ఇలా ఎందుకు జరిగింది అని చాలా డిసప్పాయింట్ అయ్యాను. ఆ సమయంలో చంపత్ రాయ్ గారు బాగా సపోర్ట్ ఇచ్చారు.

అరుణ్ విషయంలో ఇలా జరిగింది, బాధపడుతున్నాడు అని తెలిసి ఆయన వెంటనే నా దగ్గరికి వచ్చారు. ఎంతో మోరల్ సపోర్ట్ ఇచ్చారు. నమ్మకాన్ని వదిలిపెట్టొద్దన్నారు. ఇవన్నీ భగవంతుడు పెట్టే పరీక్షలు. వాటిలో నెగ్గడమే మనం చేయాల్సింది  అంటూ సాంత్వన వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో ఆయన అలా మాట్లాడకపోతే నేను డిప్రెషన్ లోకి వెళ్లి పోయే వాడినే.

రాజేష్ కల్రా : మిగతా వాళ్ళు ఎనిమిది నెలల్లో చేసిన పనిని మీరు మూడున్నర నాలుగు నెలల్లో చేయాల్సి వచ్చింది. అప్పుడు మీరు ఇంకా ఎక్కువ సమయాన్ని పనిలో గడిపారా లేక ముందులాగే అంతే సమయాన్ని వెచ్చించారా?
 
అరుణ్ యోగిరాజ్ : ముందుకంటే నాలుగు గంటలు  అధికంగా పనిచేయడం మొదలుపెట్టాను. అంతకుముందు రోజు 12 గంటలు పనిచేసే వాడిని… ఇంకో నాలుగు గంటలు ఎక్కువ పని చేయడం మొదలు పెట్టాను. దీనికి గత 25 ఏళ్లుగా నేను మైంటైన్ చేస్తున్న నా శారీరక దృఢత్వం బాగా సహకరించింది. ఇవన్నీ జరిగాయని నేను క్వాలిటీలో కాంప్రమైజ్ అవదలుచుకోలేదు. జీవితంలో ఒక్కసారే ఇలాంటి అవకాశం వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ దీన్ని కోల్పోవద్దు. . ప్రతీ నిమిషాన్ని వాడుకోవాలి. 

నేను పని పూర్తి చేసుకుని పడుకోవడానికి వెళ్ళినా కూడా నాకు నిద్ర పట్టకపోయేది.  నిద్రలో కూడా నేను పనిచేస్తుండే వాడిని. రేపు ఎలా చేయాలి..? ఇప్పటివరకు ఏం చేశాను ఆలోచిస్తుండే వాడిని. అయితే, రెండోసారి మళ్లీ మొదలుపెట్టినప్పుడే నేను అయోధ్య గురించి ఎక్కువగా తెలుసుకోగలిగాను. ఇంకా ఎక్కువగా అయోధ్యతో కనెక్ట్ అయ్యాను. దానివల్లే.. మొదటి విగ్రహం కంటే మరింత అద్భుతంగా రెండో విగ్రహాన్ని తయారు చేయగలిగాను. 

రాజేష్ కల్రా : చివరికి, మీ విగ్రహమే ప్రాణ ప్రతిష్టకు ఎంపికైందన్న విషయం తెలిసినప్పుడు మీ రియాక్షన్ ఎలా ఉంది?  డిసెంబర్ చివర్లో ఇది వెలుగు చూసింది కదా.  మీకు ఈ విషయాన్ని ఎలా చెప్పారు?

అరుణ్ యోగిరాజ్ : డిసెంబర్ 28న మాకు సమాచారం ఇచ్చారు. ట్రస్టీలందరూ విగ్రహాలను చూడడానికి వస్తున్నారు. మీరంతా మీరు తయారుచేసిన విగ్రహంతో  సిద్ధంగా ఉండాలని చెప్పారు. డిసెంబర్ 28న నేను అయోధ్యకు వెళ్లాను. నేను తయారుచేసిన విగ్రహాన్ని ఎల్లో క్లాత్ తో కప్పి ఉంచాను. వచ్చిన వారితో విగ్రహ తయారీ గురించి నేను ఎలా ఆలోచించాను చెప్పాను. నాకు ఇంగ్లీష్, హిందీ  అంత బాగా రాదు... అయినా వారితో కమ్యూనికేట్ చేశాను. ఆ తర్వాత నేను విగ్రహానికి ఉన్న క్లాత్ ను తీశాను. ఆ సమయంలో ఓ అద్భుతం జరిగింది. విగ్రహాన్ని చూసిన ట్రస్టీలందరూ ఒక్కసారిగా చేతులెత్తి  బాలరాముడికి మొక్కారు. నా కమ్యూనికేషన్ బాగా ఉండదని నాకు తెలుసు. కానీ ఆ విషయాన్ని భగవంతుడే చెప్పినట్టుగా అనిపించింది.

రాజేష్ కల్రా : దేవుడే తనని తాను పరిచయం చేసుకున్నాడంటారు? 

అరుణ్ యోగిరాజ్ : అవును, ఆరోజు రాత్రి నాకు చంపక్ రాయ్ గారి దగ్గర నుంచి..మళ్ళీ ఓ ఫోన్ కాల్ వచ్చింది. ఎందుకంటే నా రిటన్ టికెట్ 30వ తారీకు బుక్ చేసుకున్నాను. ఇప్పుడే మైసూర్ పోవడానికి ఆలోచించకు ఇక్కడే కొద్ది రోజులు ఉండు అన్నారు. 

రాజేష్ కల్రా : మిగతా ఇద్దరికీ కూడా అలాంటి ఫోన్ కాల్స్ వచ్చాయా?

అరుణ్ యోగిరాజ్ : లేదు

రాజేష్ కల్రా :  అది మీకు మీ విగ్రహమే ఎంపికయ్యే అవకాశాలు ఉన్నాయన్న ఇండికేషన్ లాగా అనిపించిందా?

అరుణ్ యోగిరాజ్ : బహుశా నా విగ్రహమే సెలెక్ట్ అయిందేమో అనుకున్నాను. కాకపోతే.. పూర్తిగా ఏ విషయం తెలియదు. చంపత్ రాయ్ నీ విగ్రహం  ఎంపికయింది అని చెప్పలేదు. కేవలం, అయోధ్యలో ఉండు అని మాత్రమే చెప్పారు. 

రాజేష్ కల్రా : మీ విగ్రహమే ఎంపికైందని అధికారికంగా మీకు ఎప్పుడు చెప్పారు?

అరుణ్ యోగిరాజ్ : జనవరి 8 అనుకుంటా… ఎందుకంటే ఆ సమయంలో విగ్రహానికి అలంకరించే దుస్తులు,  నగలు ఎంపికచేసే ప్రక్రియ మొదలయింది.  అప్పుడు నాకు అర్థమయింది నా విగ్రహమే ఎంపికయ్యిందని. ఫైనల్ గా నా విగ్రహం సెలెక్ట్ అయిన తర్వాత నేను అంతగా సంతోషపడలేదు. బాల రాముడి విగ్రహాన్ని చెక్కడానికి ఎంపిక చేసిన ముగ్గురిలో ఒకడిగా సెలెక్ట్ అయినప్పుడున్నంత ఎగ్జైట్మెంట్ లేదు. ఆ తర్వాత చివరికి నా విగ్రహమే ఎంపికైనా.. చాలా నర్వస్ గా ఫీల్ అయ్యాను. ఎందుకంటే.. విగ్రహాన్ని ఏ చిన్న పొరపాటు జరగకుండా.. చిన్న గీత పడకుండా చాలా జాగ్రత్తగా ప్రతిష్టించాలి. . నా విగ్రహం ఎంపికైందని తెలిసిన తర్వాత…విగ్రహాన్ని ముట్టుకోవడానికి కూడా నేను చాలా నర్వస్ ఫీలయ్యాను. 

అంతకు ముందు  విగ్రహాన్ని  తయారు చేయడానికి త్రీ పాయింట్ హామర్ వాడిన వాడిని, చాలా రఫ్ గా ఉన్న నేను… ఇప్పుడు విగ్రహాన్ని ముట్టుకోవడానికి భయపడ్డాను. ముట్టుకోవాలన్నా.. లేపాలన్నా ఆందోళన పడేవాడిని.

రాజేష్ కల్రా : మీ విగ్రహం ఎంపికైన తర్వాత,  మిగతా ఇద్దరు  శిల్పకారుల స్పందన ఎలా ఉంది?

అరుణ్ యోగిరాజ్ : మేము ముగ్గురం చాలా స్పోర్టివ్ గా ఉన్నాం. ముగ్గురిలో ఎవరిదైనా సరే ఉత్తమమైనదే  ఎంపిక కావాలనుకున్నాం. దేశం మొత్తానికి ఒక అద్భుతమైనది  చేరాలని అనుకున్నాం.  అంతేకానీ,  నేను చేసిన విగ్రహమే ఎంపిక కావాలి అని స్వార్థంతో లేం. ఒకవేళ నాది ఎంపిక కాకుండా వాళ్ళిద్దరిలో ఎవరిది ఎంపికైనా కూడా నేను సంతోష పడేవాడిని.వాళ్లు కూడా అలాగే ఉన్నారు.  నాది ఎంపికైందని తెలిసిన తర్వాత వెంటనే నాకు కంగ్రాట్యులేషన్స్ చెప్పారు. 

ఆ తర్వాత వారు తయారు చేసిన విగ్రహాన్ని చూసే అవకాశం నాకు వచ్చింది.  చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు. నా విగ్రహం కంటే కూడా అందంగా ఉందనిపించింది.  నేను చెప్పిన విగ్రహం కంటే వారి విగ్రహాలే నాకు బాగా నచ్చాయి. ఎందుకంటే నేను నా విగ్రహాన్ని చాలా రోజుల నుంచి చూస్తున్నాను.  వాళ్ళ విగ్రహాలు ఒకసారిగా చూసేసరికి నాకు బాగా నచ్చాయి. 

రాజేష్ కల్రా : ఒకవేళ ముగ్గురు చేసిన దాంట్లో ఏ విగ్రహాన్ని ఎంపిక చేయమని మిమ్మల్ని అడిగితే మీరు ఏది ఎంపిక చేస్తారు?

అరుణ్ యోగిరాజ్ : నేను తయారుచేసిన విగ్రహాన్నే ఎంపిక చేస్తాను. ఎందుకంటే,  నేనొక ఎక్సర్ సైజ్ చేసేవాడిని.  మిగతా వాళ్ళు తయారు చేసే ప్రాంతానికి వెళ్లి విగ్రహాన్ని చూడకపోయేది కానీ..  మా ముగ్గురి స్టూడియోలకు రెగ్యులర్గా సహాయ సహకారాలు అందించడానికి పది పన్నెండు మంది దాకా స్టాఫ్ ఉండేవాళ్ళు.  వీరంతా తరచుగా మా స్టూడియోల చుట్టే తిరుగుతుండేవాళ్ళు.  నేను వారిని ఎవరి విగ్రహం బాగుంది అని అడిగేవాడిని. అదికూడా ఇక చివరి రోజుల్లో.. వారిలో ప్రతి ఒక్కరూ  ముగ్గురు చాలా బాగా చేశారు  అని చెప్పేవారు. ఈ ముగ్గురిలో ఎవరి విగ్రహాన్ని మిమ్మల్ని ఎంపిక చేయమంటే ఏది ఎంపిక చేస్తారు అని అడిగేవాడిని. ఇదంతా కేవలం  నా ఆసక్తి కోసం అడుగుతున్నానని చెప్పేవాడిని.  వారంతా ముగ్గురు చాలా అద్భుతంగా చేశారు కానీ మమ్మల్ని ఎంపిక చేసుకోమంటే మీ విగ్రహాన్ని  చెబుతాం.  ఎందుకంటే మీ విగ్రహంలో జీవ కల ఉట్టిపడుతుంది.. అని అన్నారు.అది నా విగ్రహం విషయంలో నాకు మొట్టమొదట వచ్చిన ఫీడ్ బ్యాక్.

రాజేష్ కల్రా : బాల రాముడి విగ్రహం ప్రాణ ప్రతిష్ట కోసం ఎంపికైన తర్వాత మీ జీవితంలో  వచ్చిన మార్పు ఏంటి?

అరుణ్ యోగిరాజ్ : దీనికంటే ముందు నేను రెండు అతిపెద్ద ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టులు చేశాను.  ఒకటి ఢిల్లీలో ఉన్న సుభాష్ చంద్రబోస్ విగ్రహం.  కేదార్ నాథ్ లోని ఆది శంకరాచార్య విగ్రహం  తయారు చేశాను. ఇది కూడా అలాగే ఉంటుందనుకున్నాను.  ఎందుకంటే ఆ విగ్రహాల తయారీ ప్రతిష్టాపన తర్వాత.. కొద్ది రోజుల వరకు కొంతమంది రావడం నన్ను కలవడం ఇంటర్వ్యూలు తీసుకోవడం జరిగింది.. ఆ తర్వాత మళ్లీ మామూలుగానే నా దినచర్య గడిచి పోతుండేది. 

కానీ ఇది అలా కాదు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది భారతీయులు బాలరాముడితో  కనెక్ట్ అయ్యారు. వారంతా నన్ను ఎంతో అభిమానిస్తున్నారు. వారు కురిపిస్తున్న ప్రేమలో మునిగిపోయాను. ఇంతగా  ప్రతిస్పందన వస్తుందని నేనెప్పుడూ ఊహించలేదు. రాముడు విగ్రహం తయారుచేసిన శిల్పిగా నాకు దేశం ఎంతో ప్రేమను అందిస్తుంది.  నేను చేసింది చాలా చిన్న విషయం.  నా పనిలో భాగంగానే నేను రాముడి విగ్రహాన్ని తయారు చేశాను.  నేను చేసింది గొప్ప పని ఏం కాదు.  రాముడి మీద భక్తి ప్రపత్తులు, పూర్తి విశ్వాసం పెట్టి పని చేశాను అంతే.  ఇప్పుడున్న ఈ పేరును  రాముడే నాకు అందించాడు. రాముడు మీద ఉన్న ప్రేమే దానిని అంత పెద్దదిగా చేసింది.

రాజేష్ కల్రా : అది మీ నిరాడంబరత, నిజాయితీ… ఎంతోమంది ఈ అవకాశం కోసం ఎదురు చూశారు.  ముందుగా పదిమందిలో ఒకరిగా సెలెక్ట్ కావడం… అందులోనుంచి ముగ్గురుగా షార్ట్ లిస్ట్ అవడం.. ఆ ముగ్గురిలో నుంచి మీ విగ్రహమే ఫైనల్ గా ఎంపిక అవ్వడం మామూలు విషయం కాదు.  మీరు ఒప్పుకోవడం లేదు అది మీ గొప్పతనం. మీరు చేసిన బాలరాముడి విగ్రహం ఎంపిక కావడం..  మీరు చేయబోయే ఫ్యూచర్ ప్రాజెక్టుల ఎంపికలో ఏదైనా ప్రభావం చూపిస్తుందా?

అరుణ్ యోగిరాజ్ : తప్పకుండా.. ఎందుకంటే ఒక కళాకారుడిగా నేను ఇప్పటివరకు చేసిన దానికంటే ఇంకా బెటర్ గా చేయాలనే అనుకుంటాను. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు ఇంకా సెలెక్టివ్ గా పని చేయాల్సి ఉంది.  ఎందుకంటే నేను తీసుకునే ప్రాజెక్టులు దేశ గౌరవాన్ని పెంచేవిగా ఉండాలి. భవిష్యత్తులో ఇదేనా ప్రయారిటీగా ఉండబోతోంది. ఇక రెండో ఆప్షన్ ఏంటంటే నేను చేసే విగ్రహం ప్రజలకు ఎక్కువ దగ్గరగా వెళ్లాలి. వ్యక్తిగతంగా వారు దానితో కనెక్ట్ అవ్వాలి.

రాజేష్ కల్రా : శిల్పకారుడు కాకపోతే మీరు ఏమయి ఉండేవాళ్లు?  ఎప్పుడైనా ఆలోచించారా?

అరుణ్ యోగిరాజ్ :  వ్యవసాయదారుడిని అయ్యేవాడిని.. నాకు ఏదన్నా కొంచెం సమయం దొరికితే ఫార్మింగ్ చేయడానికి ఇష్టపడతాను. 

రాజేష్ కల్రా : మీరు ఇంతకుముందు ఫిజికల్ ఫిట్నెస్ గురించి మాట్లాడారు? అంటే ఎలాంటిది?  శారీరకంగా దృఢంగా ఉండడం కోసమా?  లేకపోతే కాంపిటీటివ్ గా ఉండాలనా?

అరుణ్ యోగిరాజ్ : అలా కాదు.. నేను ప్రొఫెషనల్ వాలీబాల్ ప్లేయర్ని.  2000 సంవత్సరంలో వాలీబాల్ ఆడడం మొదలు పెట్టాను. 

రాజేష్ కల్రా : ప్రొఫెషనల్ అంటే లీగ్స్ లో ఆడడమా?  యూనివర్సిటీ లెవెల్ లో  ఆడడమా?  ఆడేవారా? స్టేట్ లెవెల్ లోనా? ఎలా?

అరుణ్ యోగిరాజ్ : ఆ లేదు నేను జాతీయ వాలీబాల్ జట్టులో ఆడాను. కర్ణాటక నుండి రిప్రజెంట్ చేశాను. 2002.  2003లో  నేషనల్  జూనియర్స్ లో కర్ణాటక నుంచి పాల్గొన్నాను. ఆ తర్వాత నేను మైసూర్ యూనివర్సిటీ కి రిప్రజెంట్ చేశాను.  నేను ఎంతోమంది పిల్లలకు ఫుట్ బాల్ లో శిక్షణ ఇచ్చాను. వాళ్లు ఇండియా కి రిప్రజెంట్ చేసేవారు. నేను శిక్షణ ఇచ్చిన వారు ఇప్పుడు రైల్వే, పోలీస్ డిపార్ట్మెంటులో ప్రభుత్వ ఉద్యోగులుగా అపాయింట్ అయ్యారు కూడా. ఇప్పటికీ నేను మైసూర్ జిల్లా వాలీబాల్ అసోసియేషన్ తో కలిసే ఉన్నాను. అందుకే నేను ఇప్పటికీ ఎట్టి పరిస్థితుల్లోనూ రోజుకు ఒక గంట పాటు  ఫిట్నెస్ కోసం వెచ్చిస్తుంటాను. దానికోసం నేను ఎత్తు ప్రాంతానికి పరిగెడతాను. అలా ఒక ఐదున్నర నిమిషాల్లో కిలోమీటర్ వరకు పరిగెత్తగలను. 

రాజేష్ కల్రా : ఐదున్నర నిమిషాల్లో  అప్ హిల్ లో  కిలోమీటర్  పరిగెత్తడం అంటే చాలా ఫాస్ట్ రన్నింగ్ అన్నట్టే.. కదా?

అరుణ్ యోగిరాజ్ : అవును అందుకే నాకు ఇప్పటికీ మంచి ఫిట్నెస్ ఉంటుంది.

రాజేష్ కల్రా : ఇప్పటివరకు ఎవరు అడగనిది ఏదైనా మీరు చెప్పాలనుకుంటున్నారా? అంటే మీ కుటుంబం మీకు ఇచ్చిన సపోర్టు,  మీ భార్య, పిల్లల  సహకారం??

అరుణ్ యోగిరాజ్ : ఆ కుటుంబంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తాను. 200 ఏళ్లు శిల్పకారులుగా చరిత్ర ఉన్న కుటుంబంలో పుట్టడం నా అదృష్టం. వాళ్లందరి ఆశీర్వాదాలు వల్లే నాకు ఈ అవకాశం వచ్చింది. నేను మా నాన్నకి కృతజ్ఞతలు తెలుపాలనుకుంటున్నాను.  ఆయన నాన్నే కాదు నాకు గురువు.. నాకు అంతా ఆయనే. ఆయన నన్ను ఎప్పుడు శిల్పకారుడుగా మారమని బలవంత పెట్టలేదు. చాలా కష్టమైన సమయాల్లోనూ ఆయన ఎప్పుడు పనిలో నాకు ఈ సహాయం చేయమని అడగలేదు. నేను 2010లో ఎంబీఏ పూర్తి చేశాను. ఆ తర్వాత నేను  శిల్పకారుడుగా వృత్తిని  కంటిన్యూ చేయాలనుకుంటున్నాను అని చెప్పినప్పుడు ఒక్కటే విషయం చెప్పారాయన. నువ్వు ఎంబీఏ పూర్తి చేశావు కాబట్టి చెబుతున్నాను.. ఇది మార్కెటింగ్ కాదు.  తీసుకొచ్చామా,  అమ్మేసామా  అనేది ఆలోచించొద్దు. ఇప్పుడు మనకున్న పేరు కోసం మా నాన్న నేను చాలా కష్టపడ్డాం. . ఇప్పుడు నువ్వు ఎంబీఏ చేసి ఈ వృత్తిలోకి వస్తున్నావు కాబట్టి ఆ పేరుకు..  మచ్చ రాకుండా  మసులుకో.  దీనిని కేవలం బిజినెస్ యాంగిల్ లో చూడొద్దు. నువ్వు ఏది చేయాలనుకుంటున్నావో నువ్వే పూనుకుని పని చేయి.  అని ఒక్క సలహా మాత్రమే ఇచ్చారు.

రాజేష్ కల్రా : మీ విగ్రహం ఎంపికైన తర్వాత మీ నాన్నగారు చెప్పినదంతా మీరు గుర్తు చేసుకున్నారు? మీ మనసులో కలిగిన భావం ఏంటి?

అరుణ్ యోగిరాజ్ : దీనికంటే ముందు నేను మొదట చేసింది ఆదిశంకరాచార్య విగ్రహం. . ఆ విగ్రహం చేస్తున్న సమయంలో ఇంతకంటే గొప్పగా ఇంకా ముందు నేను చేయకపోవచ్చు అనుకున్నాను.  ఆ తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం చేసే అవకాశం వచ్చింది.  ఆ సమయంలో కూడా నేను ఇంతకంటే పెద్దది రాదు నాకు అనుకున్నాను. కానీ బాల రాముడు విగ్రహం చేసే అవకాశం వచ్చింది. ఇవన్నీ అయిన తర్వాత నాకు అనిపించింది ఒక్కటే ఇది మా నాన్న చూస్తే బాగుండు అని. బాల రాముడి విగ్రహం పూర్తయిన తర్వాత.. విగ్రహం ముందు నిలబడి నేను అదే కోరుకున్నాను.  మా నాన్న ఏదో ఒక రూపంలో ఇది చూడగలిగేలా చేయమని వేడుకున్నాను. ఇంకా బెటర్ గా చేయడానికి ఏమైనా చేయాలా అని నేను మా నాన్నగారిని తలుచుకున్నాను. ఎలాగైనా గైడ్ చేయమని కోరుకున్నాను. 

నాన్నతో పాటు అమ్మ, నా భార్య ఎంత సహకరించారు.  నాకు సంవత్సరంన్నర వయసున్న బాబు ఉన్నాడు.  ఈ పనిలో పడి నేను వాడు వేసిన మొదటి అడుగులు చూడలేకపోయాను. ఆ సమయంలో నేను అయోధ్యలో ఉన్నాను. అంతకుముందే నేను నా భార్యకు చెప్పాను ఇంక ముందు నీకు నేను ఎక్కువ సమయం ఇవ్వలేకపోవచ్చు ఎందుకంటే బాలరాముడి విగ్రహాన్ని చేయడానికి పూర్తి సమయాన్ని అక్కడే నేను గడపాల్సి ఉంటుందని చెప్పాను. ఆమె నాకు పూర్తి సహకారం అందించింది. 

ఇప్పుడే కాదు గత పదేళ్లుగా కూడా నేను నా కుటుంబంతో కంటే ఎక్కువగా రాళ్లతోనే గడుపుతాను. అయినా కూడా ఎప్పుడూ తను ఇబ్బంది పెట్టలేదు. నా భార్య పేరు విజేత. నాకు 8 ఏళ్ల వయసున్న కూతురు ఉంది. తన పేరు సాన్వి. . ఒకరోజు ఓ ఘటన జరిగింది. అయోధ్య రాముడు విగ్రహం తయారు చేయడానికి ఏడు నెలలు కుటుంబానికి దూరంగా గడిపిన సమయంలో ఒకరోజు నా కూతురు ఫోన్ చేసింది.  తన స్కూల్లో తాను చేస్తున్న డాన్స్ ప్రోగ్రాం చూడడానికి రావాలని అడిగింది. అది కూడా నెలన్నర రోజుల ముందుగానే  చెప్పి పెడుతోంది. ఆరోజు నాకు చాలా బాధగా అనిపించింది.  నా కూతురు నా దగ్గర అపాయింట్మెంట్ అడుగుతుంది… నాకు అది నచ్చలేదు. నేను ఆమె డాన్స్ ప్రోగ్రామ్కు వెళ్లి చూశాను చాలా సంతోష పడింది. మీరు ఎన్నో త్యాగాలు చేశారు ఇది నేను చేసిన చాలా చిన్నది అని వారితో చెప్పాను. చాలా సంతోషపడ్డారు.

రాజేష్ కల్రా : దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాదిమంది హిందువులు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతోమంది హిందువులు నేరుగా కనెక్ట్ అయ్యేలా విగ్రహాన్ని తయారు చేసిన మీరు  ఇలాంటి ఎన్నో త్యాగాలు చేసి ఉంటారు. చూసిన ప్రతి ఒక్కరూ కనెక్ట్ అయ్యేలా తయారు చేశారు. మరింత చెప్పే మాట ఒకటే ప్రాణ ప్రతిష్ట తర్వాత విగ్రహం మరింత అందంగా తయారైంది?

అరుణ్ యోగిరాజ్ : నేను కూడా అదే ఫీలవుతున్నాను.ఒకసారిగా విగ్రహంలో జీవం వచ్చినట్టుగా భావిస్తున్నాను.

రాజేష్ కల్రా : దేశం కోసం ఇంత అద్భుతమైన విగ్రహాన్ని తయారు చేసినందుకు మీకు కృతజ్ఞతలు.  మీ సమయాన్ని వెచ్చించి మాకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఇచ్చినందుకు కృతజ్ఞతలు.
 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios