New Delhi: గల్వాన్ లోయ ఘ‌ర్ష‌ణ‌లో ప్రాణాలు కోల్పోయిన భార‌త జ‌వాను తండ్రిపై దాడి ఘటనపై బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తో కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ మాట్లాడారు. ఈ క్ర‌మంలోనే దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారని సంబంధిత వర్గాలు తెలిపాయి.  

Defense Minister Rajnath Singh spoke to CM Nitish Kumar: గ‌ల్వాన్ లోయ‌లో ప్రాణాలు కోల్పోయిన అమ‌ర జ‌వాను జై కిశోర్ సింగ్ స్మారకం నిర్మాణం కోసం తండ్రి రాజ్ కపూర్ సింగ్ ఎదుర్కొంటున్న సవాళ్లు, ఆయ‌న‌పై జ‌రిగిన దాడిని గురించి మొద‌ట‌గా ఏషియానెట్ న్యూస్ రిపోర్ట్ చేయ‌గా, దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. ఏషియానెట్ న్యూస్ ఇంపాక్ట్ తో అధికార యంత్రాంగంలో క‌ద‌లిక వ‌చ్చింది. వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవ‌డం మొద‌లుపెట్టారు. 

ఈ క్ర‌మంలోనే తాజాగా ఆర్మీ జ‌వానుకు అండ‌గా ఉండేందుకు కేంద్ర ర‌క్ష‌ణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్.. బీహార్ ముఖ్య‌మంత్రి నితీష్ కుమార్ తో మాట్లాడారు. తీసుకున్న చ‌ర్య‌ల‌ను గురించి అడిగి తెలుసుకున్నారు.ఈ క్ర‌మంలోనే దీనిపై విచారణకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి తగిన చర్యలు తీసుకుంటామని బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ హామీ ఇచ్చారు. బిహార్‌లోని వైశాలి జిల్లా జండాహా బ్లాక్ చక్‌ఫతేహ్ గ్రామాన్ని అంత‌కుముందు ఒక ఆర్మీ టీమ్ సందర్శించి, జ‌వాను కుటుంబాన్ని క‌లిసి అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని భ‌రోసాను క‌ల్పించింది. 

ఆర్మీ వ‌ర్గాల ప్ర‌కారం.. జ‌వాను కుటుంబంపై దాడి గురించి రాజ్ నాథ్ సింగ్.. నితీష్ కుమార్ తో మాట్లాడారు. ఈ ఘటనపై రాజ్ నాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారనీ, ఇందులో ప్రమేయం ఉన్నట్లు తేలిన వారిపై తగిన చర్యలు తీసుకుంటామని బీహార్ ముఖ్యమంత్రి హామీ ఇచ్చినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. అంతకుముందు బీహార్ అసెంబ్లీలో ఈ అంశంపై మరోసారి గందరగోళం చెలరేగడంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రతిపక్షాలు విమ‌ర్శ‌ల‌తో దాడిచేశాయి. జ‌వాను కుటుంబంపై దాడి చేసిన వారిపై క‌ఠిన చ‌ర్య‌లు తీసుకోవాల‌ని డిమాండ్ చేశాయి. కాగా, జై కిశోర్ సింగ్ స్మారక చిహ్నం నిర్మాణం విష‌యంలో త‌లెత్తిన వివాదంలో ఎఫ్ఐఆర్ న‌మోదైంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

కాగా, అమరుడైన సోల్జర్ జై కిశోర్ స్మారకం నిర్మాణం ప్రారంభానికి ముందే భూ వివాదంపై పంచాయితీలో ఓ పరిష్కారం తెచ్చుకున్నారు. రాజ్ కపూర్ సింగ్ భూమి పక్కనే హరినాథ్ రామ్ భూమి ఉన్నది. ఈ వీటి ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిలో జై కిశోర్ స్మారకం నిర్మిస్తున్నారు. తమ భూమిలోకి దారి లేకుండా అవుతున్నదని హరినాథ్ రామ్ అభ్యంతరం పెట్టాడు. గ్రామస్తులంతా పంచాయితీ పెట్టగా.. ఆ భూమిని వదిలిపెడితే సమీపంలోని మరో చోట భూమి కొనుగోలు చేసి అప్పగిస్తామని రాజ్ కపూర్ ప్రతిపాదించగా.. అందుకు హరినాథ్ రామ్ అంగీకరించాడు. ఆ తర్వాత అక్కడ స్మారకం నిర్మాణం ప్రారంభించారు. పూర్తి కావొస్తుండగా హరినాథ్ రామ్ ఆ ఒప్పందాన్ని అతిక్రమించాడు. తనకు రాజ్ కపూర్ సింగ్ కొనుగోలు చేసిన భూమి అక్కర్లేదని, తన భూమి ఎదుట స్మారకం నిర్మించవద్దని యూటర్న్ తీసుకున్నాడు. అంతేకాదు, రాజ్ కపూర్ సింగ్ పై ఎస్సీఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు.