గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ కాంగ్రెస్‌కు ఝలక్ ఇవ్వనుంది. అధికార పార్టీ ఈ సారి సీట్లు మరిన్ని పెంచుకుని అధికారాన్ని చేపట్టే అవకాశాలు ఉండగా.. కాంగ్రెస్ ఓటు షేర్‌ను ఆప్ కొల్లగొట్టనున్నట్టు ఏషియానెట్ న్యూస్ నిర్వహించిన ప్రీపోల్ వెల్లడించింది. 

న్యూఢిల్లీ: గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పార్టీల ప్రచారం జోరందుకుంది. ఇక్కడ ప్రధానంగా బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీల ప్రచారం ఎక్కువగా కనిపిస్తున్నది. రాష్ట్రంలో ఏడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి రికార్డు సృష్టించాలని బీజేపీ భావిస్తుండగా.. పంజాబ్‌లో గెలిచిన ఊపుతో మరో రాష్ట్రంలోనూ పాగా వేయాలని అరవింద్ కేజ్రీవాల్ పార్టీ ఆశపడుతున్నది. కాంగ్రెస్ కూడా ప్రచారం చేస్తున్నది. ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఏషియానెట్ న్యూస్ నెట్‌వర్క్ నిర్వహించిన ప్రీపోల్ సర్వేలో కీలక విషయాలు వెల్లడయ్యాయి.

సాధారణంగా అధికారంలోని పార్టీపై వ్యతిరేకత ప్రతిపక్షాలకు కలిసి వస్తుంది. గుజరాత్‌లో ఆరుసార్లు అధికారంలో ఉండి ఏడోసారి ప్రభుత్వ ఏర్పాటుకు తొణుకు బెణుకు లేకుండా బీజేపీ అడుగులు వేస్తున్నది. అయినప్పటికీ ఈ ఎన్నికల్లోనూ ప్రభుత్వ వ్యతిరేకత ప్రభావం దాదాపు శూన్యంగా ఉండటమే కాదు.. ప్రతిపక్ష పార్టీల ఓటు షేర్ మాత్రమే మారుతుందని సర్వేలో తేలడం ఆసక్తిగా మారింది. ఔను.. గుజరాత్‌లో దూకుడుగా ప్రచారం చేస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ అధికార బీజేపీని కాకుండా ప్రతిపక్షంలోని కాంగ్రెస్‌ను దెబ్బతీస్తుందని తేలింది. కాంగ్రెస్ ఓటర్లు.. ఆప్ వైపు మొగ్గు చూపుతున్నట్టు సర్వే వెల్లడించింది. కాంగ్రెస్‌కు 31 శాతం ఓట్లు వస్తే.. ఆప్‌కు 16 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.

Also Read: గుజరాత్‌లో మళ్లీ బీజేపీదే అధికారం.. కాంగ్రెస్‌కు ఆప్ రూపంలో షాక్.. ఏషియానెట్ న్యూస్ ప్రీ-పోల్ సర్వే..

గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ షేర్ 10 శాతం తగ్గే అవకాశం ఉంది. అయితే బీజేపీకి ఒక శాతం, ఇతరులకు ఐదు శాతం తగ్గవచ్చు. పూర్తి స్థాయిలో గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల బరిలో దిగుతున్న ఆప్‌కు ప్రయోజనం ఉంటుదని.. దాని ఓట్ల శాతం 16 శాతం పెరగవచ్చని ప్రీ-పోల్ సర్వే వెల్లడించింది.

గుజరాత్‌లో మొత్తం అసెంబ్లీ స్థానాలు 182. 2017లో ఇక్కడ బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77 స్థానాలు గెలుచుకున్నాయి. ముగ్గురు స్వతంత్రులు, ఇద్దరు బీటీపీ నేతలు, ఎన్సీపీ ఒక్క సీటు గెలుచుకుంది. కానీ, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్ బోణీ కొట్టడమే కాదు.. కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా మారే అవకాశాలు ఉన్నాయని ఈ సర్వే తెలిపింది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. బీజేపీకి సింహాభాగం (133 నుంచి 143 సీట్లు) సీట్లు దక్కుతాయని, కాంగ్రెస్ మాత్రం దారుణంగా నష్టపోగా.. ఆప్ మంచి ఫలితాలను రాబట్టనున్నట్టు వివరించింది. కాంగ్రెస్ సీట్లు 77 నుంచి పడిపోయి 28 నుంచి 37 మధ్యలో ఉంటాయని, అదే ఆప్ మాత్రం ఎకాఎకిన 5 నుంచి 14 స్థానాలు గెలుచుకుంటుందని సర్వే అంచనా వేసింది.

ఈ సర్వేలో.. గుజరాత్‌లోని మొత్తం 182 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని 1,82,557 మంది ఓటర్ల అభిప్రాయాన్ని క్రమబద్ధమైన నమూనా పద్ధతిని ఉపయోగించి తీసుకోవడం జరిగింది.