ఆస్కార్ గెలిచిన ది ఎలిఫెంట్ విస్పరర్స్‌లోని రెండు ఏనుగులు రఘు, అమ్ముకుట్టిలను పెంచిన దంపతులు బెల్లీ, బొమ్మన్‌లను ఏషియానెట్ టీమ్ చేరుకుని ఇంటర్వ్యూ తీసుకుంది. అడవిలో అనాధగా తిరుగుతున్న పిల్ల ఏనుగు రఘును అటవీ శాఖ అధికారులు తెచ్చి తనకు అప్పగించారని బెల్లీ తెలిపింది. తొలుత తడబడినా.. భర్త సహకరిస్తానని చెప్పడంతో పెంచానని వివరించింది. ఆ తర్వాత అమ్ము కుట్టిని కూడా చేరదీసినట్టు తెలిపింది. 

చెన్నై: ఆస్కార్ అవార్డు గెలుచుకున్న బెస్ట్ డాక్యుమెంటరీ షార్ట్ ‘ది ఎలిఫెంట్ విస్పరర్స్’ తమిళనాడులోని ఓ దంపతుల రియల్ లైఫ్ స్టోరీ ఆధారంగా తీశారు. బొమ్మన్, బెల్లీ దంపతులు రెండు ఏనుగులను కన్న పిల్లల్లా పెంచారు. రఘు, అమ్ము కుట్టీలను వారు పెంచిన తీరు.. ఆ పెంపకంలో ఆ దంపతులకు, ఏనుగులకు మధ్య ఏర్పడిన అనురాగం, ఆప్యాయతలు అపూర్వంగా ఉన్నాయి. ఈ అనుబంధం ఆధారంగానే వారినే పాత్రలుగా కార్తికి గొంజాల్వేజ్ ది ఎలిఫెంట్ విస్పరర్స్ అనే డాక్యుమెంటరీ తీసింది. ప్రకృతికి, జీవులకు మధ్య ఉండే సన్నిహిత సంబంధాన్ని సమ్మిళితం చేసి చూపించిన ఈ డాక్యుమెంటరీ విశ్వ యవనికపై మెరిసింది. ప్రపంచాన్ని మెప్పించి డాక్యుమెంటరీ షార్ట్ విభాగంలో ఆస్కార్ గెలుచుకుంది. ప్రపంచం గుర్తించిన ది ఎలిఫెంట్ విస్పరర్స్ సినిమాకు ఆధారంగా ఉన్న బొమ్మన్, బెల్లీ దంపతులను ఏషియానెట్ టీమ్ అప్రోచ్ అయింది. బెల్లీతో మాట్లాడింది. ఆమె ఆ రెండు ఏనుగుల గురించి చెప్పింది. అవి ఎలా తమ వద్దకు వచ్చాయి? ఎలా పెంచాం అనే వివరాలను వెల్లడించింది.

ముందుగా తమ వద్దకు రఘు అనే ఏనుగు వచ్చిందని బెల్లీ తెలిపింది. ఆ తర్వాత అమ్మును చేరదీశామని వివరించింది. రఘు చాలా బలహీన స్థితిలో ఉన్నదని బెల్లీ తెలిపింది. ముదుమళ ఫారెస్ట్‌లో రఘు అనాధగా అటవీ శాఖ అధికారులకు కనిపించింది. ఒక రోజు అటవీ శాఖ అధికారులు బలహీన స్థితిలో ఉన్న పిల్ల ఏనుగును తెచ్చి తనకు అప్పగించినట్టు వివరించింది. అది చాలా బలహీన స్థితిలో ఉన్నదని, దాన్ని పెంచడం దుస్సాధ్యమనే అనుకున్నట్టు బెల్లీ తెలిపింది. కానీ, అటవీ శాఖ అధికారులు పెంచాలని కోరారని, తన భర్త కూడా అందుకు సహకరిస్తానని చెప్పడంతో రఘును పెంచడానికి అంగీకరించినట్టు బెల్లీ వివరించింది.

రఘుకు వేడి నీటిని అందించేవారిమని తెలిపింది. నెమ్మదిగా రఘు కోలుకోవడం కనిపించిందని, ఆ తర్వాత పెద్ద సమస్యలేమీ లేకుండానే రఘును పెంచామని వివరించింది. ఆ తర్వాత ఒక రోజు అమ్ము కుట్టిని కూడా చేరదీయాల్సి వచ్చింది. అమ్ము కుట్టీకి పాలు ఇచ్చి పెంచామని వివరించింది. రఘును టెంకనీ నుంచి, అమ్ముకుట్టిని సత్యమంగళం నుంచి తీసుకుని వచ్చినట్టు తెలిపింది.

రఘును వెంట పెట్టుకుని తన వద్దకు వచ్చినప్పుడు ఓ రేకుల షెడ్డులో పడుకుని ఉన్నదని బెల్లీ తెలిపింది. అప్పుడు విపరీతమైన వర్షం పడుతుండగా రఘును వెంటపెట్టుకుని వచ్చారని వివరించింది. అప్పుడు తన వద్ద ఏమీ లేదని, ఏమీ లేదనే బెంగ లేదని తెలిపింది. కానీ, ఇప్పుడు తనకు అటవీ శాఖలో ఓ ఉద్యోగం ఇచ్చారని వివరించింది. తనను చూస్తే ఏనుగులు అట్టే అట్టిపెట్టుకుని ఉంటాయని బెల్లీ తెలిపింది.

ఈ ఏనుగులను చూడటానికి కేరళలోని అనేక ప్రాంతాల నుంచి ప్రజలు వస్తారని, కోళికోడ్ నుంచి గురువాయుర్ వరకు అన్ని చోట్ల నుంచి వీటిని చూడటానికి తన వద్దకు వస్తారని బెల్లీ పేర్కొంది. క్యాంపులోకి వచ్చినప్పుడు తాను అక్కడ లేకుంటే.. ఏనుగే వారిని వెంటబెట్టుకుని తన ఇంటికి తెస్తుందని తెలిపింది. వారంతా తనతో కలిసి ఫొటో దిగుతారని వివరించింది. ఎన్నో ఫొటోలు తనతో దిగారని, తన ఇంట్లో ఆ ఫొటోలు ఉండేవని చెప్పింది. కానీ, కొందరు పేద పిల్లలు ఆ ఫొటోలు కావాలని అడిగితే ఇచ్చేశానని వివరించింది. పిల్లలు అడిగితే కాదని చెప్పలేం కదా అని బెల్లీ తెలిపింది.