న్యూఢిల్లీ: కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడి పదవిపై రాహుల్ గాంధీ పట్టు వీడటం లేదు. తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు ససేమిరా అంటున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలతోపాటు అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు రాహుల్ గాంధీయే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలంటూ తీర్మానాలు చేసి పంపినా పట్టించుకోవడం లేదు.  

ఎన్నికల ఫలితాల అనంతరం ఏఐసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన రాహుల్ గాంధీ ఇప్పటి వరకు అదే పంతాలో ఉన్నారు. తాజాగా తాను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని కాదంటూ స్పష్టం చేశారు.  

త్వరలో కాంగ్రెస్ పార్టీ వర్కింగ్  కమిటీ సమావేశం జరగబోతుందని రాహుల్ స్పష్టం చేశారు. సీడబ్ల్యూసీ సమావేశంలో నూతన ఏఐసీసీ అధ్యక్షుడిని ఎన్నుకొంటారని రాహుల్ గాంధీ క్లారిటీ ఇచ్చేశారు. 

 

రాహుల్ గాంధీ ఎట్టి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరిస్తున్న నేపథ్యంలో నూతన అధ్యక్షుడి ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఇటీవల జరిగిన సీడబ్ల్యూసీ సమావేశంలో రాహుల్ గాంధీయే ఏఐసీసీ అధ్యక్షుడిగా ఉండాలంటూ ఒత్తిడి చేసే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ రాహుల్ గాంధీలో ఎలాంటి మార్పు కనబడకపోవడంతో నూతన అధ్యక్షుడి ఎంపికపై కాంగ్రెస్ పార్టీ వేగం పెంచింది. 

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ను నూతన అధ్యక్షుడిగా ఎంపిక చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతగా, సోనియాగాంధీ కుటుంబానికి అత్యంత విధేయుడిగా ఉన్న అశోక్ గెహ్లాట్ కాబోయే ఏఐసీసీ అధ్యక్షుడు అంటూ ప్రచారం జరుగుతోంది. 

ఈ వార్తలకు ఊతమిస్తూ అశోక్ గెహ్లాట్ కు ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది. దీంతో హూటాహుటిన అశోక్ గెహ్లాట్ ఢిల్లీకి బయలు దేరారు. ఇకపోతే అశోక్ గెహ్లాట్ రాజస్థాన్ ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు. ముఖ్యమంత్రి పదవితోపాటు ఏఐసీసీ అధ్యక్షుడిగా అశోక్ గెహ్లాట్ కొనసాగే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. పార్టీ సీనియర్లతో పాటు రాహుల్ కుటుంబసభ్యులు సైతం అశోక్ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. 

మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు అస్లాం షేర్ ఖాన్, వీరప్ప మొయిలీ సైతం అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడిగా కొనసాగేందుకు తమకు అర్హత ఉందంటూ పరోక్షంగా సంకేతాలిచ్చారు నేతలు.