రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి ఆశోక్ గెహ్లాట్‌ పేరును  కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది.


న్యూఢిల్లీ: రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవికి ఆశోక్ గెహ్లాట్‌ పేరును కాంగ్రెస్ పార్టీ అధిష్టానం శుక్రవారం నాడు ప్రకటించింది.ఈ పదవికి సచిన్ పైలెట్‌ పేరును కూడ రాహుల్ గాంధీ పరిశీలించారు. ఈ తరుణంలో సీఎం పదవి చివరకు సీనియర్ నేత ఆశోక్‌ గెహ్లాట్‌ను వరించింది.

రాజస్థాన్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీని మట్టి కరిపించింది. రాజస్థాన్ పీసీసీ చీఫ్ ‌గా ఉన్న సచిన్ పైలెట్ పార్టీని విజయపథంలో నడిపించడంలో కీలకంగా వ్యవహరించారు.

అయితే రాజస్థాన్ ముఖ్యమంత్రిగా సచిన్‌పైలెట్‌కు కట్టబెట్టాలని పార్టీ నాయకత్వం భావించింది. ఈ విషయమై ఆశోక్‌ గెహ్లాట్ పేరును కూడ ఈ పోస్టుకు పరిశీలించారు.
సుమారు 36 గంటలకు పైగా సీఎం పదవి విషయమై కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తీవ్రమైన చర్చలు జరిపింది. ఆశోక్‌ గెహ్లాట్‌ ను సీఎం పదవిని అప్పగిస్తూ సచిన్‌పైలెట్‌ను డిప్యూటీ సీఎం పదవిని ఇవ్వాలని నిర్ణయం తీసుకొన్నారు.

డిప్యూటీ సీఎం పదవిని తీసుకోవడానికి సచిన్ పైలెట్ అంగీకరించారు. దీంతో ఆశోక్ గెహ్లాట్ ను సీఎం పదవికి రూట్ క్లియరైంది. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా గతంలో రెండు దఫాలు గెహ్లాట్ పనిచేశారు.67 ఏళ్ళ ఆశోక్ ను భవిష్యత్ అవసరాల రీత్యా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం రాజస్థాన్ సీఎంగా నియమించింది. 

త్వరలో జరిగే పార్లమెంట్ ఎన్నికల్లో పార్టీని గెలుపు బాటలో నిలిపేందుకుగాను ఆశోక్ గెహ్లాట్ ను సీఎంగా నియమించింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వం. డిప్యూటీ సీఎంగా సచిన్ పైలెట్ కొనసాగనున్నారు.