Asianet News TeluguAsianet News Telugu

ఖురాన్ చదవడాన్ని నిషేధించే చట్టాన్ని ఆమోదించండి..: యూపీలో మదర్సాల సర్వే నిర్ణయంపై అసదుద్దీన్ ఫైర్

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. దీనిపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలను బీజేపీ  వేధించాలని చూస్తోందని మండిపడ్డారు.

Asaduddin Owaisi Slams Yogi Adityanath over survey of Madrassa in UP
Author
First Published Sep 1, 2022, 6:49 PM IST

ఉత్తరప్రదేశ్‌లోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రాష్ట్రంలో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే నిర్వహించాలని నిర్ణయించింది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై వివాదం చెలరేగింది. దీనిని పలు పక్షాలు వ్యతిరేకిస్తున్నారు. తాజాగా ఈ అంశంపై స్పందించిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. యోగి ఆదిత్యనాథ్ సర్కార్‌పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ముస్లింలను బీజేపీ  వేధించాలని చూస్తోందని మండిపడ్డారు. మదర్సాలు ఆర్టికల్ 30 ప్రకారం ఉన్నాయని.. అయితే యూపీ ప్రభుత్వం సర్వేకు ఎందుకు ఆదేశించిందని ప్రశ్నించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 30 ప్రకారం మైనార్టీలకు సొంతంగా సంస్థలను నిర్వహించుకునే హక్కు ఉందని చెప్పారు. ఇది సర్వే కాదని.. చిన్నపాటి ఎన్‌ఆర్‌సీ అని మండిపడ్డారు. ‘‘కొన్ని మదర్సాలు యూపీ మదర్సా బోర్డు పరిధిలో ఉన్నాయి. ఆర్టికల్ 30 ప్రకారం మా హక్కులపై ప్రభుత్వం జోక్యం చేసుకోదు. వారు ముస్లింలను వేధించాలనుకుంటున్నారు’’ అని ఒవైసీ అన్నారు. 

‘‘ఖురాన్ చదవడాన్ని నిషేధించే చట్టాన్ని పాస్ చేయండి. అదే కదా మీ చివరి వ్యుహాం?’’ అని యోగి ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. యోగి సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయం ఏకపక్షమని, ముస్లింలను అనుమానంతో చూసే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు. 

యూపీ సర్కార్ తీసుకున్న ఈ నిర్ణయంపై వివాదం చెలరేగడంతో ఆ రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి డానిష్ ఆజాద్ అన్సారీ స్పందించారు. ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవడాన్ని.. ఏ విధంగా పరీక్షగా పరిగణించరాదని చెప్పారు. విద్యార్థుల సంఖ్య తెలిసేలా ఈ సర్వే చేయాలనుకుంటున్నామని తెలిపారు. అప్పుడే ఎలాంటి డేటా అయినా ప్రభుత్వం ముందు ఉంటుందని.. తద్వారా సులభంగా ప్లాన్‌లను సిద్ధం చేసుకోగలుగుతామని అన్నారు. ఈ విషయంలో ఎస్పీ, బీఎస్పీలు గందరగోళం సృష్టిస్తున్నాయని అన్నారు. 

ఇక, యూపీలో గుర్తింపు లేని మదర్సాలపై సర్వే జరగనుండడం గమనార్హం. ఈ మేరకు యూపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సర్వే కోసం సెప్టెంబర్ 10 నాటికి తహసీల్‌‌లుగా వారిగా సర్వే బృందాలను ఏర్పాటు చేయనున్నారు. సంబంధిత తహసీల్ డిప్యూటీ జిల్లా మెజిస్ట్రేట్, జిల్లా ప్రాథమిక విద్యాశాఖ అధికారి, జిల్లా మైనార్టీ సంక్షేమాధికారితో కూడిన బృందాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ సర్వే బృందాలు అక్టోబరు 5లోగా సర్వే పూర్తి చేసి.. అక్టోబర్ 25 నాటికి ప్రభుత్వానికి డేటా అందుబాటులోకి తీసుకురావాల్సి ఉంటుంది.

ఇక, ఈ సర్వేలో గుర్తింపు లేని మదర్సాలు ఏ సంవత్సరం ఏర్పాటయ్యాయి, భూమి వివరాలు, భవనం పరిస్థితి, విద్యార్థుల సంఖ్య, ఉపాధ్యాయులు, పాఠ్యాంశాలు, ఆదాయ వనరులు.. తదితర వివరాలు సేకరించనున్నట్టుగా ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios