కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇవ్వడంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు.
హుబ్లీ: కాంగ్రెస్ పార్టీపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కర్ణాటక అసెంబ్లీ ఎన్నిలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌పై నిషేధం విధిస్తామని హామీ ఇవ్వడంపై అసదుద్దీన్ ఒవైసీ స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు వాగ్దానాలు చేస్తుందని.. అయితే ఏ ఒక్కటీ నెరవేర్చలేదని అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. బాబ్రీ మసీదు కూల్చివేతను ప్రస్తావిస్తూ.. మసీదు పునర్నిర్మాణానికి కాంగ్రెస్ తీర్మానం చేసిందని, కానీ అక్కడ ఏమీ చేయలేదన్నారు.
‘‘బాబ్రీ మసీదు కూల్చివేయబడినప్పుడు.. వారు అక్కడ మసీదును పునర్నిర్మించాలని తీర్మానం చేసారు. దాంతో ఏమైంది? ఎన్నికల ముందు చాలా విషయాలు చెప్పారు. ఎన్నికల తర్వాత ఏం జరుగుతుందో మీరే చూడొచ్చు..’’ అని కాంగ్రెస్‌పై అసదుద్దీన్ ఒవైసీ విమర్శలు గుప్పించారు.
కర్ణాటకలో ముస్లిం ఓట్లను చీల్చేందుకు బీజేపీ తనను అక్కడకు పంపిందన్న కాంగ్రెస్ వాదనలను అసదుద్దీన్ ఒవైసీ కొట్టిపారేశారు. కాంగ్రెస్ ఆరోపణలు అర్థం లేనివని అన్నారు. తాము కర్ణాటక వ్యాప్తంగా కేవలం 2 స్థానాల్లో మాత్రమే పోటీ చేస్తున్నామని చెప్పారు.
ఇదిలా ఉంటే.. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మంగళవారం మేనిఫెస్టో విడుదల చేసింది. రాష్ట్ర సీనియర్ నేతల సమక్షంలో పార్టీ అధినేత మల్లికార్జున్ ఖర్గే మేనిఫెస్టోను విడుదల చేశారు. గృహ జ్యోతి, గృహ లక్ష్మి, అన్న భాగ్య వంటి వాగ్దానాలు చేసింది. బజరంగ్ దళ్, పీఎఫ్‌ఐ వంటి శత్రుత్వం, ద్వేషాన్ని ప్రోత్సహించే సంస్థలపై నిషేధం విధించడంతోపాటు చట్టం ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపింది. జనాభా ప్రాతిపదికన అన్ని కులాల కోటా పరిమితిని 50 శాతం నుంచి 75 శాతానికి పెంచుతామని హామీ ఇచ్చింది.
సామాజిక-ఆర్థిక కుల గణనను విడుదల చేసి తదనుగుణంగా సామాజిక న్యాయం చేయనున్నట్టుగా హామీ ఇచ్చింది. కర్ణాటకలో ప్రభుత్వ, ప్రైవేటు రంగాల్లో స్థానికులకు 80 శాతం ఉద్యోగాలు కల్పిస్తామని పేర్కొంది. ఒక్కో నియోజకవర్గానికి రూ.10 కోట్ల స్టార్టప్ ఫండ్ ఇస్తామని పార్టీ హామీ ఇచ్చింది. ఇక, మే 10న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు జరగనుండగా, మే 13న ఓట్ల లెక్కింపు జరగనుంది.
