ఢిల్లీ: అయోధ్యలో రామ మందిరం నిర్మాణంపై బీజేపీకి ఎంఐఎం అధినేత హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సవాల్  విసిరారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్ తీసుకురాలేదని సూటిగా ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామమందిరంపై ఆర్డినెన్స్ తీసుకురావాలని సవాల్ విసిరారు. 

అయోధ్యలోని రామజన్మభూమి- బాబ్రీ మసీదు వివాదస్పద ప్రాంతంపై అలహాబాద్‌ హైకోర్టు తీర్పును సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్లను అత్యవసరంగా విచారించేందుకు సుప్రీం కోర్టు నిరాకరించింది. విచారణను వచ్చే ఏడాది జనవరికి వాయిదా వేసింది. 

అత్యున్నత ధర్మాసనం ఆదేశాలను స్వాగతించిన ఒవైసీ బీజేపీ ప్రభుత్వంపై పలు విమర్శలు చేశారు. రామ మందిరం నిర్మాణంపై బీజేపీ ఎందుకు ఆర్డినెన్స్‌ తీసుకురావడం లేదని సూటిగా ప్రశ్నించారు. 

మరోవైపు కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ చేసిన వ్యాఖ్యలకు ఓవైసీ కౌంటర్ ఇచ్చారు. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గిరిరాజ్‌ సింగ్‌ను అటార్నీ జనరల్‌గా నియమించి ఆయన ద్వారా సుప్రీంలో ప్రభుత్వ వాదనలు వినిపించాలని ఎద్దేవా చేశారు. 

ప్రతి సందర్భంలో బీజేపీ, ఆరెస్సెస్‌, వీహెచ్‌పీ నాయకులు రామ మందిరం నిర్మాణం ఆర్డినెన్స్‌ తీసుకొస్తామని ప్రగల్భాలు పలుకుతారని మరి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అధికారంలో ఉన్న బీజేపీ రామ మందిరంపై ఆర్డినెన్స్‌ తీసుకురావాలని సవాలు విసిరారు.

రామ మందిరం నిర్మాణంపై ప్రభుత్వం చట్టాన్ని తీసుకురావాలి లేదా కోర్టు తీర్పును వెలువరించాలి అని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ కోరారు. లేకపోతే హిందూవులు సహనాన్ని కొల్పోయే అవకాశం ఉందని హెచ్చరించారు. దేశంలో ఏదైనా జరిగే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్‌కు రామ మందిర నిర్మాణం ఇష్టం లేదని ఈ వివాదం ఇలాగే కొనసాగాలని కోరుకుంటుందని ఆరోపించారు.