మళ్లీ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు తరగతులను భౌతికంగా నిర్వహించకుండా.. ఆన్‌లైన్‌లో క్లాసెస్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.మళ్లీ స్కూల్‌లో కరోనా కలకలం రేపింది. యూపీలోని ఘజియాబాద్‌లో ఓ స్కూల్‌లో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ స్కూల్ యాజమాన్యం రెండు రోజులపాటు తరగతులను భౌతికంగా నిర్వహించకుండా.. ఆన్‌లైన్‌లో క్లాసెస్ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది.
లక్నో: మళ్లీ కరోనా మహమ్మారి పాఠశాలల్లో కలకలం రేపుతున్నది. ఉత్తరప్రదేశ్‌లని ఘజియాబాద్‌లో ఈ ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఘజియాబాద్‌లోని ఓ పాఠశాలలో ఇటీవలే విద్యార్థులకు కరోనా పాజిటివ్ తేలిన సంగతి తెలిసిందే. తాజాగా, అదే జిల్లాలో మరో పాఠశాలలో ముగ్గురు విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో ఆ పాఠశాల యాజమాన్యం భౌతిక తరగతులను సస్పెండ్ చేసింది. రెండు రోజులపాటు విద్యార్థులకు ఆన్‌లైన్‌లో తరగతులు చెబుతామని సర్క్యూలర్ జారీ చేసింది.
ఘజియాబాద్‌లోని వైశాలిలో కేఆర్ మంగళం వరల్డ్ స్కూల్‌లో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తమ స్కూల్‌లో మూడు పాజిటివ్ కరోనా కేసులు నమోదయ్యాయని ఆ సర్క్యూలర్ తెలిపింది. కాబట్టి, ఏప్రిల్ 11వ తేదీ, 12వ తేదీల్లో ఆఫ్‌లైన్ క్లాసులు బంద్ చేస్తూ నిర్ణయం తీసుకున్నామని వివరించింది. అయితే, బోధన కొనసాగిస్తామని తెలిపింది. ఈ రెండు రోజులు ఆన్‌లైన్‌లో తరగతులు నిర్వహిస్తామని పేర్కొంది. అదే విధంగా తమ ఇంటిలో, చుట్టుపక్కల ప్రాంతాల్లో కరోనా నిబంధనలు అమలయ్యేలా వ్యవహరించాలని పేరెంట్స్‌నూ కోరింది. తమ పాఠశాలలో ప్రతి రోజూ తప్పకుండా కొవిడ్ ప్రొటోకాల్స్ పాటిస్తున్నామని వివరించింది. మొత్తం స్కూల్ క్యాంపస్‌ను ప్రతి రోజు శానిటైజ్ చేస్తున్నామని, బస్సులనూ ప్రతి రోజు శుభ్రపరుస్తున్నామని తెలిపింది.
ఫిబ్రవరి 17వ తేదీన ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం స్కూల్స్ రీఓపెన్ చేయడానికి అనుమతి ఇచ్చింది. నర్సరీ నుంచి 12వ తరగతి వరకు పాఠశాలలు యధావిధిగా నిర్వహించాలని ఆదేశించింది. ఫిబ్రవరి 7వ తేదీన 9వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు భౌతికంగా తరగతులను నిర్వహించడానికి అనుమతి ఇచ్చింది.
ఇదిలా ఉండగా, కరోనా వైరస్ మహమ్మారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్ర మోడీ నిన్న దేశ ప్రజలను కోరారు. కరోనా వైరస్ ఇంకా పూర్తి స్థాయిలో వెళ్లిపోలేదని చెప్పారు. అది తన రూపాలను మారుస్తోందని అన్నారు. తిరిగి పుంజుకుంటోందని తెలిపారు. గుజరాత్‌లోని జునాగఢ్‌లోని ఉమియా మాతా ఆలయ 14వ వ్యవస్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రధాని నరేంద్ర మోడీ వర్చువల్ గా ప్రసంగించారు. భారత్ లో వ్యాక్సినేషన్ డ్రైవ్ వేగాన్ని ఆయన మెచ్చుకున్నారు.
“ కరోనా (మహమ్మారి) ఒక పెద్ద సంక్షోభం. అయితే సంక్షోభం ముగిసిందని మేము చెప్పడం లేదు. ఇది కొంత విరామం తీసుకోవచ్చు, కానీ అది ఎప్పుడు పుంజుకుంటుందో మాకు తెలియదు” అని ప్రధాని మోదీ అన్నారు. “ ఇది ‘బహురూపియ’ (ఎప్పటికీ పరిణామం చెందే) వ్యాధి. దీన్ని అరికట్టేందుకు దాదాపు మనం 185 కోట్ల డోస్‌లు ఉపయోగించడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తోంది. ఇదంతా ప్రజల సహకారం వల్లనే సాధ్యమైంది.” అని అన్నారు.
