న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉల్లిధర కొండెక్కింది. ఉల్లిని ఉత్ప్పత్తి చేసే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరదలు సంభవించడంతో ఉల్లిధర కొండెక్కి కూర్చోంది. ఉల్లిధర ప్రస్తుతం సెంచరీ సైతం కొట్టేసేలా ఉంది. 

ఉల్లిధర కొండెక్కడంతో ఆహార, వినియోగదారుల వ్యవహారాల మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉల్లి కొరతను కృత్రిమంగా సృష్టించేందుకు కొందరు దళారులు ప్రయత్నిస్తున్నారని తనకు సమాచారం వచ్చిందని అలాంటి వారిని ఉపేక్షించేది లేదన్నారు. 

బ్లాక్ మార్కెట్లో అధిక ధరకు విక్రయించేందుకు ఉల్లిని దాచివేస్తే సహించేది లేదని వార్నింగ్ ఇచ్చారు.  ఉల్లిని అత్యధికంగా పండించే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో వరదల ప్రభావంతో ఉల్లి రేట్లు పెరిగిందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. 

ఇప్పటి వరకు 50వేల టన్నుల ఉల్లి ఉందని దాన్ని పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. నాఫెడ్, నేషనల్ కోపరేటివ్ కన్జ్యూమర్స్ ద్వారా ఉల్లిని సరఫరా చేయనున్నట్లు తెలిపారు. ఉల్లి కొరతను తీర్చేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ తెలిపారు. 

గత నెలతో పోలిస్తే ఈనెల 300శాతం ధర పెరిగిపోయిందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ ఆవేదన వ్యక్తం చేశారు. మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల నుంచి ఉల్లి సరఫరా నిలిచిపోవడంతో ఈ పరిణామాలు ఏర్పడ్డాయని చెప్పుకొచ్చారు. దేశరాజధాని న్యూఢిల్లీతోపాటు ఇతర రాష్ట్రాల్లో ఆకస్మాత్తుగా ఉల్లిధర ఆకాశాన్నంటిందని తెలిపారు. కేజీ ఉల్లి ధర రూ.70 నుంచి 80 రూపాయల వరకు పెరిగిపోయిందని చెప్పుకొచ్చారు.  

న్యూఢిల్లీ పరిసర ప్రాంతాల్లోఆపిల్ కంటే ఉల్లిరేటే అత్యధికంగా ఉందని మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. ఉల్లికొరతను దృష్టిలో ఉంచుకుని ఆయా ప్రభుత్వాలు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశాలు జారీ చేశారు.  

మహారాష్ట్రలో వరదల ప్రభావంతో పరిస్థితి దయనీయంగా ఉందని తెలిపారు. రవాణా సౌకర్యం లేదని చెప్పుకొచ్చారు. ప్రభుత్వం వద్ద  50వేల టన్నుల స్టాక్ ఉండగా ఇప్పటికే 15,000 టన్నులు పంపిణీ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం 35వేల టన్నుల ఉల్లి నిల్వలు ఉన్నట్లు మంత్రి రామ్ విలాస్ పాశ్వాన్ స్పష్టం చేశారు. 

దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో రీజనబుల్ ధరకే ఉల్లి లభించేలా ప్రభుత్వాలు చొరవ చూపాలని ఆదేశించారు. ఢిల్లీ ప్రభుత్వం ఇప్పటికే కిలో రూ.24 నుంచి రూ.24 అమ్మేందుకు ముందుకు వచ్చిందని స్పష్టం చేశారు. అలాగే త్రిపుర చీఫ్ మినిస్టర్ కూడా ముందుకు వచ్చినట్లు తెలిపారు. 

కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమార్ సైతం ఉల్లి ధరలపై ప్రత్యేకంగా సమీక్షించారు. రాబోయే రోజుల్లో ఉల్లిధర తగ్గేలా చొరవ చూపుతామని ప్రస్తుతం అంతా సహకరించాలని రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసినట్లు తెలుస్తోంది.