కర్ణాటక నూతన సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. 

బెంగళూరు: కర్ణాటక నూతన సీఎం ఎవరనే దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించగా.. ముఖ్యమంత్రి పదవికి సంబంధించి మాజీ సీఎం సిద్దరామయ్య, కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్‌ల మధ్య పోటీ నెలకొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే సిద్దరామయ్య ఈరోజు ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు అధిష్టానం పెద్దలను కూడా కలవనున్నారు. అయితే ఈ నేపథ్యంలో సీఎం పదవికి సంబంధించి సిద్దరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. సీఎం పదవి వస్తుందనే ఆశాభావంతో ఉన్నానని చెప్పారు. అయితే ఆ విషయంలో అంతిమ నిర్ణయం కాంగ్రెస్ అధిష్టానానిదేనని అన్నారు. 

ఇదిలా ఉంటే.. కర్ణాటకలో ఎవరిని సీఎంగా నియమించాలనే దానిపై కాంగ్రెస్ అధిష్టానం కసరత్తు చేస్తోంది. ఈ కసరత్తులో భాగంగా కర్ణాటక కాంగ్రెస్ శాసనసభా పక్ష సమావేశానికి మహారాష్ట్ర మాజీ సీఎం సుశీల్ కుమార్ షిండే, పార్టీ ప్రధాన కార్యదర్శి జితేంద్ర సింగ్, మాజీ ప్రధాన కార్యదర్శి దీపక్ బబారియా కేంద్ర పరిశీలకులుగా నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంది. కర్ణాటకలోని బెంగళూరులో కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో ఆదివారం అర్దరాత్రి వరకు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కర్ణాటక కాంగ్రెస్ వ్యవహారాలకు బాధ్యునిగా ఉన్న రణదీప్ సింగ్ సుర్జేవాలా కూడా హాజరయ్యారు. 

అయితే ఎమ్మెల్యే నుంచి అభిప్రాయాలు తీసుకున్న పరిశీకుల బృందం ఈరోజు ఢిల్లీకి చేరుకుంది. ఈ బృందం వారి నివేదికను కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు అందజేయనుంది.