ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆపర్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు.
ఢిల్లీ అసెంబ్లీలో గురువారం జరిగిన విశ్వాస పరీక్షలో సీఎం అరవింద్ కేజ్రీవాల్ సారథ్యంలోని ఆపర్ సర్కార్ విజయం సాధించింది. విశ్వాస పరీక్షలో 58 మంది ఎమ్మెల్యేలు కేజ్రీవాల్ సర్కార్‌కు అనుకూలంగా ఓటు వేశారు. ఢిల్లీ అసెంబ్లీలో మొత్తం 70 మంది సభ్యులుండగా.. అందులో ఆప్‌కు 62 మంది ఎమ్మెల్యేలు, బీజేపీకి 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. తన ప్రభుత్వాన్ని కూల్చివేసేందుకు ప్రతిపక్ష బీజేపీ ‘‘ఆపరేషన్ కమలం’’ విఫలమైందని ఆరోపించిన తర్వాత కేజ్రీవాల్ ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఆగస్టు 29న ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
‘‘ఢిల్లీలో ఒక్క ఆప్ ఎమ్మెల్యేలను కూడా కొనుగోలు చేయలేకపోయారు. మాకు 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. అందులో ఇద్దరు విదేశాల్లో ఉన్నారు. ఒకరు జైలులో ఉన్నారు. మరో సభ్యుడు సభకు స్పీకర్” అని విశ్వాస పరీక్ష నెగ్గిన అనంతరం కేజ్రీవాల్ అన్నారు. ఇక, 40 మంది ఆప్ ఎమ్మెల్యేలను బీజేపీ టార్గెట్ చేసిందని.. పార్టీ మారేందుకు ఒక్కొక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేసిందని గతవారం కేజ్రీవాల్ ఆరోపించిన సంగతి తెలిసిందే.
బీజేపీ ‘ఆపరేషన్ కమలం ఢిల్లీ’ కాస్తా ‘ఆపరేషన్ కిచడ్’గా మారిందని ఢిల్లీ ప్రజల ముందు రుజువు చేసేందుకు వీలుగా అసెంబ్లీలో విశ్వాస తీర్మానం తీసుకురావాలనుకుంటున్నాను అని చెప్పారు. ఈ క్రమంలోనే ఆయన విశ్వాస తీర్మానాన్ని ప్రతిపాదించారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కేజ్రీవాల్ మద్దుతుగా నిలిచారు. “సీబీఐ దాడులు చేసినప్పటికీ సిసోడియా ఇంట్లో ఏమీ కనుగొనబడలేదు. లిక్కర్ పాలసీలో అవినీతి చేసి ఉంటే ఆయన ఇంట్లో కోట్లు దొరికి ఉండేవి. యే కన్గల్ ఆద్మీ హై (అతను డబ్బు లేనివాడు)’’ అని కేజ్రీవాల్ అన్నారు.
అయితే బీజేపీ మాత్రం కేజ్రీవాల్ ఆరోపణలను ఖండించింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ నుంచి ప్రజల దృష్టిని మళ్లించడానికి కేజ్రీవాల్ ప్రభుత్వం రాజకీయ డ్రామాకు తెరతీసిందని బీజేపీ ఆరోపించారు.
