Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ భావోద్వేగం.. వేదికపైనే కంటతడి.. వైరల్ అవుతున్న వీడియో..

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Arvind Kejriwal turns emotional remembering Manish Sisodia in an event ksm
Author
First Published Jun 7, 2023, 3:13 PM IST

ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనై కంటతడి పెట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. వివరాలు.. కేజ్రీవాల్ బుధవారం ఔటర్ ఢిల్లీలోని బవానాలోని దరియాపూర్ గ్రామంలో స్కూల్ ఆఫ్ స్పెషలైజ్డ్ ఎక్సలెన్స్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఢిల్లీ మాజీ విద్యా మంత్రి మనీష్ సిసోడియా, విద్యా రంగంలో ఆయన చేసిన కృషిని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్బంగా కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 

ప్రధాని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి కేజ్రీవాల్ మాట్లాడుతూ.. ఢిల్లీలో విద్యా విప్లవం అంతం కావాలని వారు కోరుకుంటున్నట్లుగా విమర్శించారు. కానీ తాము దానిని జరగనివ్వమని అన్నారు. ప్రతి బిడ్డ ఉత్తమ విద్యను అభ్యసించాలనేది మనీష్ సిసోడియా కల అని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం తనపై తప్పుడు కేసులు పెట్టి మనీష్ సిసోడియాను ఇన్ని రోజులు జైల్లో పెట్టిందని అన్నారు. 

మనీష్ సిసోడియా మంచి స్కూల్స్ కట్టకుంటే.. ఈరోజు ఆయనను జైల్లో పెట్టేవారు కాదని అన్నారు. ‘‘ఇది మనీష్ కల. ఆయన దేశ రాజధానిలోని పిల్లలందరికీ మంచి విద్యను అందించాలని కోరుకున్నాడు’’ అని కేజ్రీవాల్ భావోద్వేగానికి లోనయ్యారు. 

 

‘‘ఢిల్లీ ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు అకడమిక్స్‌లో రాణిస్తున్నారు. వారు పోటీ పరీక్షలను కూడా క్లియర్ చేసి వైద్యులు, ఇంజనీర్లు, పోలీసు అధికారులు అవుతున్నారు. ఈ విద్యా పరివర్తన వెనుక ఒక వ్యక్తి ఉన్నాడు.. ఆయనే మనీష్ సిసోడియా’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. 

ఇక, ఢిల్లీ లిక్కర్ స్కామ్ విచారణకు సంబంధించి ఫిబ్రవరి 26న సీబీఐ కేసులో సిసోడియాను అరెస్టు చేశారు. ఆ తర్వాత ఆయన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి పదవికి, మంత్రి పదవికి రాజీనామా చేశారు. ఆరోపించిన ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కుంభకోణంతో ముడిపడి ఉన్న మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ హైకోర్టు అతనికి మధ్యంతర బెయిల్ మంజూరు చేయడానికి నిరాకరించింది. 

Follow Us:
Download App:
  • android
  • ios