బీజేపీ ప్రభుత్వాలను కూల్చేసే సీరియల్ కిల్లర్ అని ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ ఆరోపించారు. ఇప్పుడు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నంలో ఉన్నదని, ఎమ్మెల్యేలను కొనుగోలు చేసే ప్రయత్నాలు ముమ్మరం చేసిందని వివరించారు. కానీ, తమ పార్టీ ఒక్క ఎమ్మెల్యేను కూడా బీజేపీ కొనలేకపోయిందని అన్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ అసెంబ్లీలో విశ్వాస పరీక్ష చేయాలని కేజ్రీవాల్ నిర్ణయించారు.

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్.. బీజేపీ పై విమర్శలు సంధించారు. ప్రభుత్వాలను కూల్చేసే సీరియల్ కిల్లర్ అంటూ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాదు, ఆయన విశ్వాస పరీక్ష నిర్వహించాలని అనుకుంటున్నట్టూ వెల్లడించారు. బీజేపీ ఆపరేషన్ లోటస్ చేపడుతున్నదని, తమ పార్టీ ఎమ్మెల్యేలను లోబరుచుకోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసిందని అన్నారు. ఆ పార్టీ దాని పనిలో విఫలం అయిందని చూపించడానికే ఈ విశ్వాస పరీక్ష అని వివరించారు.

ఢిల్లీ అసెంబ్లీలో సోమవారం ఈ విశ్వాస పరీక్ష జరిగే అవకాశం ఉన్నట్టు కొన్ని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. బీజేపీ తమ ఎమ్మెల్యేలను ఒక్కరినీ లోబరుచుకోలేకపోయిందనే విషయాన్ని తాను వెల్లడించాలని అనుకుంటున్నట్టు అరవింద్ కేజ్రీవాల్ ఈ రోజు తెలిపారు. అందుకోసమే విశ్వాస పరీక్ష నిర్వహించబోతున్నట్టు వివరించారు.

ఢిల్లీ ప్రభుత్వం ప్రత్యేక అసెంబ్లీ సెషన్ నిర్వహిస్తున్నది. ఈ ప్రత్యేక సమావేశాలను ఉద్దేశిస్తూ ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ మాట్లాడారు. ఈ తరుణంలోనే విశ్వాస పరీక్ష గురించి ప్రస్తావన తెచ్చారు. ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చడానికి బీజేపీ... లోటస్ ఆపరేషన్ చేపడుతున్నదని ఆయన ఆరోపించారు. ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలో భాగంగానే తమ పార్టీ నేతలను బీజేపీ లక్ష్యంగా చేసుకుందని కేంద్ర దర్యాప్తు సంస్థలు వేధిస్తున్నాయని పేర్కొన్నారు. ఈ విషయాలపై చర్చించడానికే ఆప్ ప్రభుత్వం ఈ ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించింది.

అరవింద్ కేజ్రీవాల్ ప్రభుత్వంలో నెంబర్ టూ గా ఉన్న డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సీబీఐ, ఈడీలు వెంటాడుతున్నాయని, కానీ, ఆయన దగ్గర నుంచి అక్రమంగా సంపాదించిన ఒక్క చారణ కూడా లేదని వివరించారు. అందుకే ఒక్క చారణ కూడా దొరకలేదని అన్నారు. అందుకే బీజేపీ రూట్ మార్చుకుందని, సిసోడియా పార్టీ మారితే ఆయనపై నమోదైన కేసులు అన్నింటినీ ఎత్తేస్తామని ఆఫర్ ఇచ్చిందని, పార్టీ మారినందుకు రూ. 25 కోట్లు ఆఫర్ చేసినట్టు కేజ్రీవాల్ వెల్లడించారు. తమ నుంచి 40 ఎమ్మెల్యేలను బీజేపీ వెంట పెట్టుకు వెళ్లిపోవాలని ప్రయత్నిస్తున్నదని, ఒక్కరికి రూ. 20 కోట్లు ఆఫర్ చేయడానికి సిద్ధంగా ఉన్నదని వివరించారు.

బీజేపీ ఎన్నో ప్రభుత్వాలను కూల్చేసిందని, ఇప్పుడు ఢిల్లీ వైపు తిరిగిందని కేజ్రీవాల్ ఆరోపించారు. అది ప్రభుత్వాలను కూల్చేసే సీరియల్ కిల్లర్ అని అన్నారు. అన్ని హత్యలనూ ఒకే రీతిలో చేస్తున్నదని తెలిపారు. 

ఇటీవలి కాలంలో బీజేపీ 277 మంది ఎమ్మెల్యేలను కొనుగోలు చేసిందని, ప్రతిపక్షాల ప్రభుత్వాలను కూల్చేసిందని వివరించారు. 277 ఎమ్మెల్యేల కోసం బీజేపీ రూ. 5,500 కోట్లు ఖర్చు పెట్టిందని, బీజేపీ కోసం రూ. 800 కోట్లు పక్కనపెట్టిందని పేర్కొన్నారు.