అంజలి పోస్ట్ మార్టం నివేదికలో సంచలన విషయాలు.. బాధిత కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం..
ఢిల్లీలోని కంఝవాలాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనలో సంచలన విషయం బయటికొచ్చింది. అంజలిపై లైంగిక దాడి జరగలేదని, ఆమె జననాంగాలపై ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం అంజలి అంత్యక్రియలు చేశారు. కాగా, అంజలి కుటుంబానికి ఢీల్లీ సీఎం రూ.10 లక్షల నష్టపరిహారం ప్రకటించారు.

కంఝవాలా యాక్సిడెంట్: ఢిల్లీలోని కంఝవాలాలో జరిగిన ఘటనపై ఢిల్లీ పోలీసులపై పలు ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మరోవైపు ఈ ఘటనపై అధికార ఆమ్ ఆద్మీ పార్టీ ని టార్గెట్ చేస్తూ విపక్షలు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ తరుణం ఈ ఘటనపై ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. కంఝవాలాలో జరిగిన ఈ సిగ్గుమాలిన ఘటనపై సీఎం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. అలాంటి వారిని ఉరితీయాలని అన్నారు. కంజావాలా కేసును చాలా సిగ్గుమాలిన ఘటనగా అభివర్ణించిన సీఎం కేజ్రీవాల్.. మన సమాజం ఏ దిశగా పయనిస్తోందని అన్నారు. కొంతమంది అబ్బాయిలు అమ్మాయిని చాలా కిలోమీటర్లు లాగడం చాలా బాధాకరమనీ, నిందితులు ఎంతటి ప్రభావశీలులైనా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు.
బాధితురాలు అంజలీ సింగ్ కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారాన్ని మంగళవారం ప్రకటించారు. ముఖ్యమంత్రి బాధితురాలి తల్లితో కూడా మాట్లాడారు. చనిపోయిన కుమార్తెకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. బాధితురాలి తల్లితో మాట్లాడి.. కూతురికి న్యాయం చేస్తా.. పెద్ద లాయర్‌ను రంగంలోకి దింపుతా.. ఆమె తల్లి అనారోగ్యంతో బాధపడుతూ.. ఆమెకు పూర్తి స్థాయిలో వైద్యం చేయిస్తా.. బాధితురాలి కుటుంబానికి రూ. 10 లక్షల నష్టపరిహారం.. ప్రభుత్వం బాధితురాలి పక్షాన ఉంది. కుటుంబం.. భవిష్యత్తులో కూడా ఏదైనా అవసరం ఉంటే వాటిని తీరుస్తాం’’ అని కేజ్రీవాల్ ట్వీట్ చేశారు.
అదే సమయంలో.. ఈ సంఘటనపై ప్రజల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతోంది. ప్రజలు సుల్తాన్‌పురి పోలీస్ స్టేషన్ వెలుపల రహదారిని దిగ్బంధించారు.నిందితులను ఉరితీయాలని డిమాండ్ చేస్తూ.. పోలీసుల ఎదుట గుమిగూడారు. ఈ ఘటనకు సంబంధించి కారులో ముందుగా, కారులో కూర్చున్న ఐదుగురిని అరెస్టు చేసినట్లు ఔటర్ ఢిల్లీ డీసీపీ హరేంద్ర సింగ్ తెలిపారు. వారిపై ఐపీసీ సెక్షన్ 304 కింద కేసు నమోదు చేశారు. వారిని కోర్టులో హాజరుపరిచి, పోలీసు రిమాండ్‌కు తరలిస్తామని తెలిపారు.
పోస్టుమార్టం నివేదిక
మౌలానా ఆజాద్ మెడికల్ కాలేజీ మెడికల్ బోర్డు అంజలికి పోస్ట్ మార్టం నిర్వహించింది. మంగళవారం పోస్టుమార్టం నివేదిక రాగా.. బాధితురాలి ప్రైవేట్ భాగంలో ఎలాంటి గాయాలు లేవని పోస్టుమార్టం నిర్వహించిన వైద్యులు తమ నివేదికలో పేర్కొన్నారు. అత్యాచారం జరగలేదని, ఈడ్చుకెళ్లడం వల్లే మరణం సంభవించిందని వెల్లడైంది. గాయాల తర్వాత షాక్ , రక్తస్రావం మరణానికి కారణమని చెప్పారు. ఈడ్చుకెళ్లడం వల్ల అంజలి తల, వెన్నుపాముపై తీవ్ర గాయాలైనట్టు వైద్యులు గుర్తించారు. అదేవిధంగా ఎడమ కాలు ఎముక, రెండు మోకాళ్లు విరిగిపోయాయి. కారు ప్రమాదానికి గురై ఆ తర్వాత ఈడ్చుకెళ్లడం వల్లే అంజలికి ఈ గాయాలు అయ్యాయని పోస్టుమార్టం నివేదికలో వెల్లడైంది. పోస్టుమార్టం అనంతరం కుటుంబసభ్యులు మంగళవారం సాయంత్రం అంజలి అంత్యక్రియలు చేశారు.
సంచలన విషయాలు
ఈ రోడ్డు ప్రమాద ఘటనలో సంచలన విషయం బయటికొచ్చింది. స్కూటర్‌పై వెళుతున్న అంజలి(20)ని కారు ఢీకొట్టే సమయంలో ఆమె వెంట మరో యువతి కూడా ఉన్నట్టు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా పోలీసులు గుర్తించారు. అంజలిని 10 కిమీల మేర కారు ఈడ్చుకెళ్లడంతో వల్లే ఆమె ప్రాణాలు కోల్పోగా.. మరో యువతి స్వల్ప గాయాలతో బయటపడింది. ఈ ప్రమాదంలో భయాందోళనకు గురై.. ఇంటికి వెళ్లి పోయింది. ఆ యువతిని కనిపెట్టిన పోలీసులు ఆమె నుంచి అనేక కీలక వివరాలు సేకరించారు. ఈ దారుణానికి ఆమెనే ప్రత్యక్ష సాక్షి కావడంతో ఆమె వాంగ్మూలం కీలకంగా మారింది. ఆ ప్రత్యక్ష సాక్షి పేరు నిధి. అంజలి తన బాయ్‌ఫ్రెండ్‌ని కలువడానికి తనను వెంట.. తీసుకెళ్లిందట. అయితే.. అంతకు ముందు ఓ ప్రమాదం నుంచి తప్పడం వల్ల డైవింగ్ విషయంలో ఇరువురు మధ్య వాగ్వాదం జరిగినట్టు తెలిపింది. ప్రమాద సమయంలో అంజలి డ్రైవ్ చేస్తున్నట్టు తెలిపింది.