ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిన తర్వాత మంగళవారం ఆప్ కార్యాలయంలో సంబరాల వాతావరణం నెలకొంది. ఈ సందర్భంగా సీఎం అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ.. జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలని సూచించారు.
ఆమ్ ఆద్మీ పార్టీ (AAP)కి జాతీయ పార్టీ హోదా లభించడంతో పార్టీ కార్యాలయంలో సంబరాలు అంబరాన్ని అంటాయి. ఈ సందర్భంగా పార్టీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. దాదాపు 10న్నరేళ్ల క్రితం పార్టీ ఏర్పడిందని, దేశంలో 1300 పార్టీలు ఉన్నాయని, 6 పార్టీలు జాతీయ పార్టీలు, ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాల్లో ప్రభుత్వాలు ఉన్న మూడు పార్టీలు ఉన్నాయని, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందన్నారు. తమ పార్టీ ఇంత త్వరగా జాతీయ పార్టీ అవుతుందని ఎప్పుడూ అనుకోలేదని అన్నారు.
ప్రజలు మాతోనే ఉన్నారు - సీఎం కేజ్రీవాల్
ఈ సందర్భంగా ఆప్ సీనియర్ నేతలు మనీష్ సిసోడియా, సత్యేందర్ జైన్‌లను స్మరించుకుంటున్నామని ఆయన అన్నారు. ఈరోజు ఈ ఆనంద సమయంలో వాళ్ళు కూడా పాల్గొంటే.. ఇంకెంత ఆనందం ఉండేదనీ, నేడు అన్ని పార్టీలు మా పార్టీ వెనుకే ఉన్నాయని అన్నారు. పేదల పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలని కలలు కనడం మనీష్ సిసోడియా చేసినా తప్పా? అసలు సత్యేందర్ జైన్ చేసిన తప్పు ఏమిటీ? అని కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశంలోని అన్ని పార్టీలు మన వెంటే ఉన్నారనీ,ప్రజానీకం కూడా తమ వెంటే ఉన్నారని తెలిపారు.
"జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండండి"
కఠోరమైన నిజాయతీ, దృఢమైన దేశభక్తి, దృఢమైన మానవత్వం ఆప్‌కి మూడు మూలస్థంభాలని, ఎన్నికల్లో డబ్బు లేకుండా పోరాడి గెలుస్తామని తొలిసారిగా నిరూపించామని, పదేళ్లలో పార్టీ జాతీయ పార్టీ అవుతుందని సీఎం కేజ్రీవాల్ అన్నారు. ఇది ఒక అద్భుతం, మనం ఏదైనా చేయాలని దేవుడు కోరుకుంటున్నాడు, మనం దేశాన్ని నంబర్ వన్‌గా మార్చవచ్చని అన్నారు. ఈ రోజు దేశంలో విద్య గురించి చర్చ జరుగుతోంది, ఆరోగ్యం గురించి చర్చ జరుగుతోంది. ఈ క్రమంలో ఆమ్ ఆద్మీ పార్టీ.కార్యకర్తలు జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉండాలి. మిమ్మల్ని జైల్లో పెడతారు, ఎనిమిది నుంచి 10 నెలలు జైల్లో ఉండొచ్చు, భయపడితే మా పార్టీ నుంచి వెళ్లిపోండి, పదవి, డబ్బు కావాలంటే మా పార్టీని వీడండి ." ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
అంతకుముందు సోమవారం నాడు ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా మాట్లాడుతూ.. కేవలం 10 సంవత్సరాలలో.. అరవింద్ కేజ్రీవాల్ పార్టీ జాతీయ పార్టీగా అవతరించిందనీ, పెద్ద పెద్ద పార్టీలకే ఈ ఘనత సాధించడానికి దశాబ్దాలు పట్టిందని అన్నారు. ఈ పార్టీ కోసం కార్యకర్తలు రక్తం, చెమట చిందించారనీ, లాఠీలు, బాష్పవాయువు, వాటర్ ఫిరంగులను ఎదుర్కొన్న ప్రతి ఆమ్ ఆద్మీ పార్టీ కార్యకర్తకు సెల్యూట్ అని అన్నారు. కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు.
ఆప్ "బలగం"
ఢిల్లీలో ఆ పార్టీకి 62 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఆప్‌కి పంజాబ్‌లో 92 మంది, గుజరాత్‌లో ఐదుగురు, గోవాలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇది మాత్రమే కాదు, రాజ్యసభలో 10 మంది సభ్యులు కూడా ఉన్నారు. కానీ, లోక్‌సభలో ఆ పార్టీకి ఒక్క ఎంపీ కూడా లేదు.
