ఓ ఆటో డ్రైవర్ ఇంటిలో డిన్నర్ కోసం ఆటోలో బయల్దేరిన ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌ను గుజరాత్ పోలీసులు భద్రతా కారణాలను చెబుతూ అడ్డుకున్నారు. దీంతో ఆయన గుజరాత్ పోలీసుల సెక్యూరిటీ అవసరం లేదని వదులుకున్నారు. అనంతరం ఆటో డ్రైవర్ ఇంటికి వెళ్లి డిన్నర్ చేశారు.
గాంధీనగర్: ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తనకు సెక్యూరిటీ అవసరం లేదని గుజరాత్ పోలీసులకు తెలిపారు. ఇలా ప్రజల్లోకి వెళ్లకుండా అడ్డుకునే మీ సెక్యూరిటీ అవసరం లేదని చెప్పారు. ఆయన ఓ ఆటోలో డ్రైవర్ ఇంటికి భోజనానికి వెళ్లుతుండగా అడ్డుకున్న గుజరాత్ పోలీసులతో ఈ మాటలు అన్నారు.
ఈ రోజు గుజరాత్‌లో పర్యటించారు. ఆయన ఈ రోజు కొందరు ఆటో డ్రైవర్లతో కలిసి మాట్లాడారు. వారిలో ఒకరు లేసి తాను కేజ్రీవాల్‌కు పెద్ద ఫ్యాన్ అని చెప్పారు. ఆన్‌లైన్‌లో తాను ఓ వీడియో చూశానని, అందులో పంజాబ్‌కు చెందిన ఓ ఆటో డ్రైవర్ డిన్నర్ కోసం ఇంటికి ఆహ్వానించగా వెళ్లినట్టు చూశానని గుర్తు చేశాడు. అదే విధంగా తన ఇంటికి కూడా భోజనం చేయడానికి వస్తారా? అని అడిగారు. ఈ ప్రశ్నతో ఇతర డ్రైవర్లు జోష్‌గా వస్తారు.. వస్తారు.. అంటూ కేకలు వేశారు. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ కూడా అందుకు సరేనని అంగీకరించారు. అయితే.. తన హోటల్ నుంచి ఆటోలోనే పికప్ చేసుకోవడానికి వస్తావా? అని ఆ ఆటో డ్రైవర్‌ను అడిగాడు. అందుకు సరేనని డ్రైవర్ బదులిచ్చాడు.
ఆటో డ్రైవర్ ఇంట డిన్నర్ కోసం అరవింద్ కేజ్రీవాల్ ఆయన ఆటోలో బయల్దేరారు. కానీ, గుజరాత్ పోలీసులు ఆయనను భద్రతా కారణాల రీత్యా మార్గంమధ్యలోనే ఆపారు.
దీంతో వారిపై అరవింద్ కేజ్రీవాల్ సీరియస్ అయ్యారు. ఇందుకోసమే గుజరాత్ ప్రజలు అసంతృప్తితో ఉన్నారని అన్నారు. ప్రోటోకాల్ అని చెబుతూ ప్రజల దగ్గరకు తనను వెళ్లకుండా ఆపుతున్నారని పేర్కొన్నారు. గుజరాత్ నేతలు ప్రజల దగ్గరకు వెళ్లరని ఆరోపణలు చేశారు. ఈ ప్రోటోకాల్‌ను బద్దలు చేసి ప్రజల వద్దకు వెళ్లాలని మీ నేతలకు చెప్పండని అన్నారు.
అదే విధంగా ఆయన గుజరాత్ పోలీసుల సెక్యూరిటీనే అవసరం లేదని పేర్కొన్నారు. ‘మీ సెక్యూరిటీ నాకు అవసరం లేదు. మీ సెక్యూరిటీని మీరు తీసేసుకోవచ్చు. మమ్మల్ని ఎందుకు బలవంతపెడుతున్నారు? మమ్మల్ని నిర్బంధంలో ఉంచుతున్నారు’ అని కేజ్రీవాల్ ఆ పోలీసు అధికారితో అన్నారు. కేజ్రీవాల్‌కు సెక్యూరిటీ కావాలని అధికారికంగా తమను కోరారని, అందుకోసమే ఈ సెక్యూరిటీ ఇస్తున్నామని సదర పోలీసు అధికారి తెలిపారు.
‘మీరు నన్ను అరెస్టు చేస్తున్నారు’ అంటూ సీఎం కేజ్రీవాల్ అన్నారు. చివరకు అరవింద్ కేజ్రీవాల్ తనకు తన సొంత సెక్యూరిటీనే బాధ్యత అని పేర్కొంటూ ఆయన సైన్ చేసిన తర్వాత ఆ ఆటోరిక్షాను గుజరాత్ పోలీసులు ముందుకు పోనిచ్చారు. చివరకు కేజ్రీవాల్ ఆ ఆటోడ్రైవర్ ఇంటిలో డిన్నర్ చేశారు. తనకు ఆతిథ్యం ఇచ్చినందుకు ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపారు. ఆటో డ్రైవర్ భార్య ఢిల్లీకి చెందిన వ్యక్తి అని పేర్కొంటూ వారిన ఢిల్లీకి ఆహ్వానించారు.
