New Delhi: ఢిల్లీలో సేవల నియంత్రణపై కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ రానున్న విపక్షాల సమావేశంలో చర్చకు రానుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బుధవారం సీపీఐ నేత డీ.రాజాను కలిసిన అనంతరం తెలిపారు. ఆర్డినెన్స్ అంశంపై భారత కమ్యూనిస్ట్ పార్టీ (సీపీఐ) నాయకుడు ఆమ్ ఆద్మీ పార్టీకి మద్దతు ప్రకటించారు. "ఇది కేవలం ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించినది మాత్రమే కాదు, ఇది ఇతర రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా జరగవచ్చు" అని అన్నారు.
Kejriwal Meets CPI’s D Raja: ఆప్ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సర్కారుపై తీవ్ర విమర్శలతో విరుచుకుపడ్డారు. తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీ అరెస్టుతో 2024 లోక్ సభ ఎన్నికల్లో కొన్ని స్థానాలు గెలుచుకోవచ్చని భావిస్తే బీజేపీ మూర్ఖుల స్వర్గంలో జీవిస్తోందంటూ కేజ్రీవాల్ అన్నారు. ఢిల్లీకి కేంద్రం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను నిరసిస్తూ సీపీఐతో కలిసి సంయుక్త విలేకరుల సమావేశంలో కేజ్రీవాల్ మాట్లాడుతూ అవినీతిపరులంతా బీజేపీలో ఆశ్రయం పొందుతున్నారనీ, ప్రతిపక్ష నేతల కోసం ఈడీ, సీబీఐలను పంపుతున్నారని అన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ) కింద తమిళనాడు మంత్రి సెంథిల్ బాలాజీని బుధవారం తెల్లవారుజామున అరెస్టు చేశారు. పార్లమెంటులో ఢిల్లీ ఆర్డినెన్స్ కు వ్యతిరేకంగా కేజ్రీవాల్ మద్దతు కూడగడుతుండగా, "తన మంత్రులను అరెస్టు చేయడం ద్వారా, భయాన్ని వ్యాప్తి చేయడం ద్వారా, రాష్ట్రంలో పార్టీ కొన్ని సీట్లు గెలుచుకుంటుందని బిజెపి భావిస్తే, వారు తప్పు చేస్తున్నట్టే.. యావత్ దేశం మొత్తం దీనిని చూస్తోందని" అన్నారు.
ప్రతిపక్ష నాయకులను రాజకీయంగా టార్గెట్ చేస్తూ... సీబీఐ, ఈడీలను పంపుతున్నారనీ, అవి ఇకపై దర్యాప్తు సంస్థలు కావు.. ఈడీ, సీబీఐలను బీజేపీ సేన అని పిలవాలి అంటూ విమర్శించారు. మంత్రి అరెస్టు అనంతరం డీఎంకేకు మద్దతు తెలిపిన కేజ్రీవాల్ విలేకరుల సమావేశంలో సెంథిల్ ను అరెస్టు చేసిన తీరును ఖండిస్తూ.. 'అరెస్టు చేసిన తీరు అభ్యంతరకరంగా ఉంది. అవినీతిపరులపై ఈడీ, సీబీఐలను పంపడం లేదని దేశం మొత్తం చూస్తోందన్నారు. అందుకు భిన్నంగా ఎక్కడ చూసినా అవినీతిపరులు బీజేపీలో ఆశ్రయం పొందుతున్నారు. ప్రతిపక్ష నేతల వెంట ఈడీ, సీబీలు ఉంటే వారికి రక్షణ కల్పిస్తున్నారు. తమిళనాడులో వారికి ఒక్క సీటు కూడా దక్కదు. స్టాలిన్ ప్రభుత్వానికి తాము మద్దతిస్తున్నామని" చెప్పారు.
సెంథిల్ బాలాజీ అరెస్టు దారుణమని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ.రాజా అన్నారు. కొద్ది రోజుల క్రితం అమిత్ షా తమిళనాడులో పర్యటించారు. ఆయన తిరిగి రాగానే ఈడీ దూకుడు పెంచింది. అది ప్రభుత్వ సచివాలయానికి వెళ్లింది. ఇది చాలా అభ్యంతరకరం. సెక్రటేరియట్ లోపలికి ఎలా వెళ్లారు? ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతున్నాయని డీ.రాజా అన్నారు. కాగా, ఈ నెల 23న పాట్నాలో జరగనున్న విపక్షాల మెగా సమావేశానికి ముందు సెంథిల్ బాలాజీ అరెస్టుతో బీజేపీ వర్సెస్ విపక్షాల మధ్య తీవ్ర దుమారం రేగింది. ప్రతిపక్షాలన్నీ ఈ చర్యను ఖండించగా, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై సెంథిల్ అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ పాత వీడియోను పంచుకున్నారు.
