డిల్లీ లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్ కు బెయిల్...
డిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో అరెస్టయి గత రెండుమూడు నెలలుగా జైల్లో వుంటున్న అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది.
Kejriwal gets bail: డిల్లీ లిక్కర్ స్కాం కేసులో అరెస్టయిన ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు బెయిల్ లభించింది. డిల్లీలోని రౌస్ అవెన్యు కోర్టు కేజ్రీవాల్ కు బెయిల్ మంజూరుచేసింది. లక్ష రూపాయల పూచీకత్తులో ఆయనకు బెయిల్ ఇచ్చింది. దీంతో అరవింద్ కేజ్రీవాల్ విడుదల కానున్నారు.
లోక్ సభ ఎన్నికలకు ముందు రాష్ట్రంలో జరిగిన లిక్కర్ స్కాంతో సంబంధాలున్నాయంటూ డిల్లీ సీఎం కేజ్రీవాల్ ను ఈడి అరెస్ట్ చేసింది. అయితే డిల్లీలో లోక్ సభ ఎన్నికల పోలింగ్ కు ముందు సుప్రీంకోర్టు ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఇలా మద్యంతర బెయిల్ పై బయటకు వచ్చిన కేజ్రీవాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. డిల్లీలో పోలింగ్ ముగిసిన తర్వాతిరోజే అంటే జూన్ 2న ఆయన తిరిగి జైలుకు వెళ్లారు.
లిక్కర్ స్కాంలో మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు ఆరోపిస్తూ డిల్లీ సీఎంను ఈ ఏడాది మార్చి 21న ఈడీ అరెస్ట్ చేసింది. ఆయన దర్యాప్తుకు సహకరించడంలేదంటూ అదుపులోకి తీసుకుని తీహార్ జైల్లో వుంచారు. ఇలా గత రెండు నెలలుగా జైల్లో వుంటున్నకేజ్రీవాల్ కు తాజాగా బెయిల్ లభించింది. కేజ్రీవాల్ విడుదల కానుండటంపై డిల్లీ మంత్రులు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు, నేతలు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.