దేశంలో మూడోసారి ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీయే అధికారం దక్కించుకోబోతోందని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు తేల్చి చెప్పిన వేళ... భారతీయ జనతా పార్టీ ఈశాన్యంలో విజయాన్ని అందుకుంది. అరుణాచల్ ప్రదేశ్ లో ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. గత రికార్డును బ్రేక్ చేస్తూ హ్యాట్రిక్ కొట్టింది. కాగా, సీఎం పెమా ఖండూ నాయకత్వంలోని అరుణాచల్ కమల దళాన్ని ప్రధాని మోదీ ప్రశంసల్లో ముంచెత్తారు... 

ఈశాన్యంలో భారతీయ జనతా పార్టీ హ్యాట్రిక్‌ కొట్టింది. అరుణాచల్‌ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నిల్లో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. అరుణాచల్ లో మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ రాష్ట్ర బీజేపీ నాయకత్వం సిద్ధమైంది. అరుణాచల్‌ ప్రదేశ్‌లోని 60 అసెంబ్లీ స్థానాలున్నాయి. వాటిలో 46 అసెంబ్లీ నియోజకవర్గాలను ముఖ్యమంత్రి పేమా ఖండూ నేతృత్వంలోని బీజేపీ కైవసం చేసుకుంది.

కాగా, పది స్థానాల్లో ముందుగానే కమలం పార్టీ ఏకగ్రీవం చేసుకోగా... 50 నియోజకవర్గాల్లో పోలింగ్‌ జరిగింది. 50 స్థానాలకు గాను బీజేపీ 36, నేషనల్‌ పీపుల్స్‌ పార్టీ (ఎన్‌పీపీ) 5, నేషనల్‌ కాంగ్రెస్‌ పార్టీ (ఎన్‌సీపీ) 3, పీపుల్స్‌ పార్టీ ఆఫ్ అరుణాచల్‌ (పీపీఏ) 2 స్థానాల్లో గెలవగా... కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి ఒకచోట, స్వతంత్ర అభ్యర్థులు 3 స్థానాల్లో విజయం సాధించారు. కాగా, గత (2019) ఎన్నికల్లో 41 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ.. ఈసారి ఆ రికార్డును బ్రేక్‌ చేసింది.

మోదీ అభినందనలు

అరుణాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడంపై ప్రధాాన మంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. మూడోసారి ఆ రాష్ట్ర ప్రజలు బీజేపీకి అధికారం అప్పగించడాన్ని స్వాగతించారు. ఈ విజయం కోసం అసాధారణ కృషిని కనబరిచిన అరుణాచల్‌ ప్రదేశ్‌ బీజేపీ నాయకత్వం, కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. 

Scroll to load tweet…