నరేంద్రమోడీ సారథ్యంలో ఎన్డీఏ కూటమి మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుండటంతో రెండో సారి మోడీ మంత్రివర్గంలో ఎవరికి స్థానం లభించబోతోందోనని రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ నడుస్తోంది.

ఈ నేపథ్యంలో బీజేపీ సీనియర్ నేత, మాజీ ఆర్ధిక మంత్రి అరుణ్ జైట్లీ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. తాను మరోసారి కేంద్రమంత్రి వర్గంలో భాగం కాలేనని, తనకు కేబినేట్‌లో చోటు కల్పించవద్దని కోరుతూ.. మోడీకి లేఖ రాశారు.

‘‘ ఐదేళ్ల పాటు మోడీ సారథ్యంలో పని చేసినందుకు సంతోషంగా ఉంది.. ఎన్డీయే ప్రభుత్వంలో నాకు కొన్ని బాధ్యతలు అప్పగించారు. అయితే గత 18 నెలలుగా ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నానని.. తగినంత విశ్రాంతి అవసరమని వైద్యులు సూచించారు.

అందువల్ల భవిష్యత్తులో తాను కొన్ని బాధ్యతలకు దూరంగా ఉండాలనుకుంటున్నా... నా ఆరోగ్యానికి, చికిత్సకు తగినంత సమయం కావాలి.. కాబట్టి ఎలాంటి మంత్రి పదవి చేపట్టలేను.

ఇది నాకు నేనుగా తీసుకుంటున్న నిర్ణయం.. అనధికారికంగా పార్టీకి, ప్రభుత్వానికి సేవలందిస్తానని తెలిపారు. కాగా క్యాన్సర్‌తో బాధపడుతున్న జైట్లీ గత జనవరిలో న్యూయార్క్‌లో చికిత్స తీసుకున్నారు.

దీంతో పియూష్ గోయల్ ఆర్ధిక మంత్రిగా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. మరోవైపు బయటకు వెల్లడించని అస్వస్థతతో గతవారం జైట్లీ ఎయిమ్స్‌లో చేరారు. మరింత మెరుగైన చికిత్స కోసం ఆయన బ్రిటన్ లేదా అమెరికా వెళ్లాల్సి వుంటుందని మీడియాలో కథనాలు వినిపిస్తున్నాయి.

అయితే గురువారం నరేంద్రమోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో కీలకమైన ఆర్ధిక మంత్రిగా ఎవరిని ఎంపిక చేస్తారనేది ఉత్కంఠగా మారింది. హోం, ఆర్ధిక, రక్షణ, విదేశీ వ్యవహారాల శాఖ మంత్రులు రేపు ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది.