న్యూఢిల్లీ: కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ అగ్రనేత అరుణ్‌ జైట్లీ ఆరోగ్య పరిస్థితి మరింత క్షీణించింది. ఆదివారం తెల్లవారు జామున ఆయన ఆరోగ్యం విషమించడంతో వైద్యులు లైఫ్ సపోర్ట్‌ మీద ఉంచి వైద్యం అందిస్తున్నారు. నలుగురు వైద్యుల బృందం జైట్లీకీ చికిత్స అందిస్తున్నారు.

జైట్లీ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని తెలుసుకున్న ఆర్ఎస్ఎస్ ఛీప్‌ మోహన్‌ భగవత్‌ ఎయిమ్స్‌కు వెళ్లారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితి గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మరోవైపు బిహార్‌ సీఎం నితీశ్‌ కుమార్‌, కేంద్ర మంత్రులు పీయూష్‌ గోయల్‌, హర్షవర్థన్, జమ్ముకశ్మీర్‌ గవర్నర్‌ సత్యపాల్‌ మాలిక్‌, బీజేపీ నేత సతీష్ ఉపాధ్యాయ్ లు పరామర్శించారు. 

అటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన కీలక నేతలు అభిషేక్‌ మను సింఘ్వి, జ్యోతిరాదిత్య సింధియా, ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌ బీరేంద్ర సింగ్‌ లు శనివారం సాయంత్రం జైట్లీని పరామర్శించారు. జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు.  

ఇదిలా ఉంటే జైట్లీ ఆరోగ్య పరిస్థితిపై బీజేపీ నేతలు, ఆయన అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 10 నుంచి ఇప్పటి వరకు జైట్లీ ఆరోగ్యానికి సంబంధించి హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేయకపోవడంపై ఎయిమ్స్ యాజమాన్యంపై మండిపడుతున్నారు.  

ఇకపోతే ఈనెల 9న జైట్లీ అస్వస్థతకు గురికావడంతో ఎయిమ్స్‌కు తరలించారు కుటుంబ సభ్యులు. గుండె, కిడ్నీ వ్యాధినిపుణులు ఆయనకు వైద్యం అందిస్తున్నారు. శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా మారడంతో వైద్యం అందిస్తున్నారు. 

మోదీ ప్రభుత్వంలో కీలకమైన ఆర్థిక శాఖ మంత్రిగా ఉండగానే అరుణ్ జైట్లీ మూత్రపిండాల సమస్యతో బాధపడ్డారు. అమెరికాలో శస్త్రచికిత్స నిమిత్తం వెళ్లారు కూడా. ఆప్పుడు ఆర్థిక శాఖ మంత్రిత్వ బాధ్యతలను పీయూష్ గోయల్ పర్యవేక్షించారు. 

అనారోగ్యం నుంచి కోలుకోకపోవడంతో రెండోసారి మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా మంత్రి పదవి తీసుకోవడానికి వెనుకడగు వేశారు. మోదీ ఎంత బ్రతిమిలాడినా అనారోగ్య కారణాల దృష్ట్యా కేంద్రమంత్రి వర్గంలో చేరలేదు.