శ్రీలంక రాజధాని కొలంబోలో ఇటీవల బాంబు దాడులు కలకలం రేపిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ కాల్పులు... కేరళ రాష్ట్రంలో ప్రకంకనలు సృష్టిస్తున్నాయి. కేరళలో ఆత్మాహుతి దాడికి కుట్రపన్ని సోమవారం ఎన్‌ఐఏ చేతికి చిక్కిన 29 ఏళ్ల ఐఎస్‌ ఉగ్రవాది రియాజ్‌ విచారణలో సంచలన విషయాలు వెల్లడించాడు. 

తాను ఏడాదిగా శ్రీలంకకు చెందిన జహ్రన్‌ హషీం, జకీర్‌ నాయక్‌ల ప్రసంగాలు, వీడియోలను ఫాలో అవుతున్నానని, కేరళలో ఆత్మాహుతి దాడిని చేపట్టాలని భావించానని విచారణలో రియాజ్‌ వెల్లడించినట్టు ఎన్‌ఐఏ పేర్కొంది. శ్రీలంక బాంబు పేలుళ్ల సూత్రధారి హషీం ప్రసంగాలతో తాను స్ఫూర్తి పొందానని రియాజ్‌ చెప్పాడు.

మరోవైపు ఐఎస్‌ ఆపరేటివ్‌ అబ్దుల్‌ రషీద్‌ అబ్దుల్లాతో కూడా తాను సంప్రదింపులు జరిపానని కేరళలోని పలక్కాడ్‌ జిల్లాకు చెందిన రియాజ్‌ వెల్లడించాడు. సిరియాకు చెందిన మరో ఐఎస్‌ అనుమానిత ఉగ్రవాది అబు ఖలీద్‌తో తాను ఆన్‌లైన్‌ చాట్‌ చేసినట్టు నిందితుడు తెలిపాడు. కాగా రియాజ్‌ను మంగళవారం కొచిన్‌లోని ఎన్‌ఐఏ కోర్టు ఎదట హాజరుపరచనున్నారు.