2016 నుంచి 2021 కాలంలో సుమారు 7.5 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. కాగా, సుమారు 6 వేల మంది భారత పౌరసత్వాన్ని పొందారు. భారత పౌరసత్వాన్ని తమ వ్యక్తిగత కారణాల రీత్య రద్దు చేసుకుని విదేశాలకు తరలి స్థిరపడ్డారు. ఎక్కువగా అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్లిపోయారు. వీటితోపాటు మన పొరుగు దేశాలకూ వెళ్లినవారున్నారు. 

న్యూఢిల్లీ: ప్రపంచీకరణ అనంతరం ఒక దేశం నుంచి మరో దేశానికి వలస వెళ్లి అక్కడే స్థిరపడటం సర్వసాధారణం అయిపోయింది. ఈ వలసలు అభివృద్ధి చెందుతున్న మూడో ప్రపంచ దేశాల నుంచి అభివృద్ధి చెందిన దేశాలకు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఉన్నత చదువులు చదివిన తర్వాత సంపన్న దేశాల్లో కొలువులు చేయడం, ఆ తర్వాత అక్కడే పౌరసత్వం తీసుకుని జీవించడం జరుగుతున్నాయి. ఇలా ఒక దేశంలో కొత్తగా పౌరసత్వం తీసుకోవడం, గత పౌరసత్వాన్ని వదులుకోవడం చాలా కామన్ విషయం. ఈ లెక్కలు ఎక్కువగా ఆ దేశ ఆర్థిక పురోగతి లేదా అభివృద్ధిని బట్టి ఆధారపడుతుంటాయి. మన దేశ పౌరసత్వం గురించి బడ్జెట్ సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం చెప్పిన వివరాలు ఇలా ఉన్నాయి.

2016 నుంచి 2021 మధ్య భారత పౌరసత్వాన్ని సుమారు 7.5 లక్షల మంది త్యజించారు. కాగా, సుమారు ఆరు వేల మంది విదేశీయులు భారత పౌరసత్వం పొందారు. రాజ్యసభలో కేంద్ర విదేశాంగ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల ప్రకారం, 2016 నుంచి 2021 మధ్య కాలంలో 7,49,765 మంది భారతీయులు తమ భారత పౌరసత్వాన్ని వదులుకున్నారు. ఇందులో అత్యధికంగా 2019లో 1.44 లక్షల మంది ఆ తర్వాత 2016లో 1.41 లక్షల మంది భారత పౌరసత్వాన్ని త్యజించారు. కాగా, 2020లో ఈ సంఖ్య భారీగా తగ్గింది. ఇందులో చాలా మంది తమ వ్యక్తిగత కారణాలతో వేరే దేశాలకు తరలివెళ్లపోవడమే ప్రధాన కారణంగా ఉన్నది. అందులోనూ ఎక్కువ మంది అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ దేశాలకు వెళ్లిపోయారు. 2017 నుంచి భారత పౌరసత్వాన్ని వదులుకున్నవారిలో ఈ నాలుగు దేశాలకే 82 శాతం మంది తరలిపోయారు. కాగా, అత్యధికంగా 2019లో పౌరసత్వాన్ని త్యజించినప్పుడు 85 శాతం మంది ఈ నాలుగు దేశాలకే వెళ్లిపోయారు.

2017 లో కనీసం 2.56 లక్షల మంది భారత పౌరసత్వాన్ని వదలి అమెరికాకు వెళ్లిపోగా, 91 వేల మంది కెనడాకు వెళ్లిపోయారు. 2020లో ఏడుగురు, 2021లో 24 మంది పాకిస్తాన్ దేశానికి వెళ్లిపోయినట్టు కేంద్ర ప్రభుత్వ వివరాలు తెలిపాయి. 2017 నుంచి 2021 కాలంలో 2,174 మంది భారత పౌరులు పౌరసత్వాన్ని విడిచి చైనాకు వెళ్లిపోయారు. కాగా, అదే కాలంలో 94 మంది శ్రీలంకకు వెళ్లారు. కాగా, మ్యాన్మార్‌కు ఏడుగురు, బంగ్లాదేశ్‌కు 20 మంది, నేపాల్‌కు 134 మంది తరలివెళ్లిపోయారు.

కాగా, 2016 నుంచి 2021 మధ్య కాలంలో 5,891 మంది విదేశీయులకు భారత పౌరసత్వాన్ని కల్పించారు. 2018 నుంచి 2021 మధ్యకాలంలో భారత పౌరసత్వం కోసం 8,244 మంది విదేశీయులు దరఖాస్తు చేసుకున్నారు. పాకిస్తాన్, బంగ్లాదేశ్, ఆఫ్ఘనిస్తాన్‌లలోని హిందు, సిక్కులు, జైనులు, క్రిస్టియన్ మైనార్టీలే భారత పౌరసత్వానికి దరఖాస్తు చేసుకున్నారు. 2018 నుంచి వీరిలో 3,117 మందికి భారత పౌరసత్వం లభించింది. కాగా, 2021 డిసెంబర్ వరకు పాకిస్తాన్ నుంచి 7,306, ఆఫ్ఘనిస్తాన్ నుంచి 1,152 సహా మొత్తం 10,635 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి.