Asianet News TeluguAsianet News Telugu

ఆర్మీ స్పోర్ట్స్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరు పెట్టిన కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్

టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకాన్ని సాధించిన నీరజ్ చోప్రాకు మరో అరుదైన గుర్తింపు దక్కింది. మహారాష్ట్ర పూణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరును పెట్టింది. కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్టేడియానికి నీరజ్ చోప్రా పేరుపెట్టారు. అనంతరం ఒలింపిక్స్‌లో పాల్గొన్న క్రీడాకారులందరినీ ఆయన అభినందించారు.

army sports institute stadium named after neeraj chopra, athletes felicitated by defence minister rajnath singh
Author
Mumbai, First Published Aug 28, 2021, 3:02 PM IST

న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత్‌కు బంగారు పతకాన్ని అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాకు మరో అరుదైన గౌరవం దక్కింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆయనకు సత్కారం చేశారు. అనంతరం మహారాష్ట్రలో పూణెలోని ఆర్మీ స్పోర్ట్స్ ఇన్‌స్టిట్యూట్‌కు నీరజ్ చోప్రా పేరు పెట్టారు. అంతేకాదు, టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొన్న రక్షణ శాఖ బలగాలనూ ఆయన అభినందించారు.

టోక్యో ఒలింపిక్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో నీరజ్ చోప్రా భారత్‌కు తొలి స్వర్ణాన్ని అందించారు. ఇండివిడువల్ కేటగిరీలో రెండో బంగారాన్ని తీసుకొచ్చారు. షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా పసిడి పతకాన్ని సాధించిన సంగతి తెలిసిందే.

ఆర్మీ స్పోర్ట్స్ స్టేడియానికి తన పేరు పెట్టినందుకు నీరజ్ చోప్రా సంతోషాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర ప్రభుత్వం స్టేడియానికి తన పేరు పెట్టినందుకు ఉన్నతమైన గౌరవాన్ని పొందినట్టు పేర్కొన్నారు. ఇంకా మరెందరో అథ్లెట్లు భారత్‌ను మరింత ఉన్నత శిఖరాలకు చేరుస్తారని ఆశిస్తున్నట్టు తెలిపారు. ఏఎస్ఐ పూణెకు ధన్యవాదాలు తెలుపుతూ ట్వీట్ చేశారు.

ఒలింపియన్లు సంతకం పెట్టిన శాలువాను కేంద్ర మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌కు బహూకరించారు. తరుణ్‌దీప్ రాయ్, ప్రవీణ్ జాదవ్, అమిత్, మనీష్ కౌశిక్, సతీశ్ కుమార్, సీఏ కుట్టప్ప, చోటేలాల్  యాదవ్, దీపక్ పూణియా, అర్జున్ లాల్ జాట్, అరవింద్ సింగ్, విష్ణు సరవణన్, నీరజ్ చోప్రాలను కేంద్రం మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

‘మీరంతా కేవలం ప్లేయర్లే కాదు, భారత యువతకు లీడర్లు. ఫాలోయర్లకు సరైన దిక్సూచీ చూపించాల్సిన బాధ్యత లీడర్లపై ఉంటుంది. వచ్చే రోజుల్లో భారత్‌ను క్రీడారంగంలో దిగ్గజంగా మార్చడానికి అందరు తీర్మానించుకోవాలి. ఈ క్రీడాకారులందరినీ చూశాకా.. తన నమ్మకం నిజమువుతందని అనిపిస్తున్నది. మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ క్రీడలపై ప్రత్యేకాసక్తులు చూపిస్తున్నారు’ అని వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios