భద్రతా బలగాలు మళ్లీ పొరపాటు పడ్డాయి. నాగాలాండ్ లోని మోన్ జిల్లాలో జరిగిన ఘటన మరవక ముందే అరుణాచల్ ప్రదేశ్ లో ఇలాంటి ఘటన జరిగింది. ఇద్దరు సాధారణ పౌరులపై ఆర్మీ పొరపాటున కాల్పులు జరిపింది. అయితే ఆ పౌరులు ప్రస్తుతం క్షేమంగానే ఉన్నారు. హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.
అరుణాచల్ ప్రదేశ్ లో ఘోరం జరిగింది. ఆర్మీ సిబ్బంది ఇద్దరు పౌరులపై కాల్పులు జరిపింది. ఈ ఘటన శుక్రవారం రాత్రి సమయంలో జరిగింది. కాగా ఈ ప్రమాదాన్ని ఆర్మీ వర్గాలు శనివారం వెల్లడించాయి. ప్రస్తుతం బాధితులు ఇద్దరూ క్షేమంగానే ఉన్నారని, ప్రాణాపాయం ఏమీ లేదని అధికారులు తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి వివరాలు ఇలా ఉన్నాయి. అరుణాచల్ ప్రదేశ్ లోని తిరాప్ జిల్లాలో నోక్ఫ్యా వాంగ్దాన్ (28), రామ్‌వాంగ్ వాంగ్సు (23) అనే ఇద్దరు గ్రామస్తులు నదిలో చేపలు పట్టి ఇంటికి తిరిగి వస్తున్నారు. ఈ సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఆర్మీ సిబ్బంది వారిని దుండగులుగా భావించి కాల్పులు జరిపింది. దీంతో వారికి బుల్లెట్ గాయాలు అయ్యాయి.
అనంతరం తమ పొరపాటును గుర్తించిన సైన్యం వెంటనే వారిని దిబ్రూఘర్‌లోని అస్సాం మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ కు చికిత్స కోసం తరలించింది. గాయపడిన వారిలో ఒకరి చేతి ఉల్నాలో బుల్లెట్ తగిలిందని, మరొకరి కాలిపై బుల్లెట్ తగిలిందని AMCH సూపరింటెండెంట్ డాక్టర్ ప్రశాంత దిహింగియా తెలిపారు. ఇద్దరూ ప్రస్తుతం ప్రమాదం నుండి బయటపడ్డారని ఆయన వెల్లడించారు.
గాయపడిన వారితో పాటు ఆసుపత్రికి వెళ్లిన ఓ గ్రామస్తుడు ఈ ఘటన గురించి మీడియాతో మాట్లాడుతూ.. . ఆర్మీ సిబ్బందే మొదట వారిపై కాల్పులు జరిపారని చెప్పారు. ‘‘ గాయపడిన ఇద్దరూ అనాథలు. ఇప్పుడు వారిలో ఒకరి చేతికి, మరొకరి కాలికి గాయమైంది. వారిని ప్రభుత్వం ఆదుకోవాలి’’ అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై తిరప్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు కమ్రాంగ్ తెసియా మాట్లాడుతూ.. స్థానికుల భద్రత కల్పించే బదులు సరైన నిఘా లేకుండా భద్రతా బలగాలు కాల్పులు జరుపుతున్నాయని, ఇది తెలివి లేని చర్య అని ఆయన అభివర్ణించారు. ఇది ఆర్మీ సిబ్బంది విశ్వసనీయతను కోల్పోయేలా చేస్తోందన్నారు.
ఇదిలా ఉండగా.. అరుణాచల్ ప్రదేశ్‌లోని తిరప్, చాంగ్‌లాంగ్, లాంగ్‌డింగ్‌తో సహా మూడు జిల్లాల్లో వివాదాస్పద చట్టం AFSPAని కేంద్రం ఇటీవలే పొడగించింది. ఈ చట్టం ఈ జిల్లాలో ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని తెలిపింది. ఈ చట్టం సాయుధ దళాలకు ప్రత్యేక అధికారాలు కట్టబెట్టింది. దీని వల్ల బలగాలకు వారెంట్ లేకుండా ఒక వ్యక్తిని అరెస్టు చేసే అధికారం ఉంటుంది. అలాగే వారెంట్ లేకుండా ఇంట్లోకి ప్రవేశించవచ్చు. అలాగే అక్కడ సెర్చింగ్ కూడా నిర్వహించవచ్చు.
ఈ చట్టం జమ్మూ కాశ్మీర్‌తో పాటు, నాగాలాండ్, అస్సాం, మణిపూర్ (ఇంఫాల్‌లోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు మినహా), అరుణాచల్ ప్రదేశ్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఈ వివాదాస్పద చట్టం వర్తిస్తుంది. అయితే ఈ వివాదస్పద చట్టంపై చాలా ఏళ్లుగా విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ చట్టం ముసుగులో ఈశాన్య ప్రాంతాల్లో సాయుధ బలగాలు అమాయకులపై, మహిళలపై అనుచితంగా ప్రవర్తిస్తున్నాయనే ఆరోపణలు కూడా ఉన్నాయి. గతేడాది డిసెంబర్‌లో నాగాలాండ్‌లో మోన్ జిల్లాలోని ఓటింగ్ గ్రామంలో పారా కమాండోలు.. ఉగ్రవాదులుగా భావించి సాధారణ పౌరులపై కాల్పులు జరపడంతో 14 మంది మరణించారు. ఆ ఘటనతో సాయుధా దళాల ప్రత్యేక అధికారాల చట్టాన్ని ఉపసంహరించుకోవాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. ఈ నాగాలాండ్ లో ఘటన జరిగిన మూడు నెలల వ్యవధిలోనే మరో ఘటన చోటు చేసుకోవడం విచారకం.
